వ్యవసాయ యంత్రంలో చిక్కుకుని రైతు మృతి

ABN , First Publish Date - 2022-05-24T06:05:49+05:30 IST

వ్యవసాయ యంత్రంలో చిక్కుకుని రైతు మృతిచెందిన ఘటన మండలం రెంటపాళ్ల సమీపంలోని పొలాల్లో సోమవారం జరిగింది.

వ్యవసాయ యంత్రంలో చిక్కుకుని రైతు మృతి

సత్తెనపల్లిరూరల్‌, మే23: వ్యవసాయ యంత్రంలో చిక్కుకుని రైతు మృతిచెందిన ఘటన మండలం రెంటపాళ్ల సమీపంలోని పొలాల్లో సోమవారం జరిగింది. రూరల్‌ పోలీసుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన కందుల శ్రీనివాసరావు(52) కౌలుకు తీసుకున్న పొలంలో మిర్చి మొక్కలను తొలగించేందుకు ట్రాక్టర్‌కు రోటావేటర్‌ను బిగించుకొని వెళ్లాడు. నేల కొంత దున్నిన సమయంలో ట్రాక్టర్‌ టాప్‌లింక్‌ ఊడిపోగా దానిని బిగించేందుకు కిందికి దిగాడు. లింకు బిగించే సమయంలో శ్రీనివాసరావు ధరించిన లుంగీ యంత్రంలో పడింది. అప్పటికే యంత్రం తిరుగుతూ ఉండడంతో అందులో చిక్కుకుని తల, చేయి నుజ్జునుజ్జయి అక్కడికక్కడే మృతిచెందాడు.  రూరల్‌ పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం సత్తైనపల్లి ఏరియా వైద్యశాలకు తరలించారు. మృతుడికి భార్య శివమ్మతోపాటు ముగ్గురు పిల్లలు ఉన్నారు. శివమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు  చేసినట్లు రూరల్‌ ఎస్‌ఐ ఆవుల బాలకృష్ణ తెలిపారు.  

Read more