బాలినేనికి, కొడాలికి ఝలక్‌

ABN , First Publish Date - 2022-11-25T00:48:57+05:30 IST

వైసీపీ బాపట్ల జిల్లా కోఆర్డినేటర్‌గా ఉన్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి అధిష్ఠానం ఉద్వాసన పలికింది.

బాలినేనికి, కొడాలికి ఝలక్‌

పార్టీ పదవుల నుంచి ఉద్వాసన

వైసీపీ సమన్వయకర్తలుగా బీద, భూమన

బాపట్ల, నరసరావుపేట నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): వైసీపీ బాపట్ల జిల్లా కోఆర్డినేటర్‌గా ఉన్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి అధిష్ఠానం ఉద్వాసన పలికింది. రీజినల్‌ కోఆర్డినేటర్‌గా బాధ్యతలు తీసుకుని కొన్ని నెలలు గడవకముందే ఆయనను తప్పించడం జిల్లా వ్యాప్తంగా ఈ అంశం చర్చకు దారి తీసింది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కీలక నాయకుడు అందునా చీరాల, పర్చూరు, అద్దంకిలో మంచి పట్టు ఉండటంతో బాలినేనిని బాపట్ల జిల్లాకు రీజినల్‌ కోఆర్డినేటర్‌గా గతంలో నియమించారు. అయితే సమన్వయకర్తలను మార్చే ఆలోచన చేస్తున్నట్లు వైసీపీ అంతర్గత సమావేశాల్లో పార్టీ పెద్దలు చెప్పుకొచ్చారు. కానీ బాలినేని విషయంలో మార్పు ఉండదని అందరూ భావించారు. కానీ ఆయనను తప్పించి ఎంపీ బీద మస్తానరావు, ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డిలకు జిల్లా సమన్వయకర్తల బాధ్యతలను అప్పచెప్పడం సర్వత్రా చర్చనీయాంశమైంది

వరుస ఫిర్యాదులే కారణమా

బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఆయా నియోజకవర్గాల్లో కీలకంగా ఉన్న వైసీపీ నాయకులకు వ్యతిరేకంగా గ్రూపులను ప్రోత్సహించారన్న అపప్రధ బాలినేనిపై ఉంది. దీనికి తోడు పలువురు నాయకులు నేరుగా అధిష్ఠానానికే ఈ విషయంపై ఫిర్యాదు చేశారు. మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌, పర్చూరు ఇన్‌చార్జి రావి రామనాఽథంబాబు ఈ జాబితాలో ముందువరుసలో ఉన్నారు. అద్దంకిలో అసమ్మతి వర్గానికి సర్ది చెప్పకుండా ఆయనే మద్దతిచ్చి పార్టీ అభివృద్ధికి అడ్డుగా ఉన్నారన్న ప్రచారం కూడా వైసీపీ పెద్దల దృష్టికి వెళ్లింది. ఈ నేపథ్యంలో పార్టీ ఆయనను తప్పించి కొత్తవారికి బాధ్యతలను అప్పగించినట్లు సమాచారం.

కుమ్ములాటలను నియంత్రించేనా....

నూతనంగా సమన్వయకర్తగా నియమితులైన బీద, భూమనలు కుమ్ములాటలను నియంత్రించి పార్టీ పరిస్థితి చక్కదిద్దేనా అనే చర్చ కార్యకర్తల్లో ఉంది. ప్రకాశం నుంచి విడివడి బాపట్ల జిల్లాలో భాగమైన పర్చూరు, చీరాల, అద్దంకిలోనే ఈ గ్రూపుల బెడద ఎక్కువగా ఉండడం ఇప్పటికే పార్టీకి తలనొప్పిగా మారింది. వాటికి చికత్స చేసి పార్టీని ఏకతాటిపై నడిపించడంతో ఎంతవరకు విజయం సాధిస్తారనే చర్చ కూడా ఉంది.

