-
-
Home » Andhra Pradesh » Investigate the Ramsingh case urgently-NGTS-AndhraPradesh
-
రామ్‌సింగ్ కేసును అత్యవసరంగా విచారించండి!
ABN , First Publish Date - 2022-09-13T08:14:03+05:30 IST
సీఎం జగన్ చిన్నాన్న, మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ అడిషనల్ ఎస్పీ రామ్‌సింగ్‌పై రాష్ట్ర పోలీసులు నమోదు చేసిన కేసును అత్యవసరంగా విచారించాలని సీబీఐ తరఫున అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్(ఏఎస్‌జీ) హరినాథ్ హైకోర్టును అభ్యర్థించారు.

- వివేకా కేసు విచారణకు రమ్మని కోరడంతోనే ప్రైవేటు ఫిర్యాదులు
- ఈ పరిస్థితి కొనసాగితే విచారణ జాప్యం
- హైకోర్టుకు అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ వినతి
అమరావతి, సెప్టెంబరు 12(ఆంధ్రజ్యోతి): సీఎం జగన్ చిన్నాన్న, మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ అడిషనల్ ఎస్పీ రామ్‌సింగ్‌పై రాష్ట్ర పోలీసులు నమోదు చేసిన కేసును అత్యవసరంగా విచారించాలని సీబీఐ తరఫున అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్(ఏఎస్‌జీ) హరినాథ్ హైకోర్టును అభ్యర్థించారు. హత్య కేసు దర్యాప్తులో భాగంగా విచారణ నిమిత్తం తమ ముందు హాజరుకావాలని పులివెందులకు చెందిన వెంకట కృష్ణారెడ్డి, యాడికి గ్రామానికి చెందిన కె. గంగాధర్ రెడ్డిని కోరగా సీబీఐ ఏఎస్పీ తమను బెదిరిస్తున్నారంటూ ట్రయల్ కోర్టులో ప్రైవేటు ఫిర్యాదులు దాఖలు చేశారని తెలిపారు. ఈ తరహా పరిస్థితులు కొనసాగితే హత్యకేసు దర్యాప్తు ముందుకు సాగదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో గజ్జల ఉదయకుమర్ రెడ్డి ఫిర్యాదు ఆధారంగా రామ్‌సింగ్‌పై పోలీసులు నమోదు చేసిన కేసును అత్యవసరంగా విచారించాలని కోరారు.
మరోవైపు గజ్జల ఉదయకుమార్‌రెడ్డి తరఫు న్యాయవాది స్పందిస్తూ.. వ్యాజ్యంపై తుదివాదనల కోసం విచారణను రెండు వారాలకు వాయిదా వేయాలని అభ్యర్థించారు. ఆ వివరాలను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం విచారణను ఈ నెల 22కి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్. జయసూర్య సోమవారం ఆదేశాలిచ్చారు. వివేకా హత్యకేసులో తప్పుడు సాక్ష్యం చెప్పాలని సీబీఐ ఏఎస్పీ బెదిరిస్తున్నారని పేర్కొంటూ గజ్జల ఉదయకుమార్ రెడ్డి కడప ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్‌కు ప్రైవేటు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేయాలని మెమో రూపంలో దానిని పోలీస్ స్టేషన్‌కు రిఫర్ చేశారు. దీంతో రిమ్స్ పోలీస్ స్టేషన్ అధికారులు సీబీఐ రామ్‌సింగ్‌పై ఐపీసీ సెక్షన్ 195ఏ, 323, 506 రెడ్ విత్ 34 కింద కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో తనపై నమోదు చేసిన కేసును రద్దు చేయాలని కోరుతూ రామ్‌సింగ్ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఎఫ్‌ఐఆర్ ఆధారంగా తదుపరి చర్యలను నిలుపుదల చేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన విషయం తెలిసిందే.