‘చార్జిషీట్‌’ వేసినా.. ఎన్‌వోసీ అవసరం లేదు!

ABN , First Publish Date - 2022-10-11T09:54:10+05:30 IST

పోలీసులు దాఖలు చేసిన చార్జిషీట్‌ను న్యాయస్థానం కాగ్నిజెన్స్‌(పరిగణన)లోకి తీసుకున్న సందర్భంలో మాత్రమే.. విదేశాలకు

‘చార్జిషీట్‌’ వేసినా..  ఎన్‌వోసీ అవసరం లేదు!

కోర్టు పరిగణిస్తేనే అవసరమని స్పష్టం చేసిన హైకోర్టు


అమరావతి, అక్టోబరు 10(ఆంధ్రజ్యోతి): పోలీసులు దాఖలు చేసిన చార్జిషీట్‌ను న్యాయస్థానం కాగ్నిజెన్స్‌(పరిగణన)లోకి తీసుకున్న సందర్భంలో మాత్రమే.. విదేశాలకు వెళ్లేందుకు సంబంధిత న్యాయస్థానం నుంచి నిందితుడు ఎన్‌వోసీ తీసుకోవాల్సి ఉంటుందని, కేసు విచారణ దశలో ఉండగా అవసరం లేదని హైకోర్టు తేల్చి చెప్పింది. పోలీసులు కేసు దర్యాప్తు పూర్తిచేసి, చార్జిషీట్‌ దాఖలు చేసినంత మాత్రాన.. కోర్టులో కేసు పెండింగ్‌లో ఉన్నట్లు కాదని స్పష్టం చేసింది. పిటిషనర్‌ నుంచి సీజ్‌ చేసిన పాస్‌పోర్టు తిరిగి ఇచ్చేయాలని పోలీసులను ఆదేశించింది. కోర్టు విచారణకు హాజరవుతాననే హామీతో రూ.2 లక్షలను విజయవాడ రెండో అదనపు చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ కోర్టులో డిపాజిట్‌ చేయాలని పిటిషనర్‌కు సూచించింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌. రఘునంధనరావు ఇటీవల తీర్పు ఇచ్చారు. తూర్పుగోదావరిజిల్లాకు చెందిన డీవీ సూర్యనారాయణమూర్తిపై వరకట్న వేధింపుల కేసు నమోదైంది. ఖతార్‌లో ఉద్యోగం చేస్తున్న ఆయన స్వదేశానికి తిరిగి రాగానే విజయవాడ దిశ పోలీసులు ఆయన పాస్‌పోర్ట్‌ను స్వాధీనం చేసుకోవాలంటూ ప్రాంతీయ పాస్‌పోర్ట్‌ అధికారికి లేఖ రాశారు. అయితే, పోలీసుల చర్యను సవాల్‌ చేస్తూ సూర్యనారాయణ హైకోర్టును ఆశ్రయించారు. ఆ వ్యాజ్యంపై ఇరువైపుల వాదనలు పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి.. పోలీసులు దాఖలు చేసిన చార్జిషీట్‌ను న్యాయస్థానం పరిగణనలోకి తీసుకోలేదని పేర్కొన్నారు. విదేశాలకు వెళ్లేందుకు సంబంధిత కోర్టు నుంచి పిటిషనర్‌కు ఎన్‌వోసీ అవసరం లేదని తేల్చి చెప్పారు.

Updated Date - 2022-10-11T09:54:10+05:30 IST