ఇదేం విగ్రహ వివక్ష?

ABN , First Publish Date - 2022-10-05T08:51:09+05:30 IST

ఇదేం విగ్రహ వివక్ష?

ఇదేం విగ్రహ వివక్ష?

గుంటూరు నగరం నిండా వైఎస్‌ విగ్రహాలే

ఇప్పటికే దాదాపు 252 విగ్రహాలు ఏర్పాటు

మండల్‌, బాలు విగ్రహాలపై  మాత్రం నో

రాత్రికి రాత్రే దిమ్మెలు పెకిలించిన వైనం


గుంటూరు(కార్పొరేషన్‌), అక్టోబరు 4: విగ్రహాల ఏర్పాటుకు అనుమతుల్లో అధికారులు నిగ్రహం పాటించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గుంటూరు నగరాన్ని మాజీ సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహాలతో నింపేసిన అధికారులు.. ఇతర నేతల విగ్రహాల ఏర్పాటుకు మాత్రం ససేమిరా అంటున్నారు. వీరి తీరు చూసినవారు.. ఇదేం విగ్రహ వివక్ష అంటూ విస్తుపోతున్నారు. ఎటువంటి అనుమతులు లేకుండా గుంటూరు నగరం పరిధిలో జనం రద్దీ ఎక్కువగా ఉండే ప్రధాన కూడళ్లు, జంక్షన్లు, రోడ్డు మూలలు... ఇలా అనేక ప్రాంతాల్లో వైఎస్‌ విగ్రహాలు పెట్టేస్తున్నారు. ఒక్క గుంటూరులోనే ఆయనవి సుమారు 252 విగ్రహాలు ఏర్పాటయ్యాయి. దీంతో నగరంలో ఎక్కడ చూసినా, ఎటువైపు వెళ్లినా కుప్పలుతెప్పలుగా వైఎస్‌ విగ్రహాలే దర్శనమిస్తాయి. అదే సమయంలో బీసీల ఆరాధ్యదైవం బీపీ మండల్‌, ప్రఖ్యాత గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహాల ఏర్పాటును మాత్రం పోలీసులు అడ్డుకుంటున్నారు. రాత్రికి రాత్రే జీఎంసీ అధికారులు వీటిని తొలగించేస్తున్నారు. రాజశేఖర్‌రెడ్డి విగ్రహాలకు వర్తించని నిబంధనలు వీరి విగ్రహాలకు వర్తింపచేయడంలో జీఎంసీ అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై సర్వత్రా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గుంటూరు పరిధిలోని ఇన్నర్‌రింగ్‌రోడ్డులో బీపీ మండల్‌ విగ్రహ ఏర్పాటు దిమ్మెను, లక్ష్మీపురం జంక్షన్లో బాలు విగ్రహాన్ని జీఎంసీ అధికారులు రాత్రికి రాత్రే తొలగించారు. బీపీ మండల్‌ విగ్రహ ఏర్పాటు పనులను నాలుగు రోజుల క్రితమే అడ్డుకున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన దిమ్మెను ధ్వంసం చేశారు. అదేవిధంగా రెండు రోజుల క్రితం ఏర్పాటు చేసిన ఎస్పీ  విగ్రహాన్ని తొలగించి, దిమ్మెని ధ్వంసం చేశారు. 


అందుకే తొలగించాం: గుంటూరు కమిషనర్‌

‘‘మరుగుదొడ్ల పక్కన ఉన్నందునే బాలు విగ్రహం తొలగించాం. అనుమతి లేకుండా అక్కడ కొందరు ఏర్పాటుచేసినట్టు గుర్తించాం. తొలగించిన విగ్రహాన్ని లాడ్జి సెంటర్‌లోని హెచ్‌ఎల్‌ఆర్‌లో భద్రపరిచాం. సమగ్ర అనుమతులతో గుంటూ రు నాజ్‌ సెంటర్‌లో బాలు విగ్రహం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నాం’’ 

Read more