పెట్రోల్‌ బాటిల్‌తో మాచర్ల మహిళ కలకలం

ABN , First Publish Date - 2022-06-07T06:13:06+05:30 IST

మాచర్ల పట్టణానికి చెందిన మహిళ పెట్రోల్‌ బాటిల్‌తో సోమవారం పల్నాడు జిల్లా నరసరావుపేట కలెక్టర్‌ కార్యాలయం వద్ద కలకలం సృష్టించింది.

పెట్రోల్‌ బాటిల్‌తో మాచర్ల మహిళ కలకలం
జేసీ శ్యామ్‌ ప్రసాద్‌కు తన వద్దనున్న పత్రాలు చూపించి సమస్యను విరిస్తున్న మిద్దె విజయలక్ష్మి

నరసరావుపేట టౌన్‌, జూన్‌ 6 : మాచర్ల పట్టణానికి చెందిన మహిళ పెట్రోల్‌ బాటిల్‌తో సోమవారం పల్నాడు జిల్లా నరసరావుపేట కలెక్టర్‌ కార్యాలయం వద్ద కలకలం సృష్టించింది. మాచర్ల మున్సిపాలిటిలోని నెహ్రూనగర్‌కు చెందిన మిద్దె విజయలక్ష్మి తనకు గతంలో ప్రభుత్వం సెంటన్నర భూమి ఇవ్వగా, దానిలో  ఇల్లు నిర్మించుకొన్నానని వివరించింది.  అయితే మున్సిపాలిటి వారిని ఇంటి పన్ను వేయమని ఎన్ని సార్లు అడిగినా వేయలేదని, స్పందనలో పెడితే నాముందే మాచర్ల కమిషనర్‌ అర్జీని డస్ట్‌బిన్‌ వేసి. ఏమి చేసుకుంటావో చేసుకోమని  నిర్లక్ష్యంగా  చెప్పారని వాపోయింది. దీంతో విసిగిపోయి, కలెక్టర్‌ కార్యాలయం వద్ద పెట్రోల్‌ బాటిల్‌ తెచ్చుకొని మీదపోసుకొని ఆత్మహత్యాయత్నం చేసింది. సమీపంలో కార్యలయ సిబ్బంది, ఇతరులు అడ్డగించి ఆమెవద్దనుంచి ఆ బాటిల్‌ లాగేసుకున్నారు. స్పందించిన జేసీ శ్యామ్‌ ప్రసాదు ఆమె వద్దకు వచ్చి సమస్య అడిగి తెలుసుకున్నారు. తాహసిల్దార్‌, సర్వేయర్‌ అందరూ నివేదిక ఇచ్చినా, ఎమ్మెల్యే పన్నువేయమని చెప్పినా పన్నువేయలేదని  విజయలక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. మా మామయ్య మిద్దే వెంకటయ్య పేరుమీద ఉన్న ఇంటిని మోసం చేసి కటకం పద్మ రిజిస్ట్రేషన్‌ చేయించుకుందని, దానికి నాఇంటి హద్దులు పెట్టుకొని ఇళ్లు నాది అంటున్నారని వివరించారు. జేసీ శ్యామ్‌ప్రసాదు స్పందించి తక్షణమే సంబంధిత మాచర్ల మున్సిపల్‌ కమీషనర్‌, మండల రెవెన్యూ అధికారులతో చర్చించి వాస్తవికతను దృష్టిలో ఉంచుకొని నిశితంగా పరిశీలించి బాధితురాలికి వెంటనే వారం లేదా, పది రోజులలో న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.


Read more