ఇష్టానుసారం రౌడీషీట్‌ కుదరదు!

ABN , First Publish Date - 2022-07-17T08:05:12+05:30 IST

పోలీస్‌ స్టాండింగ్‌ ఆర్డర్స్‌(పీఎ్‌సవో)ను అనుసరించి అనుమానితులు లేదా నిందితులపై రౌడీషీట్‌ తెరవడం, వాటిని కొనసాగించడం వంటివి చేయడానికి

ఇష్టానుసారం రౌడీషీట్‌ కుదరదు!

స్టాండింగ్‌ ఆర్డర్స్‌కు చట్టబద్ధత లేదు

అవి కేవలం మార్గదర్శకాలే వాటితో రౌడీషీట్‌ తెరవడం, నిఘా పెట్టడం సరికాదు

అర్ధరాత్రి ఇళ్లలో సోదాలు వద్దు స్టేషన్‌లకు పిలిచి వేధించొద్దు

ఫొటోలు, వేలిముద్రలు అసలే వద్దు ఇలాచేయడం సుప్రీం తీర్పునకు విరుద్ధం

 గోప్యతా హక్కును హరించడమే పోలీసులకు హైకోర్టు స్పష్టీకరణ


అమరావతి, జూలై 16(ఆంధ్రజ్యోతి): పోలీస్‌ స్టాండింగ్‌ ఆర్డర్స్‌(పీఎ్‌సవో)ను అనుసరించి అనుమానితులు లేదా నిందితులపై రౌడీషీట్‌ తెరవడం, వాటిని కొనసాగించడం వంటివి చేయడానికి వీల్లేదని హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. పీఎ్‌సవోకు ఎలాంటి చట్టబద్ధత లేదని, అవి కేవలం పాలనాపరమైన మార్గదర్శకాలేనని పేర్కొంది. చట్టం అనుమతి లేకుండా వ్యక్తుల పై నిఘా పెట్టడం, రౌడీషీట్‌ తెరవడం, వారి వివరాలు సేకరించడానికి వీల్లేదని పేర్కొంది. కేఎస్‌ పుట్టుస్వామి కేసులో సుప్రీంకోర్టు గోప్యతను ప్రాథమిక హక్కుగా పేర్కొందని గుర్తు చేసింది. పీఎ్‌సవో ఆధారంగా వ్యక్తులపై రౌడీషీట్‌ తెరవడం, తరచూ పోలీసు స్టేషన్‌కు పిలిపించడం, వారిపై నిఘా పెట్టడం, పోలీస్‌ స్టేషన్‌లో వారి ఫొటోలు ప్రదర్శించడం ప్రాథమిక హక్కుల్లో భాగమైన గోప్యతను హరించడమేనని వ్యాఖ్యానించింది. అలా చేయడం సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం, హైకోర్టు ఇచ్చిన ఆదేశాల పట్ల ఉద్దేశపూర్వకంగా అవిధేయత ప్రకటించడమేనని తెలిపింది.


రౌడీ షీట్‌ తెరవడం, వాటి కొనసాగింపు కోసం ఉద్దేశించిన నిర్దిష్ట భాగం, వ్యక్తులపై నిఘాకు సంబంధించి చాప్టర్‌ 37 చెల్లుబాటుకాదని ప్రకటించింది. వ్యక్తిగత వివరాలు సేకరించడంతో పాటు వాటిని నేరాలు జరగకుండా వినియోగించే విషయంలోనూ చట్టానికి లోబడి వ్యహరించాల్సిందేనని స్పష్టం చేసింది. చట్టనిబంధనల మేరకు నిర్దిష్ట ప్రక్రియను అనుసరించకుండా రాత్రిపూట అనుమానితులు/నిందితుల ఇళ్లలో సోదాలు నిర్వహించకూడదని, వారి నుంచి వేలి ముద్రలు, ఫొటోలు సేకరించడానికి వీల్లేదని స్పష్టం చేసింది. పండుగలతో పాటు ఎన్నికలు, వారాంతాల్లో నిందితులు/అనుమానితులను పోలీసుస్టేషన్‌కి పిలిచి, వేచి ఉండేలా చేయవద్దని తెలిపింది. సంబంధిత పోలీస్‌ స్టేషన్‌ పరిధిదాటి బయటకి వెళ్లేందుకు ఎలాంటి ఆంక్షలు విధించవద్దని స్పష్టం చేసింది. వ్యాజ్యాలలో భాగస్వాములు కాని పోలీసు అధికారులు సైతం రౌడీషీట్‌ తెరిచేందుకు పీఎ్‌సవోను అనుసరిస్తే కోర్టు ధిక్కరణకు పాల్పడినట్లేనని హెచ్చరించింది.


