ఇలాగైతే పదవులు తీసేస్తా!

ABN , First Publish Date - 2022-09-08T08:40:39+05:30 IST

ఇలాగైతే పదవులు తీసేస్తా!

ఇలాగైతే పదవులు తీసేస్తా!

కొత్త వారికి మంత్రి పదవులు ఇస్తా

ఆరోపణలను ఎందుకు ఖండించరు?

మీడియాపై ఎదురుదాడి చేయరేం?

నా కుటుంబాన్ని టార్గెట్‌ చేసినా మౌనమేనా?

మీకు మంత్రి పదవులు ఇచ్చింది ఎందుకు?

ఎంత చెప్పినా మీరూ, ఎమ్మెల్యేలు మారరా?

‘గడప గడపకూ’ ఎందుకు వెళ్లరు?

ఇక దీనిపై చెప్పేది ఉండదు.. చేతలే!

కేబినెట్‌లో మంత్రులపై జగన్‌ కస్సుబుస్సు


(అమరావతి - ఆంధ్రజ్యోతి) 

‘‘మీకు పదవులు ఇచ్చింది ఇందుకేనా? ఇలాగైతే... మిమ్మల్ని తీసేసి కొత్త వాళ్లకు అవకాశమిస్తా! మంత్రి పదవులు ఇచ్చింది నేనే! అది గుర్తుంచుకోండి’..... అంటూ సహచర మంత్రులపై ముఖ్యమంత్రి జగన్‌ కస్సుబుస్సులాడారు. ప్రతిపక్షం తన కుటుంబ సభ్యులపై ఆరోపణలు చేస్తున్నా పట్టించుకోరా అని మండిపడ్డారు. మీడియాలో వస్తున్న కథనాలను ఎందుకు గట్టిగా తిప్పికొట్టడం లేదని నిలదీశారు. బుధవారం రాష్ట్ర సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో 56 అజెండా అంశాలపై నాలుగు గంటలపాటు చర్చించారు. అధికారులందరూ బయటికి వెళ్లాక మంత్రులకు జగన్‌ గట్టిగా క్లాస్‌ తీసుకున్నట్లు సమాచారం. విశ్వసనీయ వర్గాల కథనం ప్రకారం... ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో తన కుటుంబానికి సంబంధం ఉందని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నా, మీడియాలో కథనాలు వస్తున్నా ఎవరూ మాట్లాడరేమని మంత్రులను జగన్‌ ప్రశ్నించారు. ఏకంగా తన సతీమణి భారతిని ఉద్దేశించి ఆరోపణలు చేస్తున్నా ఎవరూ స్పందించడంలేదెందుకని నిలదీశారు. ఇందుకేనా మీకు మంత్రి పదవులు ఇచ్చింది అంటూ చిర్రుబుర్రులాడారు. ‘‘ప్రతిపక్షాలు, మీడియా విమర్శలపై ఎందుకు నోరు మెదపడం లేదు? రాష్ట్రంలో జే-బ్రాండ్‌ మద్యం అమ్ముతున్నారంటూ ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నా ఎదురుదాడి చేయడం లేదేం?’’ అని నిలదీశారు. ఒక దశలో కోపం మరింత ఎక్కువై... ‘ఇలాగైతే మిమ్మల్ని తీసేసి కొత్తవారికి అవకాశమిస్తా’ అని హెచ్చరించారు. ఢిల్లీ లిక్కర్‌ కుంభకోణంపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను ఖండించాలని, మీడియాలో వస్తున్న కథనాలపై ఎదురుదాడి చేయాలని ఆయన హెచ్చరించారు. 


‘గడపకు’ కదలరేం?

ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘గడప గడపకూ మన ప్రభుత్వం’ కార్యక్రమంలో మంత్రులు పాల్గొనడం లేదని ముఖ్యమంత్రి జగన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు ఉద్దేశపూర్వకంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం లేదన్నారు. ‘‘మంత్రి ఉషశ్రీ చరణ్‌ గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని బాగా చేస్తున్నారు. మిగిలిన మంత్రులు అలా ఎందుకు చేయలేకపోతున్నారు? గ్రామ, వార్డు సచివాలయాల అభివృద్ధి కోసం రూ.20 లక్షలు ఇస్తానని చెప్పాక కూడా మంత్రులు, ఎమ్మెల్యేలలో చలనం లేదు. గడప గడపకూ కార్యక్రమాన్ని ఎనిమిది నెలలపాటు నిరంతరాయంగా కొనసాగించాలి. సర్వే ఆధారంగానే వచ్చే ఎన్నికల్లో టికెట్‌ ఇస్తా’’ అని జగన్‌ మరోసారి చెప్పారు. తాను పదే పదే చెబుతున్నా మార్పు రాకపోతే ఎలా అని నిలదీశారు. ఎమ్మెల్యేలు, మంత్రులకు ఎన్ని పనులున్నా నెలలో 16 రోజుల పాటు గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని చేపట్టాల్సిందేనని సీఎం జగన్‌ ఆదేశించారు. మరోసారి దీని గురించి చెప్పడం ఉండదని.. నిర్ణయాలు అమలు చేయడమే ఉంటుందని హెచ్చరించారు. ఇలా జగన్‌ ఆగ్రహం, అసహనంతో మాట్లాడుతుండగానే ఆయనకు ఫోన్‌ వచ్చింది. దాంతో వెంటనే సమావేశాన్ని ముగించుకుని ఆయన తాడేపల్లికి బయలుదేరారు. 


జగన్‌ ‘ఆంధ్రజ్యోతి’ జపం

నిజాలు నిక్కచ్చిగా రాస్తున్న ‘ఆంధ్రజ్యోతి’పై జగన్‌ మరోసారి అక్కసు వెళ్లగక్కారు. మంత్రివర్గ సమావేశంలో ఆయన పలుమార్లు ‘ఆంధ్రజ్యోతి’ ప్రస్తావన చేసినట్లు తెలిసింది. ‘‘పథకాలపై ఆంధ్రజ్యోతిలో ప్రతిరోజూ కథనాలు వస్తున్నాయి. బ్యానర్‌గా వ్యతిరేక కథనాలు వస్తున్నా మం త్రులు చలించడం లేదెందుకు? ఎదురుదాడి చేయడం లేదెందుకు? వాటిపై తక్షణమే స్పందించాలి. మంత్రులు ఎక్క డ ఉన్నా .. ప్రభుత్వ వ్యతిరేక కథనాలపై వివరణ ఇవ్వాలి’’ అని ఆదేశించారు.


రాష్ట్రం కోసమే మద్యాదాయం!

‘‘నేనేం తప్పు చేశాను? రాష్ట్రం కోసమే పని చేస్తున్నాను. జే-బ్రాండ్‌ అని విమర్శిస్తున్నారు.  సంక్షేమ పథకాలు అమలుకు గత ఏడాది మద్యం ద్వారా 21వేల కోట్లు తీసుకొచ్చాను. ఈ ఏడాది ఇప్పటికే 7వేల కోట్ల ఆదాయం వచ్చింది. ఇసుక 4వేల కోట్ల నుంచి 7వేల కోట్లు తీసుకొస్తున్నాను. రాష్ట్రం ఆర్థికంగా బలపడటానికి కృషి చేస్తున్నాను. అయినా నాపై విమర్శలు చేస్తున్నారు. ఇవేమీ మీరు పట్టించుకోవడంలేదు. ఎదురుదాడి చేయడంలేదు!’’ అంటూ మంత్రులపై ముఖ్యమంత్రి జగన్‌ అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది.

Read more