మేనమామ కాదు .. కంసమామ

ABN , First Publish Date - 2022-12-10T01:28:19+05:30 IST

విద్యార్థులకు మేనమామ అని చెప్పుకుంటున్న జగన్‌ మేనమామ కాదు, కంసమామ అని మాజీ ఎమ్మెల్యే యరపతినేని ధ్వజమెత్తారు.

మేనమామ కాదు .. కంసమామ
మాడుగుల జడ్పీ పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత, ఇబ్బందులపై యరపతినేనికి వివరిస్తున్న విద్యార్థులు

పిడుగురాళ్ల, డిసెంబరు 9: విద్యార్థులకు మేనమామ అని చెప్పుకుంటున్న జగన్‌ మేనమామ కాదు, కంసమామ అని మాజీ ఎమ్మెల్యే యరపతినేని ధ్వజమెత్తారు. ఉపాధ్యాయులు కావాలని పల్నాడు జిల్లా గురజాల మండలం మాడుగుల జడ్పీపాఠశాల విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసింది. ఈ నేపథ్యంలో పాఠశాలను మాజీ ఎమ్మెల్యే యరపతినేని శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడి తరగతులన్నీ కలియతిరిగారు. పాఠశాల తరగతి గదుల్లో ఖాళీగా కూర్చున్న విద్యార్థులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా కొంతమంది విద్యార్థులు మాకు ఏడుగురు ఉపాధ్యాయులు కావాల్సి ఉందని, ఒక్కరే ఉండటం చదువుకు ఇబ్బందిగా ఉందని, మిగిలిన వారిని నియమించాలని అధికారుల దృష్టికి వెళ్లేందుకు ఆందోళన చేస్తే ఉన్న ఒక్కరిని ఎందుకు సస్పెండ్‌ చేశారో అర్థం కావటంలేదన్నారు. పదోతరగతి చదువుతున్న 20 మంది విద్యార్థుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. బాగా చదువుకుంటామని, కావాల్సినంత మంది టీచర్లను పెట్టమంటే.... ఉన్న ఒక్కరిని తీసేశారని యరపతినేని ముందు వాపోయారు.

నా ఖర్చుతో ప్రైవేటు ఉపాధ్యాయులను ఏర్పాటు చేస్తా...

మాడుగుల జడ్పీ పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత విద్యార్థు ల భవితవ్యంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అన్ని పాఠ్యాంశాలు బోధించేందుకు ప్రైవేటు టీచర్లను, అవసరమైన పుస్తకాలను కూడా నా సొంతఖర్చుతో అందిస్తానని యరపతి నేని శ్రీనివాసరావు విద్యార్థులకు భరోసా ఇచ్చారు. ఉపాధ్యాయులు కావాలని ఆందోళన చేస్తే ఉన్న ఒక్కరిని సస్పెండ్‌ చేస్తారా..? విద్యార్థులపై పోలీసుల హెచ్చరికలు చేయడం సబబేనా అని ప్రశ్నించారు. యరపతినేని విద్యార్థులతో మాట్లాడుతున్న సమయంలోనే ఇన్‌చార్జ్‌ ఎంఈఓ ఫోన్‌ చేసి.... సోమవారం నాటికి ఉపాధ్యాయుల సర్దుబాటు ఉంటుందని... ఉపాధ్యాయుల కొరతపై విద్యాశాఖ స్పందిస్తుందని, మీరెందుకు జోక్యం చేసుకుంటారనటంపై యరపతినేని ఇన్‌చార్జ్‌ ఎంఈఓపై మండిపడ్డారు. గత 20 రోజులుగా విద్యార్థులు ఆందోళన చేస్తుంటే ఉపాధ్యాయులను సర్దుబాటు చేయని మీరు నేనొస్తున్నానని హడావిడిగా సర్దుబాటు చేస్తున్నట్టు ఉంది. ప్రభుత్వం చేయలేని పని మేము చేస్తామని తెలిసే హడావిడి చేస్తున్నట్లు కనిపిస్తుందన్నారు.

Updated Date - 2022-12-10T01:28:47+05:30 IST