‘పీపీఏ’ ధరలు తగ్గించలేరు!

ABN , First Publish Date - 2022-03-16T08:38:16+05:30 IST

విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాల (పీపీఏ) విషయంలో హైకోర్టు ధర్మాసనం మంగళవారం కీలక తీర్పు వెలువరించింది. ఒప్పందాల్లో పేర్కొన్న ప్రకారమే సౌర, పవన విద్యుత్‌ ఉత్పత్తి సంస్థలకు చెల్లించాల్సిన అన్ని పెండింగ్‌ బకాయిలతో పాటు అన్ని చెల్లింపులూ జరపాలని తేల్చి..

‘పీపీఏ’ ధరలు తగ్గించలేరు!

ఒప్పందాల ప్రకారం పాతికేళ్లూ చెల్లింపులు జరపాల్సిందే

బకాయిలను ఆరు వారాల్లో చెల్లించాలి

సర్కారు, డిస్కమ్‌లకు హైకోర్టు ఆదేశం

పీపీఏల నుంచి తప్పుకోవడానికి వీల్లేదు

ఆర్థిక కారణాలతో ధర తగ్గింపు కోరలేరు

సమీక్షించే అధికారం ఈఆర్‌సీకి లేదు

పవన, సౌర విద్యుదుత్పత్తి సంస్థలు

‘మస్ట్‌రన్‌’ నిర్వచనంలోకి వస్తాయి

వాటి విద్యుత్‌ను తీసుకోవాల్సిందే

ఎస్‌ఎల్‌డీసీకి ధర్మాసనం స్పష్టీకరణ

సింగిల్‌ జడ్జి ఆదేశాలు కొట్టివేత


పీపీఏ అనేది విద్యుదుత్పత్తి సంస్థలు, పంపిణీ సంస్థల మధ్య జరిగే వాణిజ్య (కమర్షియల్‌) ఒప్పందం. ఈ నేపథ్యంలో పీపీఏల ప్రకారం యూనిట్‌ ధరలను 25 సంవత్సరాలూ చెల్లించాల్సిందే.


ఒప్పందాల్లో సవరణ చేయాలంటే ఇరుపక్షాల సమ్మతితో జరగాలి తప్ప గతంలో ఏపీఈఆర్‌సీ ఉత్తర్వులు ఇచ్చిందనే ముసుగులో ఏకపక్షంగా సవరించడానికి వీల్లేదు.

 హైకోర్టు


అమరావతి, మార్చి 15 (ఆంధ్రజ్యోతి): విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాల (పీపీఏ) విషయంలో హైకోర్టు ధర్మాసనం మంగళవారం కీలక తీర్పు వెలువరించింది. ఒప్పందాల్లో పేర్కొన్న ప్రకారమే సౌర, పవన విద్యుత్‌ ఉత్పత్తి సంస్థలకు చెల్లించాల్సిన అన్ని పెండింగ్‌ బకాయిలతో పాటు అన్ని చెల్లింపులూ జరపాలని తేల్చి చెప్పింది. పూర్తి బకాయిలను ఆరు వారాల్లో చెల్లించాలని రాష్ట్రప్రభుత్వం, విద్యుత్‌ పంపిణీ సంస్థ(డిస్కమ్‌)లకు స్పష్టం చేసింది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నామనే కారణంతో యునిట్‌ టారిఫ్‌ ధరలను తగ్గించాలని కోరలేవని.. ఆర్థిక ఇబ్బందుల నెపంతో పీపీఏల నుంచి తప్పుకోవడానికి వీల్లేదని తేల్చిచెప్పింది.


యూనిట్‌ టారిఫ్‌ ధరలను సమీక్షించేందుకు రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి(ఏపీఈఆర్‌సీ)కి వీలుకల్పించడంతో పాటు తాత్కాలిక చర్యల్లో భాగంగా సోలార్‌ యునిట్‌కు రూ.2.44, పవన విద్యుత్‌కు రూ.2.43 చొప్పున చెల్లించాలని డిస్కమ్‌లకు సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఆదేశాలను రద్దు చేసింది. ఆ తరహా ఉత్తర్వులను ఇవ్వడం సముచితం కాదని అభిప్రాయపడింది. మరోవైపు ప్రస్తుత పీపీఏల వ్యవహారంలో యూనిట్‌ టారిఫ్‌ ధరలను సమీక్షించాలని ఏపీఈఆర్‌సీ వద్ద డిస్కమ్‌లు దాఖలు చేసిన రెండు ఒరిజనల్‌ పిటిషన్లకు విచారణార్హత లేదటూ వాటిని కొట్టివేసింది. పీపీఏలను సమీక్షించి యూనిట్‌ ధరలను నిర్ణయించేందుకు వీలుకల్పిస్తూ సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఆదేశాలను రద్దు చేసింది. అలాగే పవన, సౌర విద్యుత్‌ సంస్థలు ఉత్పత్తి చేస్తున్న విద్యుత్‌లో కోత పెట్టవద్దంటూ సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఆదేశాలపై ఏపీఎ్‌సఎల్‌డీసీ(ఏపీ స్టేట్‌ లోడ్‌ డిస్పాచ్‌ సెంటర్‌) దాఖలు చేసిన అప్పీల్‌ను కూడా కొట్టివేసింది. పవన, సౌర విద్యుత్‌ సంస్థలు ‘మస్ట్‌ రన్‌’ నిర్వచనంలోకి వస్తాయని, అవి ఉత్పత్తి చేస్తున్న విద్యుత్‌ను తప్పనిసరిగా వినియోగించుకోవాల్సిందేనని,  ఉత్పత్తి తగ్గించాలని కోరలేరని తేల్చిచెప్పింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా, జస్టిస్‌ ఎన్‌.జయసూర్యతో కూడిన ధర్మాసనం మంగళవారం ఆదేశాలిచ్చింది. విద్యుదుత్పత్తి సంస్థలు వేసిన వ్యాజ్యాలను అనుమతించింది.


