రైల్వే జోన్‌కూ హోదా గతే!

ABN , First Publish Date - 2022-09-28T08:06:32+05:30 IST

మరో విభజన హామీకి కేంద్రం తిలోదకాలిచ్చింది. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని ఇప్పటికే తేల్చేసిన కేంద్ర ప్రభుత్వం.. తాజాగా విశాఖ కేంద్రంగా నూతన రైల్వే జోన్‌ ఏర్పాటు సాధ్యం కాదని తేల్చిచెప్పేసింది. జగన్‌ నోరు తెరచి అడగనందునే రాష్ట్రానికి తీరని అన్యాయం...

రైల్వే జోన్‌కూ హోదా గతే!

ఏర్పాటు సాధ్యం కాదు!

లాభదాయకం కాదనే డీపీఆర్‌నూ ఖరారు చేయలేదు

రైల్వే బోర్డు చైర్మన్‌ స్పష్టీకరణ.. మరో విభజన హామీకి నీళ్లొదిలిన కేంద్రం

జగన్‌ నోరుతెరచి అడగని ఫలితం!.. విభజన హామీలపై ఢిల్లీలో భేటీ

జోన్‌ అంశం కేంద్ర కేబినెట్‌కు నివేదించాలని హోం కార్యదర్శి సూచన

రాజధాని నిర్మాణానికి 29 వేల కోట్లివ్వండి: ఏపీ

శివరామకృష్ణన్‌ కమిటీ సిఫారసు చేసిందని వెల్లడి

సంస్థల విభజనపై న్యాయ సలహా.. సింగరేణి విభజనకు తెలంగాణ నో


న్యూఢిల్లీ, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి): మరో విభజన హామీకి కేంద్రం తిలోదకాలిచ్చింది. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని ఇప్పటికే తేల్చేసిన కేంద్ర ప్రభుత్వం.. తాజాగా విశాఖ కేంద్రంగా నూతన రైల్వే జోన్‌ ఏర్పాటు సాధ్యం కాదని తేల్చిచెప్పేసింది. జగన్‌ నోరు తెరచి అడగనందునే రాష్ట్రానికి తీరని అన్యాయం జరుగుతోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విభజన చట్టంలో పేర్కొన్న హామీల్లో ఒక్కోదానికి తూట్లు పొడుస్తున్నా కేంద్రాన్ని జగన్‌ ప్రభుత్వం గట్టిగా ప్రశ్నించడంలేదు. ఇవేకాకుండా ఉమ్మడి రాష్ట్రంలోని ఆయా సంస్థల ఆస్తులు, అప్పుల విభజన దిశగానూ సీరియస్‌గా చొరవ తీసుకోవడం లేదు. ఇది మంగళవారం మరోసారి స్పష్టమైంది.


విభజన సమస్యలు, హామీలపై ఢిల్లీలో కేంద్ర హోం శాఖ సమావేశం నిర్వహించింది. కేంద్ర హోం కార్యదర్శి అజయ్‌ కుమార్‌ భల్లా అధ్యక్షతన రెండు గంటలకుపైగా జరిగిన అత్యున్నత స్థాయి భేటీలో ఉభయ రాష్ట్రాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 14 అంశాలపై చర్చ జరిగింది. ఉమ్మడి అంశాలు కాకుండా కేవలం తెలంగాణకు సంబంధించిన హామీలపై హోం శాఖ కార్యదర్శి సానుకూలంగా స్పందించి వేగంగా నిర్ణయం తీసుకోవాలని సంబంధిత శాఖలను ఆదేశించారు. ఏపీకి సంబంధించిన హామీలపై ఆయన ఎలా స్పందించారో రాష్ట్ర అధికారులు స్పష్టత ఇవ్వకపోవడం అనుమానాలకు తావిస్తోంది.


డీపీఆర్‌ ఖరారు కాలేదు..!!

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. నూతన రైల్వే జోన్‌ ఏర్పాటు సాధ్యం కాదని, అది లాభదాయకం కాదని రైల్వే బోర్డు చైర్మన్‌ ఈ సమావేశంలో తేల్చిచెప్పారు. అందువల్లే సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌)ను ఇంకా ఖరారు చేయలేదన్నారు. దీనిపై అజయ్‌ భల్లా తీవ్రంగా స్పందించారు. రైల్వే జోన్‌ సాధ్యం కాదన్న విషయం అధికారుల స్థాయిలో నిర్ణయించడం సరికాదని.. ఇదే విషయాన్ని వివరిస్తూ కేంద్ర కేబినెట్‌కు నోట్‌ పంపించాలని సూచించారు. రాష్ట్ర విభజన చట్టంలో స్పష్టంగా జోన్‌ ఏర్పాటు హామీ ఉందని, రాజకీయపరమైన నిర్ణయం కాబట్టి మంత్రివర్గానికి నివేదిస్తే.. సమగ్రంగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు.


