అమరావతి సహా వ్యవస్థలన్నీ నిర్వీర్యం

ABN , First Publish Date - 2022-02-16T05:30:00+05:30 IST

రాజకీయ, వ్యక్తిగత ప్రయోజనాల కోసం అమరావతితో పాటు రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను పాలకులు నిర్వీర్యం చేశారని రాజధాని రైతులు తెలిపారు.

అమరావతి సహా వ్యవస్థలన్నీ నిర్వీర్యం
హోమం వద్ద అమరావతి రాజధాని కొనసాగాలని వేడుకుంటున్న మహిళలు

792వ రోజు ఆందోళనల్లో రాజధాని రైతులు 


తుళ్లూరు, ఫిబ్రవరి 16: రాజకీయ, వ్యక్తిగత ప్రయోజనాల కోసం అమరావతితో పాటు రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను పాలకులు నిర్వీర్యం చేశారని రాజధాని రైతులు తెలిపారు. రాష్ట్ర ఏకైక రాజధానిగా  అమరావతి అభివృద్ధి కొనసాగాలని చేస్తోన్న ఆందోళనలు బుధవారంతో 792వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా ధర్నా శిబిరాల నుంచి మహిళలు, రైతు కూలీలు, రైతులు మాట్లాడుతూ దుర్మార్గపు పాలనను ప్రజలు అంగీకరించరన్నారు. అమరావతి బాగుంటే ఐదు కోట్ల మంది బాగుపడేవారన్నారు. ఒక సారి రాజధాని నిర్ణయం జరిగి అక్కడి నుంచి పాలన జరుగుతుంటే చట్ట ప్రకారం మార్పునకు వీలు కాదన్నారు. అధికార మదంతో పాలకులు మూడు ముక్కలు చేస్తామని అంటున్నారన్నారు. రైతు శిబిరాలను జేఏసీ కన్వీనర్‌ పువ్వాడ సుధాకరరావు సందర్శించి ప్రసంగించారు.   రాజధాని గ్రామాల్లో అమరావతి వెలుగు కార్యక్రమం కొనసాగించారు.


హనుమాన్‌ చాలీసా పారాయణం

రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతి అభివృద్ధి చేయాలంటూ అనంతవరం శ్రీదేవీ భూదేవీ సమేత వేంకటేశ్వరస్వామి సన్నిధిలో రాజధాని పంచముఖ ఆంజనేయస్వామి భక్త బృందం ఆధ్వర్యంలో బుధవారం హనుమాన్‌చాలీసా పారాయణం, హోమం  జరిగింది. రాజధాని రైతులు, మహిళలు పెద్దసంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాజధానిగా అమరావతి అభివృద్ధి కొనసాగాలని సంవత్సరం క్రితం మాఘ పౌర్ణమినాడు ప్రారంభించిన హనుమాన్‌చాలీసా పారాయణం బుధవారంతో పూర్తి చేశారు. ఈ సందర్భంగా పూర్ణాహుతి హోమం నిర్వహించారు. రాష్ట్రానికి ఒకే రాజధానిగా అమరావతి కొనసాగాలని వెంకన్న స్వామిని రైతులు, మహిళలు వేడుకున్నారు. 

Read more