ఇవీ పిటిషన్లు..

గత ప్రభుత్వ హయాంలో చేసుకున్న పీపీఏలపై యూనిట్‌ టారిఫ్‌ ధరలను ఏపీఈఆర్‌సీ సమీక్షించేందుక్చు వీలు కల్పిస్తూ 2019లో సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులపై పవన, సౌర విద్యుత్‌ ఉత్పత్తి సంస్థలు ధర్మాసనం ముందు అప్పీల్‌ చేసిన విషయం తెలిసిందే. తాత్కాలిక చర్యల్లో భాగంగా సోలార్‌ యునిట్‌కు రూ.2.44, పవన విద్యుత్‌కు రూ.2.43 చొప్పున చెల్లించాలని సింగిల్‌ జడ్జి పేర్కొనడంపై అభ్యంతరం తెలిపాయి. అలాగే టారిఫ్‌ ధరను సవరించాలని కోరుతూ డిస్కమ్‌లు ఏపీఈఆర్‌సీ వద్ద పిటిషన్లు వేయడంపైనా హైకోర్టును ఆశ్రయించాయి. మరోవైపు.. పవన, సౌర విద్యుత్‌ ఉత్పత్తి సంస్థలు చేస్తున్న ఉత్పత్తిలో కోత విధించడానికి వీల్లేదని, ఒకవేళ విధించాల్సి వస్తే గ్రిడ్‌ కోడ్‌, విద్యుత్‌ చట్టం ప్రకారం ముందుగా నోటీసులు ఇవ్వాలని సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఆదేశాలపై ఎస్‌ఎల్‌డీసీ అప్పీల్‌ వేసింది. అన్ని పక్షాల వాదనలు ముగియడంతో ఇటీవల ఈ వ్యాజ్యాలపై తీర్పును రిజర్వు చేసిన ధర్మాసనం మంగళవారం తీర్పు ఇచ్చింది.


తీర్పులో ఏముందంటే..

‘పీపీఏలు సమీక్షించేందుకు కమిటీ ఏర్పాటు చేస్తూ ఇంధన శాఖ జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేసిన అనంతరం తాత్కాలిక చర్యల్లో భాగంగా యూనిట్‌ ధరల చెల్లింపు విషయంలో సింగిల్‌ జడ్జి ఆదేశాలు ఇవ్వడం సరికాదని ధర్మాసనం పేర్కొంది. ఒకవైపు విద్యుదుత్పత్తి సంస్థలు వేసిన వ్యాజ్యాలను అనుమతిస్తూనే.. టారిఫ్‌ ధరలు తగ్గించాలని ఆదేశించడాన్ని తప్పుబట్టింది. మధ్యంతర టారిఫ్‌ నిర్ణయించాలని ఇరు పక్షాలూ కోరలేదని గుర్తు చేసింది. డిస్కమ్‌ల ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని సోలార్‌ యూనిట్‌కు రూ.2.44, పవన విద్యుత్‌కు రూ.2.43 చొప్పున చెల్లించాలని సింగిల్‌ జడ్జి ఆదేశాలు ఇచ్చి ఉండవచ్చని అభిప్రాయపడింది. అయితే విద్యుత్‌ కొనుగోలు కోసం చేసే ఖర్చును డిస్కమ్‌లు వినియోగదారుల నుంచి వసూలు చేస్తున్నప్పుడు.. నష్టాల పేరుతో టారిఫ్‌ ధరను తగ్గించాలని అవి కోరడానికి వీల్లేదని తెలిపింది. పీపీఏ నిబంధనలు, షరతులు ఇరు పక్షాల ఆమోదంతో రాసుకునేవని.. ఈ నేపథ్యంలో వాటిని పార్టీలు గానీ, న్యాయస్థానాలు గానీ సవరించజాలవని స్పష్టం చేసింది. ‘2017 మార్చి 31కి ముందు జరిగిన ఒప్పందాల్లో.. సమయానుకూలంగా టారిఫ్‌ ధరలను సమీక్ష చేయవచ్చనే నిబంధన లేనందున 25 ఏళ్ల పాటు అంగీకరించిన ధరలనే చెల్లించాలి. రెగ్యులేషన్‌-1 ప్రకారం అమల్లోకి వచ్చిన ఒప్పందాలను సమీక్షించే అధికారం ఏపీఈఆర్‌సీకి లేదు. ఈ నేపథ్యంలో యూనిట్‌ టారిఫ్‌ ధరలను సమీక్షించాలని డిస్కమ్‌లు వేసిన పిటిషన్లకు విచారణార్హత లేదు. పవన విద్యుదుత్పత్తి సంస్థల ఒప్పందం మేరకు టారిఫ్‌ ధరలు పాతికేళ్లు అమల్లో ఉంటాయని గతంలో ఏపీఈఆర్‌సీ సైతం నిర్ధారించింది.’ 

Read more