జాబితాల్లోని నకిలీ ఓట్లను గుర్తించాలి

ABN , First Publish Date - 2022-11-25T00:51:28+05:30 IST

ఓటర్ల జాబితాల్లో నకిలీ ఓట్లను గుర్తించి వాటిని తొలగించాలని జిల్లా ఎన్నికల పరిశీలకులు ఎస్‌ సత్యనారాయణ అధికారులను ఆదేశించారు.

జాబితాల్లోని నకిలీ ఓట్లను గుర్తించాలి
సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా ఎన్నికల పరిశీలకులు ఎస్‌ సత్యనారాయణ

జిల్లా ఎన్నికల పరిశీలకులు సత్యనారాయణ

నరసరావుపేట, నవంబరు 24: ఓటర్ల జాబితాల్లో నకిలీ ఓట్లను గుర్తించి వాటిని తొలగించాలని జిల్లా ఎన్నికల పరిశీలకులు ఎస్‌ సత్యనారాయణ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో గురువారం జరిగిన రాజకీయ పక్షాలతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఓటర్ల అంశంలో ఎటువంటి ఫిర్యాదులు వచ్చినా వెను వెంటనే పరిష్కరించాలని సత్యనారాయణ సూచించారు. ప్రశాంత వాతావరణంలో ఓటర్ల జాబితా రూపొందించాలన్నారు. ప్రతి పోలింగ్‌ కేంద్రం వద్ద ఎన్నికల అధికారులు, కలెక్టర్‌ ఫోన్‌ నెంబర్‌లతో కూడిన బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కలెక్టర్‌ శివశంకర్‌ మాట్లాడుతూ నిష్పక్షపాతంగా ఓటర్ల జాబితా తయారు చేయాలన్నారు. రాజకీయ పార్టీల ప్రలోభాలకు గురికాకుండా సమర్ధంగా ఓటర్ల జాబితాలను బూత్‌ల వారీగా రూపొందించాలని చెప్పారు. ఈ విషయంలో అలసత్వం తగదన్నారు. గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్‌ రెడ్డి మాట్లాడుతూ జీవించి ఉన్న వారు చనిపోయినట్లుగా తెలియజేస్తూ వాటి తొలగింపునకు ఒకే వ్యక్తి దరఖాస్తు చేస్తున్నారని అటువంటి వారిని గుర్తించి వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. వివిధ రాజకీయ పార్టీల నాయకులు పలు అంశాలను ప్రస్తావించారు. సమావేశంలో జేసీ శ్యాంప్రసాద్‌, డీఆర్‌వో వినాయకం తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-25T00:51:33+05:30 IST