వైసీపీని నమ్ముకుంటే అధోగతే

ABN , First Publish Date - 2022-07-18T08:20:09+05:30 IST

వైసీపీని నమ్ముకుంటే అధోగతే

వైసీపీని నమ్ముకుంటే అధోగతే

వెనుకబాటుతనంలో బిహార్‌, రాజస్థాన్‌ సరసన ఏపీ

వైసీపీ నేత రాష్ట్రాన్ని ఉద్ధరిస్తాడని ప్రజలు నమ్మారు

ఇప్పుడు వారిలో ఆ భ్రమలన్నీ తొలగిపోయాయి 

సమస్యలపై పోరాడాలంటే జనం భయపడుతున్నారు 

ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు పెడుతున్నారు 

మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తే ఆడపడుచుల 

పసుపు కుంకుమలు రాలిపోతాయి: పవన్‌

మేధావులు, మహిళలు, యువత ఆలోచించాలి : పవన్‌ 


భీమవరం, జూలై 17(ఆంధ్రజ్యోతి): వైసీపీ తిరిగి అధికారంలో వస్తే రాష్ట్రం ఆధోగతి పాలవుతుందని జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ స్పష్టం చేశారు. ప్రజలు ఎంతో నమ్మకంతో అధికారాన్ని కట్టబెడితే వెనుకబాటుతనంలో బిహార్‌, రాజస్థాన్‌ రాష్ట్రాల సరసన ఏపీని చేర్చేశారని ఆగ్రహం వ్యక్తం  చేశారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో శుక్రవారం జనవాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. పశ్చిమగోదావరి, ఏలూరు, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి జిల్లా నుంచి అధిక సంఖ్యలో ప్రజలు హాజరై సమస్యలను పవన్‌ దృష్టికి తీసుకువెళ్లారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 3గంటల వరకు ఆయన ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘వైసీపీ నేత రోడ్ల మీద తిరిగితే రాష్ట్రాన్ని ఉద్ధరిస్తారని నమ్మారు. ఇప్పుడు ఆ భ్రమలన్నీ తొలగిపోయాయి. అధికారంలోకి వచ్చీ రాగానే జనాల పొట్ట కొట్టడం మొదలుపెట్టారు. ముందుగా రాష్ట్రంలో 30లక్షల మంది భవన నిర్మాణ కార్మికులను రోడ్డున పడేశారు. ఆ రోజు నుంచి జనసేన పోరాడుతునే ఉంది. రాష్ట్రంలో వైసీపీ పాలన ఎమర్జెన్సీకి అమ్మ మొగుడులా మారింది. సమస్యలపై పోరాడాలంటే ప్రజలు భయపడుతున్నారు. ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు. ఇటువంటి దుర్భర పరిస్థితిలో ప్రజల సమస్యలను తెలుసుకుని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు జనవాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ప్రభుత్వం సమస్యలను పరిష్కరించపోతే రాజకీయ నిర్ణయం తీసుకుంటాం... పోరాటం చేస్తాం’ అని పవన్‌ అన్నారు. 


మద్యం బినామీలను బయటపెడతాం 

‘‘నవరత్నాల పేరు చెప్పుకుని అధికారంలోకి వచ్చిన వైసీపీ వాటిని మంటకలిపింది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రతీ సంవత్సరం 20శాతం షాపులను తగ్గిస్తూ ఐదేళ్లలో సంపూర్ణ మద్య నిషేధం అమలు చేస్తామని చెప్పిన సీఎం జగన్మోహన్‌రెడ్డి మద్యం ద్వారా ఆదాయాన్ని పెంచుకుంటున్నారు. మద్యం పైనే రూ.8,300 కోట్లు అప్పు తెచ్చారు. మరో రూ.25వేల కోట్లు మద్యం ద్వారా అప్పు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. వైసీపీ నేతల బినామీలు హైదరాబాద్‌లో కూర్చుని ఏపీ మద్యం అమ్మకాల్లో ప్రతీ లీటరుపై రూ.5 దోపిడీ చేస్తున్నారు. ఆ తరువాతే ఇక్కడ కమీషనర్‌ మద్యం అమ్మకాలపై సంతకం పెడుతున్నారు. ఆ బినామీల జాబితాను బయటపెడతాం’’ అని పవన్‌ హెచ్చరించారు ‘‘రాష్ట్రంలో అమ్ముతున్న నాసిరకం మద్యంతో 5వేల మంది చనిపోయినట్లు అంచనా. మళ్లీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆడపడుచుల పసుపు కుంకుమలు రాలిపోతాయి. ప్రజల సంపాదన అంతా ప్రభుత్వ పెద్దలే భోంచేస్తారు’’ అంటూ పవన్‌ తూర్పారపట్టారు. 