నాడు మంత్రి.. నేడు పార్టీ పదవిపై వేటు

వైసీపీలో సంస్థాగతంగా అధిష్ఠానం మార్పులు చేసింది. మాజీ మంత్రి, ఎమ్మెల్యే కొడాలి నానికి జగన్‌ ఝలక్‌ ఇచ్చారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఆయన కుమారుడు లోకేశ్‌పై బూతుల వర్షం కురిపించే కొడాలిని ప్రాంతీయ సమన్వయకర్త పదవి నుంచి తప్పించారు. పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల ప్రాంతీయ సమన్వయకర్తగా కొడాలి నాని పార్టీ అభివృద్ధికి పనిచేయడంలేదంటూ ఆయన పదవిని ఊడగొట్టారు. ఈ మూడు జిల్లాల సమన్వయ కర్తలుగా ఈ సారి అధిష్ఠానం ఇద్దరిని నియమించింది. బీదా మస్తాన్‌రావు, భూమన కరుణాకరరెడ్డిలను పార్టీ ప్రాంతీయ సమన్వయ కర్తలుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కొడాలి నాని ఒక్క సారి మాత్రమే సమన్వయ కర్తగా పల్నాడు జిల్లాకు వచ్చారు. ఇక్కడ జరిగిన పార్టీ ప్లీనరీలో పాల్గొన్నారు. పదవి పొందిన తర్వాత మూడు జిల్లాలో పర్యటించకపోవడంతో ఆయనపై అధిష్ఠానం వేటు వేసినట్లుగా పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. మంత్రి పదవి నుంచి తొలగించి ప్రాంతీయ సమన్వయకర్తగా నియమించి అధిష్ఠానం అప్పట్లో నానిని బుజ్జగించింది. ఈ క్రమంలో అటు మంత్రి పదవి, ఇటు సమన్వయకర్త పదవులు రెండింటిని ఊడగొట్టడం పార్టీలో చర్చనీయంశమైంది. పార్టీని బలోపేతం చేసేందుకు బీదా, భూమనలు మూడు జిల్లాలో పర్యటించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. పల్నాడు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా మాచర్ల ఎమ్మెల్యేను పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కొనసాగించారు.

వైసీపీ జిల్లా అధ్యక్షుడుగా డొక్కా

వైసీపీ జిల్లా అధ్యక్షుడుగా ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్‌ నియమితులయ్యారు. రాష్ట్ర స్థాయిలో పార్టీ జిల్లా అధ్యక్షుల నియామకాల్లో భాగంగా అధిష్ఠానం జిల్లా అధ్యక్షుడుగా డొక్కాను నియమించింది. ఇటీవల వరకు జిల్లా అధ్యక్షురాలుగా ఉన్న మాజీ మంత్రి, ప్రత్తిపాడు ఎమ్మెల్యే మేకతోటి సుచరిత పార్టీ వ్యవహారాల్లో అంటీముట్టనట్లుగానే వ్యవహరించారు. జిల్లా అధ్యక్షురాలుగా ఎక్కడా ఆమె సమీక్షలు కానీ పార్టీ నేతలతో కలిసి పాల్గొన్న సందర్భాలు కూడా పెద్దగా లేవు. తాను జిల్లా అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకుంటానని, ఇదే విషయాన్ని అధిష్ఠానానికి కూడా చెప్పినట్లు ఇటీవల ఆమె ప్రకటించారు. ఈ నేపథ్యంలో కొత్త అధ్యక్షుడిపై కూడా పార్టీలో కొంత చర్చ జరిగింది. ఈ క్రమంలో కొత్త అధ్యక్షుడిగా మాణిక్యవరప్రసాద్‌ను అధిష్ఠానం ప్రకటించింది. జిల్లా రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం, సామాజికవర్గం మాణిక్యవరప్రసాద్‌కు కలిసొచ్చిన అంశాలుగా చెప్పవచ్చు. ఎమ్మెల్సీగా కొనసాగుతున్న డొక్కాను ఇటీవల తాడికొండ నియోజకవర్గ ఇన్‌చార్జిగా నియమించటం అప్పట్లో వివాదాస్పదమైంది. ఆ నియోజకవర్గంలో అనుకూల, వ్యతిరేకవర్గాలతో కొంతకాలం రగడ కూడా తారాస్థాయికి చేరింది. కాగా ప్రస్తుతం జిల్లా అధ్యక్షుడుగా ప్రకటించిన నేపథ్యంలో ఆయన్ను తాడికొండ నియోజకవర్గ బాధ్యతల నుంచి తప్పించే అవకాశం ఉందా అని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది.

Updated Date - 2022-11-25T00:49:01+05:30 IST