వైసీపీ సర్కారు మరో రాజ్యాంగ విరుద్ధమైన చర్య

ABN , First Publish Date - 2022-03-16T08:20:38+05:30 IST

అప్పుల వేటలో తప్పు మీద తప్పు చేస్తున్న జగన్‌ సర్కారు ఇప్పుడు మరో రాజ్యాంగ విరుద్ధమైన చర్యకు పాల్పడింది. బేవరేజెస్‌ కార్పొరేషన్‌ నుంచి రూ.40వేల కోట్ల రుణం తేవాలని భావిస్తున్న ప్రభుత్వం... అందుకోసం యథేచ్ఛగా రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడుతోంది.

వైసీపీ సర్కారు మరో రాజ్యాంగ విరుద్ధమైన చర్య

  • వైసీపీ సర్కారు మరో రాజ్యాంగ విరుద్ధమైన చర్య 
  • ఇండియన్‌ మేడ్‌ ఫారిన్‌ లిక్కర్‌ చట్టానికి సవరణ 
  • ట్రేడ్‌, స్పెషల్‌ మార్జిన్‌ ’లెవీ’ కాదంటూ వక్రభాష్యం 
  • ఏపీఎస్‌డీసీకి కేంద్రం బ్రేకులు వేయడంతో కొత్త ఎత్తు 
  • పన్ను ఆదాయం ఖజానాకు రాకుండానే కార్పొరేషన్‌కు
  • గుట్టుచప్పుడు కాకుండా ఆర్డినెన్స్‌

(అమరావతి-ఆంధ్రజ్యోతి) 

అప్పుల వేటలో తప్పు మీద తప్పు చేస్తున్న జగన్‌ సర్కారు ఇప్పుడు మరో రాజ్యాంగ విరుద్ధమైన చర్యకు పాల్పడింది. బేవరేజెస్‌ కార్పొరేషన్‌ నుంచి రూ.40వేల కోట్ల రుణం తేవాలని భావిస్తున్న ప్రభుత్వం... అందుకోసం యథేచ్ఛగా రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడుతోంది. ఖజానాకు వచ్చిన పన్ను ఆదాయాన్ని మళ్లిస్తూ తీసుకొచ్చిన ఏపీఎ్‌సడీసీ మోడల్‌కు కేంద్రం బ్రేకులు వేయడంతో కొత్తగా ఇంకో మోడల్‌ను తెరపైకి తెచ్చింది. ఇప్పుడు పన్ను ఆదాయాన్ని ఖజానాకే రాకుండా చేసి, నేరుగా కార్పొరేషన్‌ ఖాతాలో కలుపుతున్నారు. ఇందుకోసం తొలుత గతేడాది నవంబరులో జీవో 313 ఇచ్చారు. దానిప్రకారం వివిధ ధరలున్న లిక్కర్‌పై సగటున అమలవుతున్న 150శాతం వ్యాట్‌ను సగటున 50శాతానికి తగ్గించారు.


