టీడీపీ నేతల హౌస్‌ అరెస్టు

ABN , First Publish Date - 2022-06-07T09:25:19+05:30 IST

పల్నాడులోని జంగమహేశ్వరపాడులో ఈ నెల 3న హత్యకు గురైన టీడీపీ నేత కంచర్ల జాలయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు టీడీపీ నేతలకు పోలీసులు అనుమతి నిరాకరించారు.

టీడీపీ నేతల హౌస్‌ అరెస్టు

  • బుద్దా వెంకన్న, కొల్లు రవీంద్రలను గృహ నిర్బంధం చేసిన పోలీసులు
  • హత్యకు గురైన టీడీపీ నేత కుటుంబాన్ని పరామర్శించేందుకు నిరాకరణ

విజయవాడ(వన్‌టౌన్‌)/మచిలీపట్నం టౌన్‌, జూన్‌ 6: పల్నాడులోని జంగమహేశ్వరపాడులో ఈ నెల 3న హత్యకు గురైన టీడీపీ నేత కంచర్ల జాలయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు టీడీపీ నేతలకు పోలీసులు అనుమతి నిరాకరించారు. ఈ నేపథ్యంలో పలువురు టీడీపీ సీనియర్‌ నేతలను గృహ నిర్బంధం చేశారు. విజయవాడలో మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న సోమవారం జాలయ్య కుటుంబసభ్యులను పరామర్శించేందుకు వెళ్లాలని నిర్ణయించారు. అయితే, ఆయనను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. వన్‌టౌన్‌లోని ఆయన ఇంటివద్ద సీఐ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో పోలీసులు మోహరించి, ఇంటి నుంచి బయటకు రాకుండా కాపలా ఉన్నారు. మాజీమంత్రి, టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్రను సైతం పోలీసులు హౌస్‌ అరెస్టు చేశారు. సోమవారం ఉదయం రవీంద్ర మచిలీపట్నంలోని తన ఇంటి నుంచి బయటకు వచ్చేందుకు యత్నించారు. అయితే, డీఎస్పీ మాసూం బాషా నేతృత్వంలో సీఐలు, ఎస్‌ఐలు భారీ సంఖ్యలో మోహరించారు. టీడీపీ శ్రేణులు పెద్దఎత్తున రవీంద్ర ఇంటికి తరలిరావడంతో పోలీసులకు, టీడీపీ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. దీంతో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది.

Read more