రాజధాని నిర్మాణంపై జగన్‌ ప్రభుత్వం కొత్త వాదన తెరపైకి తీసుకొచ్చింది. కేంద్రం ఇస్తామన్న నిధులను రాబట్టుకోకుండా.. సాధ్యం కాని ప్రతిపాదనను దాని ముందుంచింది. చంద్రబాబు హయాంలో రాజధాని అమరావతి నిర్మాణానికి రూ.2,500 కోట్లు మంజూరు చేసిన కేంద్రం.. ఇప్పటికే రూ.1,500 కోట్లను విడుదల చేయడం, మిగతా రూ.1,000 కోట్లు పెండింగ్‌పై సమావేశంలో చర్చకొచ్చింది. ఆ వెయ్యి కోట్లు ఇవ్వాలంటే.. గతంలో విడుదల చేసిన రూ.1,500 కోట్ల ఖర్చుకు యుటిలైజేషన్‌ సర్టిఫికెట్లు, వివరాలతో నివేదికను అందించాలని ఏపీ అధికారులకు హోం కార్యదర్శి సూచించారు. అయితే రాష్ట్ర అధికారులు కొత్త వాదన లేవనెత్తారు. రాజధాని నిర్మాణానికి రూ.29 వేల కోట్లు ఇవ్వాలని శివరామకృష్ణన్‌ కమిటీ సిఫారసు చేసిందని, ఆ మొత్తాన్ని ఇవ్వాలని వారు ప్రతిపాదించారు. 


పన్నుల అంశాల్లో లోపాలు..

రాష్ట్ర విభజన చట్టంలోని 50, 51, 56 సెక్షన్లలో పేర్కొన్న పన్నుల సంబంధిత అంశంలో లోపాలను తొలగించడానికి విభజన చట్టాన్ని సవరించాలని ఏపీ  అధికారులు విజ్ఞప్తి చేశారు. దీనిపై తెలంగాణ అధికారులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన జరిగిన 8 ఏళ్ల తర్వాత చట్టాన్ని సవరించడం సరికాదన్నారు. డెక్కన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ల్యాండ్‌ హోల్డింగ్స్‌ లిమిటెడ్‌, ఏపీ డెయిరీ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌, ఉమ్మడి రాష్ట్ర ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ విభజన అంశాలు కోర్టుకెళ్లిన నేపథ్యంలో.. కేంద్ర న్యాయ శాఖను సంప్రదించి అన్ని కోర్టు కేసులనూ అధ్యయనం చేయాలని కేంద్ర అధికారులను భల్లా ఆదేశించారు. సింగరేణికి ఆంధ్రప్రదేశ్‌లోనూ ఆస్తులు ఉన్న రీత్యా ఆ సంస్థ ఆస్తులను కూడా విభజించాలని ఏపీ అధికారులు ప్రతిపాదించగా.. తెలంగాణ అధికారులు అభ్యంతరం చెప్పారు. సింగరేణిని విభజించే ప్రశ్నే లేదన్నారు. ఆప్మెల్‌ కూడా సింగరేణి అనుబంధ సంస్థ అని, దానినీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ఉన్న ఈక్విటీ మేరకు విభజించాలని స్పష్టం చేశారు. ఈ అంశంపై అధ్యయనం చేయాలని సంబంధిత అధికారులకు హోం కార్యదర్శి సూచించారు. రాష్ట్ర విభజన చట్టంలో 12 సంస్థల ప్రస్తావన లేదని, వాటిని కూడా విభజించాలని ఆంధ్ర అధికారులు కోరారు. దానిని వ్యతిరేకించిన తెలంగాణ అధికారులు.. ఆ సంస్థలను విభజిస్తే రాష్ట్ర విభజన చట్టానికి సవరణలు చేసినట్లు అవుతుందని, సంస్థల విభజన అంశం ఎప్పటికీ ముగియదని స్పష్టం చేశారు. దీనిపై కేంద్ర న్యాయ శాఖ సలహా తీసుకోవాలని అధికారులకు భల్లా సూచించారు.


నగదు, బ్యాంకు బ్యాలెన్సు విభజన (కేంద్ర ప్రాయోజిత పథకాల నిధులు, ఉమ్మడి సంస్థల వ్యయం, విదేశీ సహకారంతో చేపట్టిన ప్రాజెక్టుల అప్పులు) అంశాల పరిష్కారానికి కంపో్ట్రలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) సహకారం తీసుకోవాలని సమావేశంలో నిర్ణయించారు. సమావేశంలో సీఎస్‌ సమీర్‌ శర్మ, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌ఎస్‌ రావత్‌, కార్యదర్శి నటరాజ్‌ గుల్జార్‌, రోడ్లు భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్‌, పౌర సరఫరాల కమిషనర్‌ అరుణ్‌ కుమార్‌, జీఏడీ ముఖ్యకార్యదర్శి ప్రేమ్‌చంద్రా రెడ్డి, ఏపీ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌ ప్రవీణ్‌ ప్రకాశ్‌.. తెలంగాణ సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌, విద్యుత్‌, ఆర్థిక శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు సునీల్‌ శర్మ, కె.రామకృష్ణారావు, సీనియర్‌ అధికారులు జయేశ్‌ రంజన్‌, కేఎస్‌ శ్రీనివాసరాజు, అనిల్‌ కుమార్‌, తెలంగాణ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌ గౌరవ్‌ ఉప్పల్‌తోపాటు కేంద్ర రైల్వే, విద్యా, విద్యా, రెవెన్యూ తదితర శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2022-09-28T08:06:32+05:30 IST