చేయూతతో పేదల జీవితాల్లో వెలుగు

ABN , First Publish Date - 2022-09-24T05:56:58+05:30 IST

పేద మహిళల జీవితాల్లో వెలుగులు నింపేందుకు వైఎస్సార్‌ చేయూత పథకాన్ని సమర్ధంగా నిర్వహిస్తున్నట్లు మంత్రి మేరుగ నాగార్జున తెలిపారు.

చేయూతతో పేదల జీవితాల్లో వెలుగు
చెక్కు అందజేస్తున్న మంత్రి మేరుగ నాగార్జున, రాజ్యసభసభ్యుడు మోపిదేవి వెంకటరమణ, మాజీ డిప్యూటీ స్పీకర్‌ కోన రఘుపతి, కలెక్టర్‌ కె.విజయకృష్ణన్‌ తదితరులు

చెక్కులు పంపిణీలో మంత్రి మేరుగ నాగార్జున 

బాపట్ల, సెప్టెంబరు 23: పేద మహిళల జీవితాల్లో వెలుగులు నింపేందుకు వైఎస్సార్‌ చేయూత పథకాన్ని సమర్ధంగా నిర్వహిస్తున్నట్లు మంత్రి మేరుగ నాగార్జున తెలిపారు. వైఎస్సార్‌ చేయూత మూడో విడత పంపిణీ కార్యక్రమంలో బాపట్ల వ్యవసాయ కళాశాలలోని డాక్టర్‌ బివి.నాథ్‌ ఆడిటోరియంలో శుక్రవారం జరిగింది. సీఎం జగన్‌ కుప్పం నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించగా బాపట్లలో మాజీ డిప్యూటీ స్పీకర్‌ కోన రఘుపతి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎన్నికల్లో జగన్‌ ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి నిరంతరం శ్రమిస్తున్నారన్నారు. 2050 నాటికి రాష్ట్రంలో పిల్లల చదువు పూర్తిగా మారిపోవాలనే లక్ష్యంతో విద్యారంగంలో పెనుమార్పులు తీసుకురావడం హర్షణీయమన్నారు. శాసనమండలి ఛీఫ్‌ విఫ్‌ డాక్టర్‌ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ  పేదలు వారి కాళ్లపై వారు నిలబడే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వివిధరకాలుగా ఆర్థిక చేయూత అందిస్తుందన్నారు. ఎన్నికల హామీల్లో 98.4శాతం అమలు చేశారని తెలిపారు. రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ మాట్లాడుతూ సంక్షేమ పథకాలతో ప్రజల తలసరి ఆదాయం గణనీయంగా పెరుగుతుందన్నారు. కలెక్టర్‌ కె.విజయకృష్ణన్‌ మాట్లాడుతూ చేయూత కింద జిల్లాలో 85,846 మంది లబ్ధిదారుల ఖాతాల్లో 160.96 కోట్ల నగదు బదిలీ చేసినట్లు తెలిపారు. ఎమెల్యే కోన రఘుపతి మాట్లాడుతూ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అధారిటీ పరిధిలోకి బాపట్ల రానున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ పోతుల సునీత, పర్చూరి ఇన్‌చార్జి రామనాథం బాబు, ఆర్డీవో గంధం రవీందర్‌, డీఆర్‌డీఏ పీడీ డాక్టర్‌ బి.అర్జునరావు, ఎల్‌డీఎమ్‌ ప్రేమ్‌కుమార్‌, మార్కెట్‌యార్డు చైర్మన్‌ గవిని కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. 


Read more