తొలగింపుపై తకరారు

ABN , First Publish Date - 2022-09-24T05:55:21+05:30 IST

నరసరావుపేటలో విగ్రహం తొలగింపు అంశంపై రగడ కొనసాగుతూనే ఉంది. హైకోర్టు ఆదేశాల ప్రకారం తొలగించాల్సిన విగ్రహం విషయంలో అధికార యంత్రాంగం తకరారు పెడుతోందన్న విమర్శలు వస్తున్నాయి.

తొలగింపుపై తకరారు
పల్నాడు రోడ్డులో ఏర్పాటు చేసిన వైఎస్‌ఆర్‌ విగ్రహం

విగ్రహం తొలగింపుపై మీనమేషాలు

హైకోర్టు ఆదేశాల అమల్లో కొరవడిన చిత్తశుద్ధి 

అనధికార విగ్రహాలన్నింటిపైనా చర్యలకు సిద్ధం 

వారమే గడువని కమిటీలకు కమిషనర్‌ నోటీసులు

స్వచ్ఛందంగా తొలగించకుంటే మున్సిపాల్టీనే చర్యలు 


నరసరావుపేట, సెస్టెంబరు 23: నరసరావుపేటలో విగ్రహం తొలగింపు అంశంపై రగడ కొనసాగుతూనే ఉంది. హైకోర్టు ఆదేశాల ప్రకారం తొలగించాల్సిన విగ్రహం విషయంలో అధికార యంత్రాంగం తకరారు పెడుతోందన్న విమర్శలు వస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా.. ప్రభుత్వ ఉత్తర్వులకు వ్యతిరేకంగా నరసరావుపేటలో  ఏర్పాటు చేసిన విగ్రహాన్ని తొలగించాలని ఇటీవల హైకోర్టు ఆదేశాల జారీ చేసింది. రోజులు గడుస్తున్నా ఈ ఆదేశాల అమల్లో అధికారుల్లో చిత్తశుద్ధి కొరవడిందన్న విమర్శలున్నాయి. తొలుత హైకోర్టు ఆదేశాలను అమలు చేసి తదుపరి అనధికార విగ్రహాలన్నింటిపై అధికారులు చర్యలు తీసుకోవాలి. అయితే అందుకు విరుద్ధంగా విగ్రహాలన్నింటిపైనా చర్యలు అంటూ హైకోర్టు ఆదేశాలను పక్కన పెట్టారు. ఈ పరిస్థితుల్లో నరసరావుపేటలో విగ్రహాల రగడ కొనసాగుతూనే ఉంది. అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన విగ్రహాల తొలగింపులపై చర్యలకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. అనఽధికార విగ్రహాలను నిర్వాహకులే స్వచ్ఛందంగా తొలగించాలని అందుకు వారం రోజులు గడువు ఇస్తూ మున్సిపల్‌ కమిషనర్‌  రవీంద్ర 21న నోటీసులను జారీ చేశారు. గడువులోపు తొలగించకుంటే అనధికార విగ్రహాలపై మున్సిపాల్టీనే చర్యలు తీసుకుంటుందని ఆ నోటీసులో కమిషనర్‌ హెచ్చరించారు. ఇంతవరకు బాగానే ఉన్నా హైకోర్టు ఉత్తర్వులను అమలు చేయకుండా దీనిని మరోవైపు తిప్పడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎంతోకాలంగా ఉన్న విగ్రహాలను కదిలిస్తే పరిస్థితులు ఎటువైపునకు దారితీస్తాయోనన్న అంశంపై కూడా అధికారులు దృష్టి సారించారు. ఈ పరిస్థితుల్లో నోటీసు గడువు తేది 28తో ముగియనున్నది. అయితే ఏ ఒక్క కమిటీ కూడా ఏర్పాటు చేసిన విగ్రహాన్ని స్వచ్ఛందంగా తొలగించేందుకు ముందుకు వచ్చే పరిస్థితి కనిపించడంలేదు. కమిషనర్‌ నోటీసులో హెచ్చరించిన విధంగా అనధికార విగ్రహాలపై చర్యలు తీసుకుంటారా లేదా అన్న విషయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 

విగ్రహంపై రాజకీయం..

జిల్లాకేంద్రంలోని పల్నాడు రోడ్డులో ఎక్కువగా అనధికార విగ్రహాలు ఉన్నాయి. పట్టణంలో మొత్తం 32 విగ్రహాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ రోడ్డులో ట్రాఫిక్‌ సిగ్నల్స్‌, ట్రాఫిక్‌ పోస్టును అనుమతులు లేకుండానే అధికార పార్టీ నేతలు తొలగించి వైఎస్‌ఆర్‌ విగ్రహం ఏర్పాటు చేశారు. దీంతో ఈ విగ్రహం ఏర్పాటుపై చర్యలు తీసుకోవాలని టీడీపీ నేత హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్‌పై స్పందించిన హైకోర్టు సదరు విగ్రహంపై చర్యలకు కలెక్టర్‌, మున్సిపల్‌ పరిపాలన కార్యదర్శిని ఆదేశిస్తూ గత నెల 30న ఉత్తర్వులను జారీ చేసింది. ఈ ఉత్తర్వుల అమలుపై 24 రోజులు గడిచినా సదరు అధికారులు చర్యలు తీసుకోవడంలో కాలయాపన చేస్తున్నారు. ఒక్క వైఎస్‌ విగ్రహం తొలగిస్తే ఊరుకోబోమని అనధికార విగ్రహాలన్నింటిని తొలగించాలని అధికార పార్టీ నేతలు హెచ్చరించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఒక్క విగ్రహం తొలగిస్తే పరిస్థితులు ఎటువైపు దారితీస్తాయోనన్న అభిప్రాయానికి వచ్చిన యంత్రాంగం ఇటీవల అఖిలపక్షం సమావేశం నిర్వహించి అనధికార విగ్రహాల అంశంపై చర్చించారు. వీటి తొలగింపులో కూడా రాజకీయ కోణం కూడా ఉందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.


Read more