అయోమయంలో విద్యావ్యవస్థ 

‘‘వైసీపీ పాలనలో విద్యావ్యవస్థ సమూలంగా నాశనం అయిపోతోంది. విద్యా కానుక, అమ్మఒడి వంటి పథకాలు అమలు చేస్తున్నామంటూ ప్రజలను మభ్యపెడుతున్నారు. కానీ ప్రాథమిక పాఠశాలలను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేస్తున్నారు. జాతీయ విద్యా విధానంలో భాగంగానే ఇవన్నీ చేస్తున్నామంటూ వైసీపీ మోసం చేస్తోంది. ప్రపంచ బ్యాంకు నుంచి అప్పు తెచ్చిన ప్రభుత్వం దానితో ఒప్పందంలో భాగంగానే విద్యా సంస్కరణలు చేపడుతోంది. దీనిపై యువత, మేధావులు, మహిళలు ఆలోచించాలి. రాష్ట్రంలో వైసీపీ పాలనను అంతమొందించేందుకు నడుం బిగించాలి’’ అని పవన్‌ పిలుపునిచ్చారు. ‘‘రాష్ట్రంలో నిరుద్యోగం తాండవిస్తోంది. యువత ప్రశ్నించకూడదని, గంజాయి మత్తులో మునిగేలా చేస్తున్నారు. ప్రశ్నించే ప్రత్యర్థులపై దాడి చేసేందుకు చీఫ్‌ సెక్రటరీ నుంచి కలెక్టర్‌, రెవెన్యూ యంత్రాగాన్ని రంగంలోకి దించుతున్నారు. ప్రధానంగా సినిమా టికెట్ల అమ్మకాల్లో అధికారులందరినీ నిమగ్నం చేస్తున్నారు. నా ఆర్థిక మూలాలను దెబ్బకొట్టేందుకు ప్రయత్నిస్తే భయపడను. మేము ఇక్కడే పుట్టాం... పెరిగాం. మేం భయపడం. ప్రశ్నిస్తాం. స్పందిస్తే సంతోషిస్తాం... స్పందించకపోతే నిలబడతాం... కలబడతాం. దెబ్బలు తినేందుకు, ప్రజల కోసం జైలు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాం’’ అని పవన్‌ అన్నారు. 


ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఆలోచించండి. 

‘‘రాష్ట్రంలో వైసీపీ నేతల్లాంటి అరాచకవాదులు రాజ్యమేలుతున్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఆలోచించండి. వైసీపీ మరోసారి అధికారంలోకి వస్తే ఏపీని ఎవరూ బాగుచేయలేరు. అల్లూరి సీతారామరాజు మరణించిన 125 సంవత్సరాల తరువాత ఆయన విగ్రహాన్ని క్షత్రియ సామాజిక వర్గమే ఏర్పాటు చేసుకోవడం బాధ అనిపిస్తుంది. జనసేన అధికారంలో ఉంటే అల్లూరి సీతారామరాజు వంటి జాతి నేత విగ్రహాన్ని మేమే స్థాపించేవారం. ఎంపీ రఘురామకృష్ణరాజుపై దాడి క్షత్రియ సామాజిక వర్గంపై దాడే. అల్లూరి విగ్రహం ప్రారంభానికి ఎంపీని రానివ్వకుండా చేశారు. ప్రజలు ఎన్నుకున్న స్థానిక ఎంపీని రానివ్వని కార్యక్రమానికి నేనెందుకు రావాలి? అందుకే ఆ కార్యక్రమానికి దూరంగా ఉన్నా’ అంటూ పవన్‌ వివరణ ఇచ్చారు. జనసేన పార్టీకి అల్లూరి సీతారామరాజు స్ఫూర్తి అని ఉద్ఘాటించారు. పొత్తులపైనా, తాను పోటీ చేసే స్థానాలపైనా ఎన్నికల సమయంలోనే మాట్లాడతానన్నారు. 



Updated Date - 2022-07-18T08:20:09+05:30 IST