రాజకీయ.. బదిలీలు

ABN , First Publish Date - 2022-06-13T04:41:08+05:30 IST

బదిలీ పర్వానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మూడేళ్ల తర్వాత ఉద్యోగుల బదిలీలు జరగనున్నాయి.

రాజకీయ.. బదిలీలు

నాయకుల కనుసన్నల్లో వ్యవహారం

సిఫార్సుల కోసం ఉద్యోగుల ప్రయత్నాలు

పారదర్శకంగా ఉండాలని కోరుతున్న సంఘాలు

ఆర్డర్‌ టూ సర్వ్‌ పోస్టింగ్‌ ఉద్యోగులకు మినహాయింపు

ఉమ్మడి జిల్లా ప్రాతిపదికనే జడ్పీ ఉద్యోగులకు బదిలీలు 

బాపట్ల, జూన్‌ 13 (ఆంధ్రజ్యోతి): బదిలీ పర్వానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మూడేళ్ల తర్వాత ఉద్యోగుల బదిలీలు జరగనున్నాయి. ఎంతో కాలంగా ఆశతో ఎదురుచూస్తున్న ఉద్యోగులకు ఇది తీపి కబురే. అయితే  అధికార పార్టీ నాయకులు మాత్రం అనుకూలంగా ఉండేవారిని నియమించుకోవాలని కొందరు.. సొమ్ము చేసుకోవాలనే ఆలోచనలో మరికొందరు ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఈ నెల 17 వరకు బదిలీలకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఈ క్రమంలో ఏదో ఒక విధంగా తమ విధేయతను చాటుకుని నేతల దృష్టిలో పడేందుకు కొందరు ఉద్యోగులు తంటాలు పడుతున్నారు. గతంలో బదిలీల్లో రాజకీయ జోక్యం ఉన్నా అది  తెరవెనుక జరిగేది. అయితే ప్రస్తుతం అదంతా బహిరంగంగానే జరుగుతున్నట్లు సమాచారం. వాస్తవానికి సీనియారిటీ ప్రాతిపదికన, ఇతర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఆయా విభాగాధిపతుల పర్యవేక్షణలోనే ఈ ప్రక్రియ జరగాలి. కొన్నింటికి సంబంధించి కలెక్టర్‌ నిర్ణయం మేరకే ఈ బదిలీలు జరుగుతాయి.  కానీ వీటిని తుంగలో తొక్కి తమ అనుకూలురకు తాము అడిగిన చోట పోస్టింగ్‌ ఇవ్వాల్సిందేనని నేతలు అధికారులపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. ద్వితీయ శ్రేణి నేతాగణం కూడా అధికారులకు ఫోన్‌ చేసి ఆదేశాలు ఇస్తుండడంతో ఏమిచేయాలో పాలుపోక తలలు పట్టుకుంటున్నట్లు తెలుస్తోంది. పైరవీలు చేతకాక సమర్థతనే నమ్ముకుని ఉద్యోగం చేస్తున్న వారు మాత్రం తమకు అన్యాయం జరుగుతుందేమోనని ఆవేదన చెందుతున్నారు. బదిలీల వ్యవహారంలో రాజకీయ జోక్యాన్ని నియంత్రిస్తూ మార్గదర్శకాల ప్రకారమే జరిగే విధంగా కలెక్టర్‌ ప్రయత్నించాలని ఉద్యోగులు, వారి సంఘాలు ఎదురుచూస్తున్నాయి. అప్పుడే అర్హత గల ఉద్యోగులకు న్యాయం జరుగుతుందని, లేదంటే ప్రభుత్వ కార్యాలయాలు రాజకీయ పునరావాసాలుగా మారే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. కీలకమైన బదిలీల విషయంలో ప్రభుత్వం పరిమిత గడువు విధించడం పలు అనుమానాలకు తావిస్తోందని ఉద్యోగులు వాపోతున్నారు. తక్కువ సమయం వల్ల గందరగోళ పరిస్థితులు ఏర్పడి అర్హత గల వారికి అన్యాయం జరిగితే సహించమని ఉద్యోగ సంఘాల నాయకులు హెచ్చరిస్తున్నారు. 

గతంలో ఎన్నడూ లేని స్థాయిలో ఒత్తిళ్లు

బదిలీలను ఆయాశాఖల విభాగాధిపతులు ఫిర్యాదులు, ఆరోపణలకు అవకాశం ఇవ్వకుండా అత్యంతపారదర్శకంగా చేపట్టాలి. అయితే ప్రస్తుతం రాజకీయ ఒత్తిళ్లను తట్టుకుని బదిలీల విషయంలో పారదర్శకంగా ఉంటారనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికే చోటామోటా నేతలు రంగంలోకి దిగి అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. కొంతమంది నేతలైతే ఒకడుగు ముందుకేసి బదిలీల జాబితా పట్టుకుని తమ వద్దకు రావాలని కూడా ఆదేశిస్తున్నట్లు తెలిసింది. నిబంధనలు పాటించకుండా నేతల సిఫార్సుల మేరకు బదిలీలు చేపడితే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవనే అంచనాకు వచ్చిన ఒకరిద్దరు అధికారులు సదరు నాయకులకు గట్టిగానే సమాధానమిచ్చారని తెలుస్తోంది. తమకు అనుకూలంగా ఉండేవారికే కోరుకున్న చోటకు బదిలీలు ఉంటాయని నియోజకవర్గ కేంద్రంలో ఓ కీలకశాఖ కార్యాలయానికి అధికారపార్టీకి చెందిన ద్వితీయ శ్రేణి నేత ఒకరు వచ్చి బాహాటంగా ప్రకటించారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. కీలకశాఖల్లో అధికార స్థాయిలో  అనుకూలురను నియమించుకోవడం సర్వసాధారణం.. అయితే ప్రస్తుతం కిందిస్థాయి బదిలీల విషయంలో ఈ స్థాయిలో రాజకీయ జోక్యం గతంలో ఎన్నడూ చూడలేదని ఉద్యోగులు అంటున్నారు. 

జిల్లాలో 1,500 మంది ఉద్యోగులకు స్థానచలనం

బాపట్ల జిల్లాలో దాదాపు 1,500 మంది ఉద్యోగులు బదిలీల ప్రక్రియలో భాగంగా వేరేచోటకు వెళ్లనున్నారని సమాచారం. ఇప్పటికే ఆయా శాఖల్లో ఈ ప్రక్రియ ఊపందుకుంది. విద్యుత్‌, వైద్య ఆరోగ్యశాఖ విభాగాల్లో బదిలీలపై ఇప్పటికే ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చారని సమాచారం.  మిగిలిన శాఖల్లో కూడా ప్రక్రియ ఒకట్రెండు రోజుల్లో కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. కొత్త జిల్లా నియామకాల్లో భాగంగా పలువురు ఉద్యోగులు ఆర్డర్‌ టూ సర్వ్‌ ప్రాతిపదికన నియమితులయ్యారు. దాదాపు అన్ని జిల్లా అధిపతుల కార్యాలయాల్లో ఈ ప్రాతిపదికన వచ్చిన ఉద్యోగులు ఉన్నారు. వారందరినీ బదిలీల నుంచి మినహాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. అయితే ఇందులో తమకు అన్యాయం జరిగిందని వారు వాపోతున్నారు. 


Read more