-
-
Home » Andhra Pradesh » High Court Clarification-NGTS-AndhraPradesh
-
ప్రభుత్వాన్ని కోర్టు నడపడం లేదు!
ABN , First Publish Date - 2022-08-31T09:00:47+05:30 IST
ప్రభుత్వాన్ని న్యాయస్థానం నడపడం లేదని, తామిక్కడ ఉన్నది దానిని నడిపేందుకు కాదని హైకోర్టు స్పష్టం చేసింది. పాఠశాలల విలీనం, ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ ప్రభుత్వ విధానపరమైన నిర్ణయమని, సహజంగా అలాంటివిషయాల్లో.

మేం ఉన్నది అందుకు కాదు
స్కూళ్ల విలీనం, టీచర్ల హేతుబద్ధీకరణ ప్రభుత్వ విధానపరమైన నిర్ణయం
అన్ని వ్యాజ్యాలపై ఒకేసారి విచారణ.. హైకోర్టు స్పష్టీకరణ
అమరావతి, ఆగస్టు 30(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వాన్ని న్యాయస్థానం నడపడం లేదని, తామిక్కడ ఉన్నది దానిని నడిపేందుకు కాదని హైకోర్టు స్పష్టం చేసింది. పాఠశాలల విలీనం, ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ ప్రభుత్వ విధానపరమైన నిర్ణయమని, సహజంగా అలాంటివిషయాల్లో న్యాయస్థానాలు జోక్యం చేసుకోవని వ్యాఖ్యానించింది. ఈ వ్యవహారంలో దాఖలైన వ్యాజ్యాలపై కౌంటర్లు దాఖలు చేయాలని ప్రతివాదులుగా ఉన్న కేంద్ర మానవనరుల అభివృద్ధి శాఖ కార్యదర్శి, రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి, పాఠశాల విద్య కమిషనర్ తదితరులను ఆదేశించింది. అన్ని వ్యాజ్యాలపై ఒకేసారి విచారణ జరుపుతామని స్పష్టం చేసింది. విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, జస్టిస్ డీవీఎ్‌సఎస్ సోమయాజులుతో కూడిన ధర్మాసనం మంగళవారం ఆదేశాలిచ్చింది.
పాఠశాలల విలీనం, ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణపై రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 117, 128, 84, 85లను సవాల్ చేస్తూ ఏపీ సేవ్ ఎడ్యుకేషన్ కమిటీ కన్వీనర్ డి.రమేశ్, చంద్ర సింహగిరి పట్నాయక్, డాక్టర్ గుంటుపల్లి శ్రీనివాస్ వేర్వేరుగా ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలుచేశారు. అలాగే పాఠశాలల విలీనాన్ని వ్యతిరేకిస్తూ తూర్పుగోదావరి, కడప జిల్లాల విద్యార్థుల తల్లిదండ్రులు రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలు ధర్మాసనం ముందు విచారణకు వచ్చాయి. పాఠశాల విద్యశాఖ తరఫు న్యాయవాది స్పందిస్తూ.. అన్ని వ్యాజ్యాలపై ఒకేసారి విచారణ జరపాలని కోరారు. తాజాగా దాఖలైన పిల్ విషయంలో కౌంటర్ వేసేందుకు సమయమివ్వాలని కోరారు. కేసు తీవ్రతను పరిగణనలోకి తీసుకుని వ్యాజ్యాలపై అత్యవసరంగా విచారణ జరపాలని పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది ఎ.సత్యప్రసాద్ విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం పాఠశాలల్లో సింగిల్ మీడియం విధానం అనుసరిస్తోందని.. ఆంగ్ల మాధ్యమంలోనే బోధన చేసేందుకు ప్రయత్నిస్తోండటంతో విద్యార్థులు నష్టపోతున్నారన్నారు.