స్వచ్ఛతలో.. నిరాశే!

ABN , First Publish Date - 2022-10-04T06:02:31+05:30 IST

కేంద్ర ప్రభుత్వం, స్వచ్ఛ భారత్‌ మిషన్‌ జాతీయ స్థాయిలో స్వచ్ఛసరేక్షణ్‌- 2022 ర్యాంకులను అక్టోబరు ఒకటిన ప్రకటించింది.

స్వచ్ఛతలో.. నిరాశే!

స్వచ్ఛసర్వేక్షణ్‌ ర్యాకింగ్‌లో మున్సిపాలిటీలు వెనుకబాటు

గుంటూరుకు 108, నరసరావుపేటకు 248, బాపట్లకు 146 ర్యాంకులు

అధ్వాన్నంగా గురజాల, దాచేపల్లి, చిలకలూరిపేట నగరాలు

పర్వాలేదనిపించిన సత్తెనపల్లి, రేపల్లె, పొన్నూరు మున్సిపాలిటీలు

2016 నుంచి వందలోపు ర్యాంకు సాధించలేకపోయిన జీఎంసీ

ప్రకటనలకే పరిమితమైన పరిశుభ్రతపరిశుభ్రతకు, పచ్చదనానికి తొలి ప్రాధాన్యం అంటూ అధికారులు, పాలకులు చెప్పిన మాటలు ప్రకటనలకే పరిమితమవుతున్నాయి. ఇంటింటికీ చెత్తసేకరణ, తరలింపు, ఘనవ్యర్ధాల నిర్వహణ, ప్లాస్టిక్‌ నిషేధం వంటి కీలక అంశాలు క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదని స్వచ్ఛ సర్వేక్షణ్‌ ర్యాంకులతో మరోసారి రుజువైంది. 100లోపు ర్యాంకులు సాఽధించి సత్తెనపల్లి, పొన్నూరు, రేపల్లె స్వచ్ఛత విషయంలో జిల్లాలో ముందున్నాయి. 300కు పైన ర్యాంకులు సాధించి చిలకలూరిపేట, గురజాల, దాచేపల్లి మున్సిపాలిటీలు వెనుకబడి పోయాయి. గుంటూరు 108వ ర్యాంకుతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇప్పటికైనా అధికారులు ప్రకటనలకే పరిమితం కాకుంగా క్షేత్రస్థాయిలో వాటి అమలు తీరును పర్యవేక్షించాల్సిన అవసరముంది.  


గుంటూరు(తూర్పు), అక్టోబరు3: కేంద్ర ప్రభుత్వం, స్వచ్ఛ భారత్‌ మిషన్‌ జాతీయ స్థాయిలో స్వచ్ఛసరేక్షణ్‌- 2022 ర్యాంకులను అక్టోబరు ఒకటిన ప్రకటించింది. తాజాగా ప్రకటించిన ర్యాంకుల్లో మరోసారి జిల్లాలోని నగరపాలక సంస్థ, మున్సిపాలిటీలు తీవ్ర నిరాశపరిచాయి. పరిశుభ్రత విషయంలో గుంటూరు 108వ ర్యాంకుతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కాకపోతే 2021లో 130వ స్థానం సాధించిన జీఎంసీ ఈసారి మాత్రం 108కు చేరుకోవడం ఊరటనిచ్చే విషయం. 2016 నుంచి ప్రారంభమైన స్వచ్ఛసర్వేక్షణ్‌ ర్యాకింగ్‌ల్లో ఒక్కసారి కూడా నగరపాలక సంస్థ 100లోపు ర్యాంకును సాధించలేదు. రాష్ట్రస్థాయిలో గత ఏడాది ఐదోస్థానం సాధించిన జీఎంసీ ఈసారి మాత్రం 7వ ర్యాంకుతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 


 నగరపాలక సంస్థ తీరిది..

స్వచ్ఛసర్వేక్షణ్‌ నగరంలో చేపట్టిన సర్వేలో ఇంటింటికీ చెత్తసేకరణ, మార్కెట్‌, రెసిడెన్షియల్‌, డ్రైయిన్ల శుభ్రత, రోజు చెత్తను ఊడవడం వంటి విషయాల్లో మెరుగ్గా ఉన్నప్పటికీ రోడ్ల శుభ్రత, పబ్లిక్‌ టాయిలెట్లు, మంచినీటి షెడ్ల నిర్వహణ, పచ్చదనం, తగినన్ని చెత్త డంప్‌లను ఏర్పాటు చేయడం వంటి అంశాల్లో వెనుకబడి ఉంది. 


