వైద్య పోస్టుల్లో ఐఏఎస్‌లా?!

ABN , First Publish Date - 2022-09-12T10:21:45+05:30 IST

ఆరోగ్యశాఖ పరిధిలోని కొన్ని విభాగాలకు వైద్యుల కోసం ప్రత్యేకంగా కొన్ని అడ్మినిస్ర్టేటివ్‌ పోస్టులున్నాయి..

వైద్య పోస్టుల్లో ఐఏఎస్‌లా?!

  • అప్పుడు ఏపీవీవీపీ కమిషనర్‌.. ఇప్పుడు డీఎంఈ.. 
  • ప్రభుత్వ వైద్యుల సంఘం తీవ్ర అభ్యంతరం
  • రాష్ట్రవ్యాప్తంగా నల్లబ్యాడ్జీలతో నిరసన
  • విధుల బహిష్కరణకు సన్నాహాలు
  • ఆ పోస్టుల్లో సీనియర్‌ వైద్యులనే నియమించాలని డిమాండ్‌
  • ఎంబీబీఎస్‌, మెడికల్‌ పీజీ సీట్లకూ నష్టమేనంటున్న జీడీఏ


(అమరావతి, ఆంధ్రజ్యోతి): ఆరోగ్యశాఖ పరిధిలోని కొన్ని విభాగాలకు వైద్యుల కోసం ప్రత్యేకంగా కొన్ని అడ్మినిస్ర్టేటివ్‌ పోస్టులున్నాయి.. డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌, డైరెక్టర్‌ ఆఫ్‌ హెల్త్‌, ఆంధ్రప్రదేశ్‌ వైద్య విధాన్‌ పరిషత్‌(ఏపీవీవీపీ) విభాగాల్లో హెచ్‌వోడీగా నిబంధనల ప్రకారం సీనియర్‌ వైద్యులు ఉండాలి. ఇరవై, ముప్పై ఏళ్లుగా క్షేత్రస్థాయిలో విధులు నిర్వహించిన వైద్యులకు గ్రామ స్థాయిలో ఆరోగ్య అంశాలపై ఎక్కువ అవగాహన ఉంటుంది కాబట్టి.. మూడు విభాగాలకు సీనియర్‌ వైద్యులే హెచ్‌వోడీలుగా ఉంటే అత్యవసర సమయంలో అనారోగ్య సమస్యలకు వెంటనే పరిష్కారం దొరుకుతుందన్న ఉద్దేశంతో గత ప్రభుత్వాలు ఇలా చట్టాలు చేశాయి. సీనియర్‌ వైద్యులను నియమించడం వల్ల ఆస్పత్రుల్లో రోగులకు నాణ్యమైన వైద్యసేవలందుతాయన్న ఉద్దేశంతో చట్టంలో చేర్చాయి. అయితే, ప్రస్తుతం ఆయా విభాగాల్లో ఇబ్బందులున్నాయన్న సాకుతో సీనియర్‌ వైద్యుల స్థానాల్లో ప్రభుత్వం ఐఏఎ్‌సలను నియమిస్తోంది. ఒకవైపు ఇంటింటికీ వైద్యుడిని పంపిద్దాం.. అంటూ ప్రచారం చేస్తున్న వైసీపీ ప్రభుత్వం.. మరోవైపు అదే వైద్యుల కోసం ప్రత్యేకంగా కేటాయించిన పోస్టులను ఇలా నాన్‌ మెడికల్‌ అధికారులతో నింపేస్తుండడం విమర్శలకు తావిస్తోంది.


ఆ పోస్టుల్లో ప్రస్తుతం ఇలా!

గత ఏడాది నుంచి ఏపీవీవీపీ ఇన్‌చార్జి కమిషనర్‌గా ఐఏఎస్‌ అధికారి వినోద్‌కుమార్‌ విధులు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌గా ఆయనకే అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇప్పటికే ఆయన ఏపీవీవీపీ కమిషనర్‌తో పాటు వరల్డ్‌ బ్యాంక్‌ ప్రాజెక్టు పీడీగా కూడా ఉన్నారు. ఇప్పుడు కొత్తగా డీఎంఈగా బాధ్యతలు నిర్వహించనున్నారు. వైద్యుల కోసం కేటాయించిన 3పోస్టుల్లో 2పోస్టులను ఇలా ఆల్‌ ఇండియా సర్వీసెస్‌ ఉద్యోగితో నింపేశారు. డైరెక్టర్‌ ఆఫ్‌ హెల్త్‌ పోస్టులో మాత్రమే వైద్యుడిని కొనసాగిస్తున్నారు. రెండు వారాల క్రితం డీహెచ్‌ స్థానంలో కూడా ఐఏఎస్‌ అధికారిని నియమించాలన్న ప్రయత్నాలు చేసినా, చివరి నిమిషంలో విరమించుకున్నారు.


నిబంధనలకు విరుద్ధమే..

