Alluri: విగ్రహం వెలుగులో.. జ్ఞాపకాలు చీకట్లో.. అల్లూరిని ఇలానేనా గుర్తుంచుకునేది..!

ABN , First Publish Date - 2022-07-05T23:35:48+05:30 IST

అఖండ భారతావని జులై 4న అల్లూరి జయంతిని పురస్కరించుకుని ఆ మన్యం వీరుడి త్యాగాన్ని గుర్తుచేసుకుంది. మన తెలుగు బిడ్డ బ్రిటీషర్లపై..

Alluri: విగ్రహం వెలుగులో.. జ్ఞాపకాలు చీకట్లో.. అల్లూరిని ఇలానేనా గుర్తుంచుకునేది..!

అఖండ భారతావని జులై 4న అల్లూరి సీతారామరాజు (Alluri Sitaramaraju) జయంతిని పురస్కరించుకుని ఆ మన్యం వీరుడి త్యాగాన్ని గుర్తుచేసుకుంది. మన తెలుగు(Telugu) బిడ్డ బ్రిటీషర్లపై(Britishers) పోరాడిన తీరును వేనోళ్లా కొనియాడింది. ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)లోని భీమవరం(Bhimavaram)లో అల్లూరి కాంస్య విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) స్వయంగా ఆవిష్కరించారు. ఆ స్వాతంత్ర్య సమరయోధుడి వీరోచిత పోరాటాన్ని జనులందరికీ చాటి చెప్పారు. అంతటి గొప్ప వీరుడిని ఆ ఒక్క రోజు గుర్తుచేసుకుంటే సరిపోతుందా..? ఆయన జ్ఞాపకాలను పదిలపరుచుకోవాల్సిన అవసరం లేదా..? మన తెలుగు బిడ్డ అల్లూరి సీతారామరాజు స్వహస్తాలతో రాసిన లేఖల(letters)ను సంరక్షించుకోవాల్సిన బాధ్యత ఏపీ ప్రభుత్వానికి(AP Govt) లేదా..? ఆ లేఖలను డిజిటలైజ్ చేసి ఆన్‌లైన్‌(Online)లో పదిలపరిస్తే సరిపోతుందా..?బానిస సంకెళ్ల నుంచి దేశానికి విముక్తి కలిగించిన అల్లూరి లాంటి గొప్ప దేశ భక్తుల గురుతులను నిర్లక్ష్యం చేయడం ఎంతవరకూ సమంజసం..? విగ్రహ ఆవిష్కరణలో పాలుపంచుకున్న ప్రభుత్వం అల్లూరి స్వదస్తూరి లేఖలను, ఆయన జ్ఞాపకాలను విస్మరించడం బాధ్యతారాహిత్యం కాదా..? మన్నెం వీరుడు అల్లూరి సీతారామ రాజు జ్ఞాపకాలను ఇకనైనా సంరక్షించుకోవాల్సిన అవసరం లేదా..? అల్లూరి అభిమానులు ఈ ప్రశ్నలకు సమాధానాల కోసం నిరీక్షిస్తున్నారు.తార్నాకలోని ఆంధ్రప్రదేశ్ రాజ్యాభిలేఖ పరిశోధనాలయం(Andhrapradesh RajyabhileKha parishodanaalayam)లో అల్లూరి సీతారామరాజు రాసిన లేఖలు, ఆ సమయంలో అల్లూరిని అప్పగిస్తే పారితోషికం ఇస్తామని బ్రిటీష్ ప్రభుత్వం(British Govt) చేసిన ప్రకటనలు, జీవోలు కనీస గుర్తింపుకు నోచుకోకుండా అక్కడ ఉన్నాయి. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది 14-06-1922న పైడిపుట్ట గ్రామం నుంచి శ్రీ చెక్కా లింగం దొర(Chekka Lingam Dora)కు రాసిన లేఖ గురించి. అచ్చ తెలుగులో అల్లూరి రాసిన ఈ లేఖ చదివితే ఆయన దయా గుణం, ఔదార్యం ఏంటో అర్థమవుతుంది. తాను నేపాల్ వెళ్లాలని నిర్ణయించుకున్నానని, పైడిపుట్టలో తన 50 ఎకరాలను మీ ఇష్టం వచ్చిన వారికి ఇవ్వవచ్చని తృణప్రాయంగా తన భూమిని ఇచ్చేసిన గొప్ప ఉదారవాది అల్లూరి సీతారామరాజు. తన తల్లి, సోదరుడిని 1922 జూన్‌లో నర్సాపురానికి సీతారామరాజు పంపించారు. ఈ సందర్భంగా తన తల్లి ప్రయాణం గురించి అప్పటి గూడెం తాలూకా డిప్యూటీ తహసీల్దార్ బాస్టిన్‌కు ఆంగ్లంలో అల్లూరి లేఖ రాశారు. ఆ లేఖ కూడా ఆర్కైవ్స్‌లో ఉంది. పెన్సిల్‌తో ఆ లేఖ రాసినట్టుగా ఉంది.అల్లూరి సీతారామరాజుని పట్టుకుంటె రూ 1500_0_0 యినాము, గనర్ణపాలెము గ్రామం కాపరస్తుడు గాంమల్లుదొర, గాంగంటం దొరను పట్టుకుంటె ఇద్దరికీ చెరో రూ 1000_0_0 చొప్పున యినాము ఇస్తామని బ్రిటీష్ ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటన కూడా తార్నాక(Tarnaka)లోని ఆంధ్రప్రదేశ్ రాజ్యాభిలేఖ పరిశోధనాలయంలో ఉంది.1937లో పొన్నలూరి రాధాకృష్ణమూర్తి(Ponnaluru Radhakrishna Murthy) ‘1922 మన్యంలో రైతుల తిరుగుబాటు (అల్లూరి సీతారామరాజు) పేరుతో ఒక పుస్తకాన్ని రాశారు. అల్లూరికి సంబంధించిన ఎన్నో విషయాలను ఈ పుస్తకం ద్వారా ఆయన వెలుగులోకి తెచ్చారు. అయితే.. ఈ పుస్తకంలోని అంశాలు మన్యం ప్రాంతంలోని శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఉన్నాయని ఈ పుస్తకాన్ని నిషేధిస్తూ ఆగస్ట్ 24, 1938న G.O. No.1451ను ‘గవర్నమెంట్ ఆఫ్ మద్రాస్’ పేరుతో బ్రిటీష్ ప్రభుత్వం విడుదల చేసింది. ఈ ప్రకటన తాలూకూ జీవో కూడా ఆర్కైవ్స్‌లో అందుబాటులో ఉంది.ఇంత విలువైన జ్ఙాపకాల సంపదను ఒక ప్రదర్శనశాలలో గానీ, సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండేలా మరే విధంగానైనా చేరువచేసేలా చర్యలు తీసుకోవాలని అల్లూరి అభిమానులు కోరుకుంటున్నారు. మన్యం ప్రాంతంలో ఉండే వారికి అల్లూరి జ్ఙాపకాలను అందుబాటులో ఉంచాలని విశాఖ జిల్లా(Visakha District)కు చెందిన ప్రజలు కూడా అభిప్రాయపడుతున్నారు.

Read more