మిగిలిన 100 శాతానికి స్పెషల్‌ మార్జిన్‌ అని పేరు పెట్టారు. వ్యాట్‌తో పాటు, స్పెషల్‌ మార్జిన్‌ రాష్ట్ర ఖజానాకు వస్తుందా, రాదా అనేదానిపై జీవోలో స్పష్టత ఇవ్వలేదు. అయితే ఫిబ్రవరి 28న ప్రభుత్వం ఒక ఆర్డినెన్సు ఇచ్చింది. దానిప్రకారం స్పెషల్‌ మార్జిన్‌... బేవరేజెస్‌ కార్పొరేషన్‌ ఆదాయమని, అదంతా కార్పొరేషన్‌కే వెళ్తుందని స్పష్టత ఇచ్చింది. ఇలా మద్యంపై ఖజానాకు వస్తున్న వ్యాట్‌ను చీల్చి, స్పెషల్‌ మార్జిన్‌ అనే పేరు పెట్టి దాన్ని కార్పొరేషన్‌ ఖాతాలో వేయడం రాజ్యాంగ విరుద్ధం. రాజ్యాంగం ప్రకారం పన్నులు వేసే అధికారం కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థలకు మాత్రమే ఉంది. కాబట్టి లిక్కర్‌పై వ్యాట్‌ విధించే హక్కు రాష్ట్రానికి ఉంటుంది. ఆ డబ్బు ఖజానాకు వచ్చిన తర్వాతే రాజ్యాంగం, చట్టాలకు లోబడి ప్రభుత్వం ఖర్చు చేయవచ్చు. కానీ, ప్రభుత్వం ఖజానాకు రావాల్సిన పన్ను ఆదాయాన్ని పేరు మార్చి కార్పొరేషన్‌కు మళ్లిస్తోంది. ఏపీ ప్రభుత్వం తరపున రాష్ట్రంలో బేవరేజెస్‌ కార్పొరేషన్‌ మద్యం వ్యాపారం చేస్తోంది. కాబట్టి, లెక్కల అకౌంటింగ్‌, ఆడిటింగ్‌ పూర్తయిన తర్వాతే ఆ కార్పొరేషన్‌కి ప్రభుత్వం కేవలం నిర్వహణ ఖర్చులు మాత్రమే ఇవ్వాలి. 


ఆ అధికారం ఎక్కడిది?: మున్సిపల్‌ కార్పొరేషన్లు 74వ రాజ్యాంగ సవరణ ద్వారా ఏర్పాటయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నట్లే వీటికీ రాజ్యాంగ బద్ధత ఉంది. రాష్ట్ర ప్రభుత్వం పన్నులు విధించి వసూలు చేస్తున్నట్టే ఇవి కూడా తమ పరిధిలో పన్నులు విధించి వసూలు చేయగలవు. ఆ డబ్బులు సదరు మున్సిపాలిటీ ఖాతాలోకి వెళ్తాయి. కంపెనీల చట్టం ద్వారా ఏర్పాటైన కార్పొరేషన్లకు పన్నులు విధించే అధికారం ఉండదు. కేవలం అవి అందించే సేవలకు చార్జీలు విధించి, వసూలు చేసుకోవచ్చు. బేవరేజెస్‌ కార్పొరేషన్‌ ప్రభుత్వం తరపున మద్యం వ్యాపారానికి మేనేజర్‌ బాధ్యతలు నిర్వహిస్తోంది. వాటికి అయిన ఖర్చులు మాత్రమే ప్రభుత్వం ఇవ్వాలి. వేల కోట్ల పన్ను ఆదాయాన్ని మళ్లించకూడదు. అయితే రాజ్యాంగ బద్ధంగా ఏర్పాటైన మున్సిపల్‌ కార్పొరేషన్లకు, కంపెనీల చట్టం ద్వారా ఏర్పాటైన కార్పొరేషన్లకు తేడా లేనట్టుగా వైసీపీ సర్కారు వ్యవహరిస్తోంది. ఏకంగా స్పెషల్‌ మార్జిన్‌ పేరుతో రూ5000 కోట్ల పన్ను ఆదాయాన్ని కార్పొరేషన్‌కి మళ్లిస్తోంది. ఏ వ్యాపారం చేసి బేవరేజెస్‌ కార్పొరేషన్‌ ఈ మొత్తం సంపాదించిందన్న ప్రశ్నకు ప్రభుత్వం ఆ ఆర్డినెన్స్‌ ద్వారా సమాధానం చెప్పలేకపోయింది. 