ఎన్‌ఎంసీ (నేషనల్‌ మెడికల్‌ కౌన్సిల్‌) నిబంధనల ప్రకారం ఎంబీబీఎస్‌ చదివిన వైద్యులకు బోధనాసుపత్రుల్లో విధులు నిర్వహించే అవకాశం లేదు. ఎమర్జెన్సీ వార్డుల్లోనూ, ట్యూటర్లుగా పని చేయడానికి మాత్రమే వారిని ఉపయోగిస్తారు. మెడికల్‌ కాలేజీలకు ఎంబీబీఎస్‌ సీట్లు కేటాయించే సమయంలో, పీజీ సీట్లు కేటాయించే సమయంలో ఎంబీబీఎఎస్‌ వైద్యులనే ఎన్‌ఎంసీ పరిగణలోకి తీసుకోదు. ఇలాంటిది రాష్ట్రంలోని 11 బోధనాసుపత్రులకు సంబంధించిన హెచ్‌వోడీ పోస్టులో నాన్‌ మెడికల్‌ అధికారిని నియమించడాన్ని ఎన్‌ఎంసీ ఆంగీకరిస్తుందా..? లేదా..? అన్నది ప్రశ్నార్థంగా మారింది. ప్రస్తుత ప్రభుత్వంలో మాత్రం ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు రూల్స్‌కు వ్యతిరేకంగా డీఎంఈ పోస్టును భర్తీ చేశారు. దీనివల్ల ఎంబీబీఎస్‌, పీజీ సీట్లు నష్టపోవాల్సి వస్తుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. డీఎంఈ పోస్టులో కూర్చోవాలంటే కచ్చితంగా ఐదేళ్లు ప్రొఫెసర్‌గా పనిచేసి ఉండాలి. మరోవైపు అసిస్టెంట్‌, అసోసియేట్‌, ప్రొఫెసర్‌ కేడర్లలో కొన్ని పబ్లికేషన్స్‌ చూపించాల్సి ఉంటుంది. దీంతో పాటు మెడికల్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌ లేదా బోధనాసుపత్రి సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహించిన వారినే డీఎంఈ లేదా ఇన్‌చార్జి డీఎంఈగా నియమించాలి. ఇవేమీ లేకుండా డీఎంఈ పోస్టులో కూర్చోవడం అనేది నిబంధనలకు విరుద్ధమని ప్రభుత్వ వైద్యుల సంఘం గట్టిగా చెబుతోంది. 


ఆరోగ్యశాఖలో ఇప్పటికే ఏడుగురు ఐఏఎస్‌లు..

ఇప్పటికే ఏ శాఖలోనూ  లేని విధంగా ఇద్దరు ముఖ్య కార్యదర్శులు ఆరోగ్యశాఖలో ఉన్నారు. నిబంధనల ప్రకారం ఆరోగ్యశాఖ కమిషనర్‌, ఏపీఎంఎ్‌సఐడీసీ ఎండీ, ఆరోగ్యశ్రీ సీఈవో పోస్టుల్లో ఐఏఎస్‌లు, డ్రగ్స్‌ డీజీగా ఐపీఎస్‌ అధికారులు ఉండాలి. ఆరోగ్యశాఖ కమిషనర్‌, ఏపీఎంఎస్‌ఐడీసీ ఎండీ, ఆరోగ్యశ్రీ సీఈవో పోస్టులో ఐఏఎస్‌లను నియమించినా.. డ్రగ్స్‌ డీజీగా మాత్రం ఐఆర్‌ఎస్‌ అధికారిని ప్రభుత్వం నియమించింది. వీరు కాకుండా ఎయిడ్స్‌ కంట్రోల్‌ కార్యక్రమానికి ఐఏఎ్‌సను నియమించారు. ఇలా మొత్తం ఆరోగ్యశాఖలో ఏడుగురు ఐఏఎ్‌సలు ఉన్నారు. ఆల్‌ ఇండియా సర్వీసెస్‌ కేడర్‌ పోస్టుల్లో ఎవరిని నియమించుకున్నా తమకు ఇబ్బంంది లేదని... వైద్యుల కోసం కేటాయించిన పోస్టుల్లో ఐఏఎ్‌సలను నియమించడం ఏమిటని వైద్యుల సంఘం ప్రశ్నిస్తోంది. డీఎంఈ, డీహెచ్‌, ఏపీవీవీపీ కమిషనర్‌ పోస్టుల్లో సీనియర్‌ వైద్యులనే నియమించాలని డిమాండ్‌ చేస్తోంది. 


ఉద్యమ కార్యాచరణ?

ఈ మేరకు జీడీఏ (ప్రభుత్వ వైద్యుల సంఘం) ఉద్యమ కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బోధనాసుపత్రుల్లోని వైద్యులంతా నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరవుతూ తమ నిరసన తెలియజేస్తున్నారు.  వారం రోజుల్లో డీఎంఈ, ఏపీవీవీపీ కమిషనర్‌ పోస్టుల్లో సీనియర్‌ వైద్యులను నియమించకపోతే విధులు బహిష్కరించేందుకు సిద్ధమవుతామన్న హెచ్చరికలు జారీ చేస్తున్నారు. దీనిపై ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు, ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.

Updated Date - 2022-09-12T10:21:45+05:30 IST