‘స్మార్ట్‌’గా ముంచేశాడు!

ABN , First Publish Date - 2022-09-13T07:47:56+05:30 IST

ఒకరు కాదు... ఇద్దరు కాదు వేలాది మంది బాధితులు. వేలు.. లక్షలు కాదు.. ఏకంగా రూ.300 కోట్లు కొట్టేశాడు.

‘స్మార్ట్‌’గా ముంచేశాడు!

  • ప్రభుత్వ ఉద్యోగాలంటూ నిరుద్యోగులకు వల
  • స్మార్ట్‌ యోజన వెల్ఫేర్‌ సొసైటీ పేరిట మోసం
  • ఉద్యోగాలిప్పిస్తానని రూ.300 కోట్ల వసూళ్లు
  • నకిలీ నియామక పత్రాలతో హడావిడి
  • తొలి నెలలో జీతం కూడా.. ఆపై వాయిదా
  • నిరుద్యోగులను ముంచేసిన స్మార్ట్‌ సుధాకర్‌
  • సీఐడీ కార్యాలయానికి బాధితులు క్యూ

ఆరిలోవ (విశాఖపట్నం), సెప్టెంబరు 12: ఒకరు కాదు... ఇద్దరు కాదు వేలాది మంది బాధితులు. వేలు.. లక్షలు కాదు.. ఏకంగా రూ.300 కోట్లు కొట్టేశాడు. ఉద్యోగాలు ఆశ చూపి రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోని నిరుద్యోగులను నిండా ముంచేసిన ‘స్మార్ట్‌ యోజన వెల్ఫేర్‌ సొసైటీ’ వ్యవస్థాపకుడు, నర్సీపట్నంకు చెందిన సుధాకర్‌ మోసాలు బట్టబయలవుతుంటే సీఐడీ పోలీసులకే కళ్లు బైర్లు కమ్ముతున్నాయి. ఉత్తరాంధ్రలోని ప్రతి మండలం నుంచి కనీసం 20 మంది చొప్పున బాధితులున్నారు. ఒకొక్కరి నుంచి రూ.1.5 లక్షల నుంచి ఐదు లక్షలు వరకు కాజేశాడు. ఇలా దాదాపు రూ.300 కోట్లు వసూలు చేసినట్లు ప్రాథమిక ఆధారాల మేరకు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. రెండు రోజుల క్రితం సీఐడీ పోలీసులు సుధాకర్‌ను అరెస్టు చేశారన్న సమాచారం తెలియడంతో... సోమవారం భారీ సంఖ్యలో బాధితులు నగరంలోని సీఐడీ కార్యాలయానికి వచ్చారు. తాము మోసపోయిన తీరును పోలీసుల ముందు ఏకరువు పెట్టారు. బాధితుల కథనం మేరకు... ‘స్మార్ట్‌ యోజన వెల్ఫేర్‌ సొసైటీ’ వ్యవస్థాపకుడు సుధాకర్‌ గ్రామాల్లో ఉద్యోగాల పేరుతో వసూళ్లకు పాల్పడ్డాడు. దీనికోసం మధ్యవర్తులను నియమించుకున్నాడు. 


కొందరు నేరుగా, మరికొందరు మధ్యవర్తుల ద్వారా డబ్బులు కట్టారు. ఇంకొందరు ఏకంగా వారిచ్చిన నంబర్‌కు ఫోన్‌ పే చేశారు. ఇలా డబ్బులు చెల్లించిన వారికి సుధాకర్‌ జిల్లా ఏవో, మండల ఇన్‌చార్జి, మూడు నాలుగు పంచాయతీలకు ఎగ్జిక్యూటివ్‌ అంటూ ఉద్యోగ నియామకపత్రాలు అందించాడు. అసిస్టెంట్‌కు నెలకు రూ.19,200లు, మిగిలిన కేడర్‌లకు రూ.25 వేల నుంచి రూ.30 వేల వేతనం అంటూ ఆ నియామక పత్రాల్లో పేర్కొన్నాడు. నిరుద్యోగులకు అనుమానం రాకుండా జిల్లా, మండల కేంద్రాల్లో కార్యాలయాలు తెరిచి హడావిడి చేశాడు. అలా నియామకపత్రం అందుకున్న వారికి సుధాకర్‌ తొలి నెలలో శిక్షణ పేరుతో కొంత మొత్తం వేతనం అందించాడు. తొలినెల వేతనం ఇచ్చిన సుధాకర్‌ తర్వాత వాయిదాలు వేస్తూ రావడంతో బాధితులంతా మౌనంగా భరించారు. ఐదారు నెలలు దాటినా డబ్బులు ఇవ్వక పోవడంతో కొందరు అసిస్టెంట్లు మండల ఇన్‌చార్జ్‌లను నిలదీయడంతో సుధాకర్‌ మోసం బయటపడింది. ఇది ఇతర జిల్లాలకూ పాకడం, అక్కడ కూడా ఇదే తరహా మోసం జరిగిందని వెల్లడి కావడంతో వ్యవహారం బట్టబయలైంది. దీంతో ప్రభుత్వం సీఐడీ దర్యాప్తునకు ఆదేశించింది. ఈ నేపథ్యంలో అనకాపల్లిలో కొందరు సుధాకర్‌పై ఫిర్యాదు చేయడంతో సీఐడీ నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించింది. దాదాపు రూ.300 కోట్లు వసూళ్లు వెనుక సుధాకర్‌ ఒక్కడేనా, ఆయన వెనుక పెద్దల హస్తం ఉందా? అన్న కోణంలో సీఐడీ అధికారులు విచారణ చేస్తున్నారు. కాగా.. సుఽధాకర్‌ చేతిలో మోసపోయిన వ్యక్తులు తమ కార్యాలయానికి రాతపూర్వకంగా గానీ, సీఐ బుచ్చిరాజు (94413 79913) నంబర్‌కు ఫోన్‌ ద్వారాకానీ ఫిర్యాదు చేయవచ్చని సీఐడీ డీఎస్పీ చక్రవర్తి కోరారు. 


ముగ్గురిపై కేసు నమోదు

స్మార్ట్‌ యోజన వెల్ఫేర్‌ సొసైటీ చైర్మన్‌ ఇందుపూడి సుధాకర్‌, రుత్తల హరిబాబు, కంచరాపు శివ తదితరులపై తూర్పుగోదావరి జిల్లా దేవరాపల్లి మండలం సంగాయిగూడేనికి చెందిన జి.రవికుమార్‌ గత నెల 18న సీఐడీ అధికారులకు ఫిర్యాదుచేశారు. ఈ మేరకు సుధాకర్‌, మిగతా ఇద్దరిపై మంగళగిరిలోని సీఐడీ ప్రధాన కార్యాలయంలో వివిధ సెక్షన్ల కింద కేసు నమోదుచేశారు. ఈ నేపథ్యంలో నర్సీపట్నానికి చెందిన సుధాకర్‌ను ఆదివారం అరెస్టు చేసి కాకినాడలో జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టులో హాజరుపరిచారు. ఇప్పటివరకు సుధాకర్‌కు సొమ్ములు ఇచ్చి మోసపోయిన 32 మందిని విచారించి.. నకిలీ ఉద్యోగ ఆర్డర్లను సీజ్‌ చేశారు.

Updated Date - 2022-09-13T07:47:56+05:30 IST