విద్యార్థులకూ.. ముఖహాజరే

ABN , First Publish Date - 2022-11-30T00:38:26+05:30 IST

ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులకు, ప్రభుత్వ వైద్యశాలల్లో అమలు చేస్తున్న ముఖహాజరు విధానాన్ని ఇక నుంచి విద్యార్థులకు అమలు చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది.

విద్యార్థులకూ.. ముఖహాజరే

నరసరావుపేట, నవంబరు 29: ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులకు, ప్రభుత్వ వైద్యశాలల్లో అమలు చేస్తున్న ముఖహాజరు విధానాన్ని ఇక నుంచి విద్యార్థులకు అమలు చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. ఈ నూతన విధానాన్ని 1వ తేదీ నుంచి అమలు చేయాలని విద్యా సంస్థలకు ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. డీగ్రీ, పీజీ, ఇంజనీరింగ్‌, ఫార్మసీ తదితర విద్యార్థులకు ముఖ హాజరును వర్తింపచేయనున్నారు. విద్యార్థులు తప్పనిసరిగా తరగతులకు హాజరై నిర్ణీత సమయంలో యాప్‌ ద్వారా ముఖహాజరు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. విద్యార్థుల వివరాలను జ్ఞానభూమి పోర్టల్‌లో ఇప్పటివరకు అప్‌లోడ్‌ చేసే వారు. ముఖహాజరు అమలులోకి వస్తుండటంతో ప్రిన్సిపాల్స్‌, అధ్యాపకులు ముందుగా విద్యార్థులను నమోదు చేయాల్సి ఉంటుంది. ఒక్కొక్క అధ్యాపకుడు కనీసం 10 మంది విద్యార్థుల హాజరు నమోదుకు వారి కళ్లను స్కాన్‌చేసి ఫొటో తీసి యాప్‌లో అప్‌లోడ్‌ చేయాలి. ఈ ప్రక్రియ తదుపరి ఉదయం విద్యార్థి తరగతికి వెళ్లే ముందు అధ్యాపకుల యాప్‌లో తమ ముఖ హాజరు వేసుకుని అనంతరం విద్యార్థుల ముఖహాజరు నమోదు చేయాలి. ఇలా ప్రతి రోజు ఉదయం, సాయంత్రం రెండు సార్లు ముఖహాజరు నమోదు చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. ముఖహాజరుకు అధ్యాపకుల మొబైల్‌ ఫోన్లలో యాప్‌ను డౌన్‌లోడు చేస్తున్నారు. సాంకేతిక సమస్యలు తలెత్తకుంటే కచ్చితంగా ఒకటో తేదీ నుంచి ఈ విధానం అమలులోకి రానున్నది. నూతన విధానంలో ఫీజు రీయింబర్స్‌మెంటు పొందే ప్రతి విద్యార్థి ఇక తరగతులకు హాజరుకావాల్సిందే.

ఫొటోలతో సరి.. మరి బోధన

విద్యార్థుల ముఖ హాజరు విధానంలో ఉదయం, సాయంత్రం రెండు సార్లు అధ్యాపకులు నమోదు చేయాలి. ఇలా రోజుకు రెండు సార్లు తమ సెల్‌ఫోన్‌ ద్వారా విద్యార్థుల ఫొటోలు తీస్తుంటే ఇక పాఠాలు బోధించేందుకు ఇబ్బందులు ఏర్పడుతాయని అధ్యాపకులు అంటున్నారు. తరగతుల నిర్వహణకు ఆటంకం ఏర్పడుతుందన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. దీని అమలుపై ప్రిన్సిపాల్స్‌, అధ్యాపకులు మల్లగుల్లాలు పడుతున్నారు.

ముఖహాజరుతో మరి కొందరికి కోత

ప్రభుత్వం విద్యాదీవెన పేరుతో అందిస్తున్న ఫీజు రీయింబర్స్‌మెంట్‌, వసతిదీవెన పేరుతో అందిస్తున్న స్కాలర్‌షిప్‌లలో కోత విధించేందుకే ముఖహాజరు విధానాన్ని ప్రవేశపెడుతున్నదన్న విమర్శలున్నాయి. మూడేళ్లల్లో వివిధ కారణాలతో వేల మంది విద్యార్థులు ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు అర్హత కోల్పోయారు. ముఖ హాజరుతో మరి కొంతమందికి కోత విధించేందుకే ఈ విధానాన్ని ప్రభుత్వం అమలు చేయబోతున్నదన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ఇప్పటి వరకు 70 శాతం హాజరు ఉన్న విద్యార్థులకు విద్యా, వసతి దీవెనను అందిస్తున్నది. ఈ- హాజరులో అక్రమాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ అక్రమాలను నివారించేందుకు ముఖహాజరు విధానాన్ని ప్రభుత్వం అమలు చేస్తున్నదని సదరు అధికారులు చెబుతున్నారు.

Updated Date - 2022-11-30T00:38:26+05:30 IST

Read more