గాంధీజీ, తిలక్‌ కంటే గొప్పోళ్లా?

ABN , First Publish Date - 2022-07-29T09:44:53+05:30 IST

గాంధీజీ, తిలక్‌ కంటే గొప్పోళ్లా?

గాంధీజీ, తిలక్‌ కంటే గొప్పోళ్లా?

కోర్టు ముందు హాజరవడానికి మీకు టైమే లేదా?

భవిష్యత్‌లో ఇలా చేస్తే నాన్‌-బెయిలబుల్‌ వారెంటే

సీఎం ప్రత్యేక సీఎస్‌ జవహర్‌రెడ్డిపై హైకోర్టు ఫైర్‌


అమరావతి, జూలై 28 (ఆంధ్రజ్యోతి): కోర్టు ధిక్కరణ కేసులో వివరణ ఇచ్చేందుకు న్యాయస్థానం ముందు హాజరుకాని సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కేఎస్‌ జవహర్‌రెడ్డి పై హైకోర్టు మండిపడింది. ‘కోర్టు ముందు హాజరయ్యేందుకు కూడా సమయం లేదా.. సమావేశం ఉందనే పేరుతో గైర్హాజరవుతారా.. ఉదయం నుంచి సాయంత్రం వరకు సమావేశాలు ఉంటాయా’ అని నిలదీసింది. సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా రోజుకు ఎన్ని గంటలు సమావేశాల్లో పాల్గొంటున్నారో సీఎం పేషీ నుంచి వివరాలు తెప్పించమంటారా అని ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించింది. ‘న్యాయస్థానాల ఆదేశాలపై ఉన్న గౌరవంతో మహాత్మాగాంధీ, తిలక్‌ లాంటి మహోన్నత వ్యక్తులే కోర్టు ముందు హాజరయ్యారు.. వారి కన్నా గొప్పోళ్లా.. వీళ్లెంత’ అని ఘాటు వ్యాఖ్యలు చేసింది. సంబంధిత అధికారి దాఖలు చేసిన హాజరు మినహాయింపు పిటిషన్‌లో కనీస వివరాలు లేవని.. సమావేశం ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు జరుగుతుంది.. ఎన్ని గంటలకు మీటింగ్‌ ప్రారంభమవుతుందనే వివరాలు కూడా పేర్కొనలేదని అభ్యంతరం తెలిపింది. కోర్టు ఆదేశాలను పాటించకున్నా ఏమీ కాదులే అనే భావనతో ఉండొద్దని స్ప్టష్టం చేసింది. భవిష్యత్‌లో కోర్టు ఉత్తర్వులను జవహర్‌రెడ్డి అమలు చేయలేదని న్యాయస్థానం గుర్తిస్తే ఎలాంటి వివరణ కోరకుండానే తక్షణం ఆయనపై నాన్‌-బెయిలబుల్‌ వారెంటు జారీ చేస్తామని తీవ్రంగా హెచ్చరించింది. వడ్డీతో సహా పిటిషనర్‌కు చెల్లించాల్సింది సుమారుగా రూ.12 లక్షలని.. ఈ వ్యవహారంలోనూ కోర్టు ఆదేశాలను అమలు చేయకపోవడం ఏంటని ప్రశ్నించింది. ఇదేమీ వందల కోట్ల రూపాయల విషయం కాదని పేర్కొంది. నాన్‌-బెయిలబుల్‌ వారెంటు జారీచేస్తేనో.. కోర్టు ముందు హాజరు కావాలని ఆదేశాలిచ్చినప్పుడో మాత్రమే అధికారులు తమ ఆదేశాలు అమలు చేస్తున్నారని తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. పిటిషనర్‌కు వేతన బకాయిలు చెల్లించామని అధికారులు ఇచ్చిన వివరాలను నమోదు చేసిన హైకోర్టు.. కోర్టు ధిక్కరణ వ్యాజ్యాన్ని పరిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ డీవీఎ్‌సఎస్‌ సోమయాజులు గురువారం ఆదేశాలిచ్చారు. సర్వీసు బకాయిల కింద తనకు 2005 మే నుంచి 2019 జూలై వరకు రూ.10.59 లక్షలు చెల్లించాలని గత ఏడాది నవంబరులో కోర్టు ఇచ్చిన తీర్పును అధికారులు అమలు చేయకపోవడాన్ని సవాల్‌ చేస్తూ బొల్లా కృష్ణమూర్తి అనే ఉద్యోగి కోర్టు ధిక్కరణ వ్యాజ్యం దాఖలు చేశారు. అప్పటి జలవనరుల శాఖ ముఖ్యకార్యదర్శి జవహర్‌రెడ్డి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌ఎస్‌ రావత్‌, అప్పటి ఏలూరు ఇరిగేషన్‌ సర్కిల్‌ సూపరింటిండెంట్‌ ఇంజనీర్‌ పి.శ్రీరామకృష్ణ, ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ పి.నాగార్జునరావు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ పి.సుబ్రహ్మణేశ్వరరావును ప్రతివాదులుగా చేర్చారు. ఈ వ్యాజ్యం ఇటీవల విచారణకు రాగా బిల్లులు ఎందుకు చెల్లించలేదో తన ముందు హాజరై వివరణ ఇవ్వాలని జవహర్‌రెడ్డి తదితరులను హైకోర్టు ఆదేశించింది. ఈ వ్యాజ్యం గురువారం మరోసారి విచారణకు వచ్చింది. ఇంజనీర్లు పి.శ్రీరామకృష్ణ, పి.నాగార్జునరావు, పి.సుబ్రహ్మణేశ్వరావు న్యాయస్థానం ముందు హాజరయ్యారు. కోర్టు ఆదేశాల మేరకు పిటిషనర్‌కు బకాయిలు చెల్లించామని వివరించారు. ఎస్‌ఎస్‌ రావత్‌ హాజరు నుంచి ముందుగానే మినహాయింపు పొందారు.  జవహర్‌రెడ్డి హాజరుకాకపోవడాన్ని న్యాయమూర్తి తీవ్రంగా తప్పుబట్టారు. కాగా.. పిటిషనర్‌ తరఫున న్యాయవాది ఎం.పిచ్చయ్య వాదనలు వినిపించారు.

Updated Date - 2022-07-29T09:44:53+05:30 IST