 నరసరావుపేట దారుణం.. బాపట్ల పర్వాలేదు

నూతనంగా ఏర్పాటైన జిల్లాల కేంద్రాలైన నరసరావుపేట స్వచ్ఛత విషయంలో మరింతగా వెనకబడింది. మార్కెట్ల నిర్వహణ, రెసిడెన్షియల్‌ ఏరియా శుభత్ర విషయంలో నరసరావుపేట మున్సిపాలిటీ మెరుగ్గా ఉన్నంది. ఇంటింటి చెత్త సేకరణ, పబ్లిక్‌ టాయిలెట్స్‌ నిర్వహణ విషయాల్లో ఫరవాలేదనిపించింది. డ్రైయిన్ల నిర్వహణలో మరింత వెనుకబడి ఉంది. బాపట్ల ఇంటింటికి చెత్తసేకరణ, మార్కెట్‌, రెసిడెన్షియల్‌, డ్రైయిన్ల నిర్వహణ, మంచినీటి వాటర్‌ షెడ్ల నిర్వహణ వంటి అంశాల్లో ప్రగతిని సాధించినప్పటికీ  పబ్లిక్‌ టాయిలెట్‌ నిర్వహణ, తగినన్ని చెత్త డంప్‌ల ఏర్పాటు, పచ్చదనం వంటి విషయాల్లో బాగా వెనుకంజలో ఉంది. 


ఇవి అధ్వానం..

స్వచ్ఛత విషయంలో 300కు పైన ర్యాంకులు సాధించి చిలకలూరిపేట, గురజాల, దాచేపల్లి మున్సిపాలిటీలు మరింత అధ్వాన్నస్థితికి చేరుకున్నాయి. ఇంటింటికీ చెత్త సేకరణ వంటి అంశంలో మినహా ఆ  పట్టనాల్లో ఇతర అంశాలో పరిశుభ్రత పాటించడంలేదని నివేదికలో వెల్లడించింది. ముఖ్యంగా గురజాలలో మార్కెట్‌ ఏరియాల పరిశుభ్రత, పబ్లిక్‌ మరుగుదొడ్లు నిర్వహణ వంటి విషయాల్లో రెడ్‌మార్క్‌ను సాధించింది. పరిస్థితి ఇలానే ఉంటే స్వచ్ఛత విషయంలో గురజాలలో రెడ్‌జోన్‌గా ప్రకటించాల్సిన వస్తుందని స్పష్టం చేసింది. 


ఇవి కాస్త మెరుగు..

100లోపు ర్యాంకులు సాఽధించి సత్తెనపల్లి, పొన్నూరు. రేపల్లె స్వచ్ఛత విషయంలో జిల్లాలో ముందున్నాయి. పబ్లిక్‌ మరుగుదొడ్ల్ల నిర్వహణ మినహా ఇతర అంశాల్లో ప్రగతి సాధించాయి. ముఖ్యంగా పరిశుభ్రత విషయంలో జిల్లాలో సత్తెనపల్లి 47వ ర్యాంకు సాధించి అగ్రస్థానంలో ఉంది. వీటితో పాటు తాడేపల్లి 81, మంగళగిరి 83ర్యాంకులు సాధించి కాస్త ఫరవాలేదనిపించాయి. 


దిగజారిన తెనాలి..

స్వచ్ఛత విషయంలో జిల్లాలో ముందుండే తెనాలి 236 స్థానానికి దిగజారిపోయింది. తడి, పొడి చెత్తలు విడివిడిగా సేకరించకపోవడం, తూతూమంత్రంగా పారిశుధ్య కార్యక్రమాలు, మురుగునీటి శుద్ధి ప్లాంట్లు నిర్మాణదశలోనే ఉండటం వంటి కారణాలతో తెనాలికి ఈ ర్యాంకు వచ్చిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. 


మెరుగుపడకపోతే ప్రమాదమే..

స్వచ్ఛత విషయంలో మెరుగుపడకపోతే భవిష్యత్తులో మరిన్ని ప్రమాదాలు చూడాల్సి వస్తుంది. జనాభా, విస్తీర్ణంలో మనకంటే పెద్దనగరాలు స్వచ్ఛత విషయంలో పకడ్బదీగా చర్యలు చేపడుతుంటే మనం మాత్రం వెనుకబడిపోవడం బాధాకరం. తడి, పొడి చెత్తల సేకరణ, ప్లాస్టిక్‌ నిషేధం వంటివి పటిష్టంగా అమలు చేయాలి. మొక్కలను నాటడంతో పాటు, వాటి పర్యవేక్షణను కూడా చేపట్టాలి. అలాగే మంచినీటి వాటర్‌ షెడ్లను నిత్యం తనిఖీలు చేయాలి. రోడ్లు శుభ్రత విషయంలో మెరుగైన ప్రమాణాలు పాటించాలి. అప్పుడే నగరాల్లో స్వచ్ఛత సాధ్యమవుతుంది. 

 - కేఎస్‌ లక్ష్మణరావు, ఎమ్మెల్సీ  

Read more