పన్ను ఆదాయంపై రాష్ట్రానికే హక్కు 

పన్నులు ఎవరు వేయాలన్న దానిపై రాజ్యాంగంలోని అధికరణలు స్పష్టంగా చెబుతుంటే... ఏ కార్పొరేషన్‌కైనా ఆ అధికారం దఖలు పరచవచ్చన్నట్టుగా ప్రభుత్వ వైఖరి ఉంది. పన్నులు విధించి, వచ్చిన డబ్బును ఖజానాలో వేసుకునే హక్కును వైసీపీ ప్రభుత్వం జీవో 313, ఫిబ్రవరి 28న ఇచ్చిన ఆర్డినెన్సు ద్వారా బేవరేజెస్‌ కార్పొరేషన్‌కి బదలాయించి రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడింది. లిక్కర్‌పై వ్యాట్‌ని తగ్గించి, స్పెషల్‌ మార్జిన్‌ పేరుతో బేవరేజెస్‌ కార్పొరేషన్‌కు మళ్లించడానికి రాజ్యాంగం అంగీకరించదు. ఆ డబ్బంతా ఖజానాలో జమ కావడం రాష్ట్రం హక్కు. మద్యంపై ఏఆర్‌ఈటీని వేసి, ఆ మొత్తం ఖజానాకు రాగానే దాన్ని ఏపీఎ్‌సడీసీకి మళ్లించి బ్యాంకుల నుంచి తెచ్చిన రూ.23,200 కోట్ల అప్పు వాయిదాలు చెల్లించడాన్నే కేంద్ర ఆర్థికశాఖ తీవ్రంగా తప్పుబట్టింది. దీంతో బ్యాంకులు కూడా వెనక్కు తగ్గాయి. ఈ మోడల్‌కు మధ్యలోనే బ్రేకులు పడ్డాయి కాబట్టి ఈసారి అసలు ఆదాయమే ఖజానాకు రాకుండా మధ్యలోనే కార్పొరేషన్‌కి మళ్లించాలన్న ఆలోచనతో ప్రభుత్వం స్పెషల్‌ మార్జిన్‌ ప్రణాళికను తీసుకొచ్చింది. ఈ మోడల్‌ ఏకంగా రాజ్యాంగ విరుద్ధం. ఏపీఎ్‌సఆర్టీసీ, ట్రాన్స్‌కో, జెన్‌కో, టూరిజం కార్పొరేషన్‌, బీఎ్‌సఎన్‌ఎల్‌ లాంటి అనేక కార్పొరేషన్లు కళ్లెదుటే నిత్యం కార్యకలాపాలు నిర్వహిస్తున్నప్పటికీ తమకేం పట్టనట్టు, రాజ్యాంగంపై కనీస అవగాహన కూడా లేదన్నట్టు ఖజానాకు రావాల్సిన ఆదాయాన్ని కంపెనీల చట్టం ప్రకారం ఏర్పాటైన బేవరేజెస్‌ కార్పొరేషన్‌కి మళ్లిస్తూ ప్రభుత్వం ఆర్డినెన్సు ఇవ్వడంపై ఆర్థిక నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. 


సెక్షన్‌ 4(ఏ) ప్రకారం..:  ఇండియన్‌ మేడ్‌ ఫారిన్‌ లిక్కర్‌ చట్టంలోని సెక్షన్‌ 4(ఏ) ప్రకారం లిక్కర్‌పై ప్రభుత్వం విధించే లెవీ, పన్ను, చార్జీ, డ్యూటీ... పేరు ఏదైనా ఆదాయం మాత్రం ఖజానాకే రావాలి. స్పెషల్‌ మార్జిన్‌ను బేవరేజెస్‌ కార్పొరేషన్‌ ఆదాయంగా చూపించడానికి ఇది అడ్డంకిగా ఉంది కాబట్టి, ఫిబ్రవరి 28న ఇచ్చిన ఆర్డినెన్సులో ప్రభుత్వం ఈ సెక్షన్‌లోని 4(బీ) క్లాజును సవరిస్తూ స్పెషల్‌మార్జిన్‌ లేదా ట్రేడ్‌ మార్జిన్‌ లెవీ కిందకు రావని తెలిపింది. 4(ఏ)ని సవరించి లిక్కర్‌పై వచ్చే స్పెషల్‌ మార్జిన్‌ ఆదాయాన్ని బేవరేజెస్‌ కార్పొరేషన్‌ ఆదాయంగా పరిగణించాలని పేర్కొంది. 

Updated Date - 2022-03-16T08:20:38+05:30 IST