భారీగా వర్షం

ABN , First Publish Date - 2022-10-02T06:15:46+05:30 IST

పల్నాడు జిల్లాలోని పలు మండలాల్లో శనివారం భారీగా వర్షాలు పడ్డాయి. జిల్లాలోని 15 మండలాల్లో భారీ వర్షాలు కురిశాయి.

భారీగా వర్షం
ముత్తాయపాలెం వాగు వద్ద నిలిచిన రాకపోకలు

15 మండలాల్లో వానలు

పొంగిపొర్లిన వాగులు వంకలు

కొత్తపాలెంలో కూలిన పంచాయతీ భవనం

నెమలికల్లులో పిడుగుపాటుకు రైతు మృతి 

చిలకలూరిపేటలో అత్యధికంగా 10.65 సెంమీ వర్షం

నరసరావుపేట, అక్టోబరు 1: పల్నాడు జిల్లాలోని పలు మండలాల్లో శనివారం భారీగా వర్షాలు పడ్డాయి. జిల్లాలోని 15 మండలాల్లో భారీ వర్షాలు కురిశాయి. భారీ వర్షాలతో అనేక ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్లు చెరువులను తలపించాయి. పలు ప్రాంతాల్లో వాగులు పొంగి ప్రవహించడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. కొన్ని మండలాల్లో అయితే తెరపి ఇవ్వకుండా ఉదయం నుంచి సాయంత్రం వరకు వర్షం పడుతూనే ఉంది. యడ్లపాడు మండలంలో శుక్రవారం సాయంత్రం నుంచి ఎడతెరపి లేకుండా వర్షం పడింది. దీంతో మండలంలోని  కొత్తపాలెంలో శిథిలావస్థకు చేరిన పంచాయతీ భవనంలో కొంతభాగం శనివారం ఉదయం కుప్పకూలింది. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. రెంటచింతల మండలం పాలువాయి గ్రామ సమీపంలోని పిల్లి వాగు, పశర్లపాడులోని విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ వద్ద గల పిల్లివాగులు ఉధృతంగా ప్రవహించాయి. గోలి వాగు మహా ప్రళయంగా ప్రవహిస్తుంది. పెదకూరపాడు మండలంలో శుక్ర, శనివారాల్లో భారీ వర్షాలు కురిశాయి. పరస, కంభంపాడు, బలుసుపాడు గ్రామాల మధ్య ఉన్న లో లెవల్‌ చప్టాలపై వర్షపు నీరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ఆయా గ్రామాల మధ్య రాకపోకలు నిలిచి పోయాయి. ఆర్టీసీ బస్సులు కూడా తిరగలేదు.  అమరావతిలో శనివారం మధ్యాహ్నం కురిసిన వానతో లోతట్టుప్రాంతాలు జలమయమయ్యాయి. నరుకుళ్లపాడు గ్రామంలో ప్రధాన రహదారిపై వరద నీరు భారీగా చేరింది. అమరావతి మండల పరిధిలోని నెమలికల్లు గ్రామంలో పిడుగుపడి కళ్లం శివరావు(48) మృతి చెందాడు. ఇక అత్యధికంగా చిలకలూరిపేట మండలం కావూరు ప్రాంతంలో 10.65 సెంమీ వర్షపాతం నమోదైంది. చిలకలూరిపేట పట్టణంలో 7.97, బొప్పూడిలో 8.30, పెదకూరపాడు మండలం కాశిపాడులో 8.70, అమరావతి మండలం మల్లాదిలో 8.60, దాచేపల్లి మాదిపాడులో 7.90, రెంటచింతలలో 7.65, కారంపూడిలో 6.75, పిడుగురాళ్ల మండలం కరాలపాడులో 6.20, నకరికల్లు మండలం చాగల్లులో 5.65, పెదకూరపాడు మండలం కంభంపాడులో 5.35, సత్లెనపల్లి మండలం రెంటపాళ్లలో 5.30, నాదెండ్లలో 5, నూజెండ్ల మండలం మూలకలూరులో 5, గురజాల మండలం పులిపాడులో 4.55, మాడుగులలో 3.80, వెల్దుర్తి మండలం కేపుల్లారెడ్డిగూడెంలో 4.35,  వినుకొండ మండలం నాగులారంలో 3.80, బెల్లంకొండ మండలం పాపాయపాలెంలో 3.75, క్రోసూరు మండలం గరికపాడులో 3.7, బొల్లాపల్లి మండలం గట్టపల్లిలో 3.5, పిడుగురాళ్లలో 2.75 వర్షపాతం నమోదైంది.  నరసరావుపేట పట్టణం తదితర ప్రాంతాల్లో కూడా వర్షాలు కురిశాయి.  

Read more