ప్రస్తుత వ్యాజ్యాలలో పిటిషనర్లపై ఉన్న రౌడీషీట్‌ను తక్షణం మూసివేసేయాలని ఆదేశిస్తూ వ్యాజ్యాలను పరిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ డీవీఎ్‌సఎస్‌ సోమయాజులు శుక్రవారం కీలక తీర్పు ఇచ్చారు. పోలీస్‌ స్టాండింగ్‌ ఆర్డర్స్‌ ఆధారంగా తమపై రౌడీషీట్‌ తెరవడం, వాటిని సుధీర్ఘ కాలం పాటు కొనసాగించడాన్ని సవాల్‌చేస్తూ హైకోర్టులో 57 వ్యాజ్యాలు దాఖలయ్యాయి. ఈ వ్యాజ్యాలపై విచారణ జరిపిన న్యాయస్థానం తీర్పును రిజర్వ్‌ చేసింది. శుక్రవారం నిర్ణయాన్ని వెల్లడించింది.

గోప్యతను హరించడమే: ‘‘1960 ఫిబ్రవరిలో జీవో 308 ద్వారా ఏపీ పీఎ్‌సవోను ప్రవేశపెట్టారు. 2001లో ఒకసారి 2017 మరోసారి 2 సార్లు దానిని సవరించారు.


పీఎ్‌సవో కేవలం మార్గదర్శకాలు మాత్రమేనని జీవోల్లో స్పష్టంగా పేర్కొన్నారు. పీఎ్‌సవోకు ఎలాంటి చట్టబద్ధత లేదని హైకోర్టు గతంలోనే స్పష్టం చేసినా, రౌడీషీట్‌ తెరవడం, కొనసాగించేందుకు దానినే ఉపయోగిస్తున్నారు. గతంలో సుప్రీంకోర్టు, హైకోర్టు ఇచ్చిన తీర్పులను పట్టించుకోకుండా రౌడీషీట్లు తెరుస్తున్నారు. ఎఫ్‌ఐఆర్‌లను న్యాయస్థానం కొట్టేసినప్పటికీ, లోక్‌అదాలత్‌ ద్వారా తమపై ఉన్న కేసులను రాజీమార్గం ద్వారా పరిష్కరించుకున్నప్పటికీ చాలామందిపై ఇంకా రౌడీషీట్‌ను కొనసాగిస్తున్నారు. పీఎ్‌సవో ఆధారంగా వివరాలు సేకరించడం, ఫొటోలు తీసుకోవడం, వాటిని ప్రదర్శించడం, రౌడీషీట్‌ తెరవడం, పోలీస్‌ స్టేషన్‌కు పిలవడం, రోజుల తరబడి వేచి ఉండేలా చేయడం గోప్యత హక్కును హరించడమే. అలా వ్యవహరించడం అధికరణలు 14, 19, 21లను నేరుగా అతిక్రమించడమే’’ అని న్యాయమూర్తి స్పష్టం చేశారు.


ప్రత్యేక చట్టం తేవాలి: ‘‘రాజ్యాంగ విరుద్ధంగా ఉన్న పురాతన పోలీసు నిబంధనలను 45 ఏళ్లు గడుస్తున్నా  సరిచేయడం లేదు. గోప్యత హక్కును ప్రాథమిక హక్కుగా గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తగిన చట్టాన్ని రూపొందించాలి. వ్యక్తులపై నిఘా పెట్టి వారి వివరాలు సేకరించే విషయంలో ప్రభుత్వం ప్రత్యేక చట్టం తీసుకురావాలి. దీనికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. నేరాలను అరికట్టేందుకు పోలీసులకు సీఆర్‌పీసీలోని పలుసెక్షన్లు వెసులుబాటు కల్పిస్తున్నాయి. వాటిని సద్వినియోగం చేసుకుని నేరాలు చేయడం అలవాటుగా మార్చుకున్నవారిని అడ్డుకోవచ్చు. ప్రస్తుతం ఉనికిలో ఉన్న పలు చట్టాల ఆధారంగా నిబంధనల మేరకు సమాచారం సేకరించి, నేరాలను అరికట్టేందుకు పోలీసులకు అవకాశం ఉంది’’ అని న్యాయమూర్తి తీర్పులో పేర్కొన్నారు.

Read more