రైల్‌ టిక్కెట్‌.. ఈ యాప్‌తో.. ఈజీ

ABN , First Publish Date - 2022-12-12T00:07:29+05:30 IST

రైల్వేస్టేషన్‌లో జనరల్‌/ ప్లాట్‌ఫాం టిక్కెట్ల కోసం క్యూలైన్లలో నిలబడకుండా... చిల్లర సమస్య లేకుండానే డిజిటల్‌ విధానంలో ఆయా టిక్కెట్లను సులభంగా తీసుకొనేందుకు యూటీఎస్‌ యాప్‌ని రైల్వేశాఖ తీసుకొచ్చింది.

రైల్‌ టిక్కెట్‌..  ఈ యాప్‌తో.. ఈజీ
యూటీఎస్‌ యాప్‌

గుంటూరు, డిసెంబరు11(ఆంధ్రజ్యోతి): రైల్వేస్టేషన్‌లో జనరల్‌/ ప్లాట్‌ఫాం టిక్కెట్ల కోసం క్యూలైన్లలో నిలబడకుండా... చిల్లర సమస్య లేకుండానే డిజిటల్‌ విధానంలో ఆయా టిక్కెట్లను సులభంగా తీసుకొనేందుకు యూటీఎస్‌ యాప్‌ని రైల్వేశాఖ తీసుకొచ్చింది. రైల్వే ప్రయాణీకులు పెద్దసంఖ్యలో స్మార్ట్‌ఫోన్లు వినియోగిస్తున్నప్పటికీ ఈ యాప్‌పై సరైన అవగాహన లేకపోవడంతో టిక్కెట్‌ కౌంటర్ల వద్దకే వెళుతున్నారు. దీని వలన కూలైన్‌ వద్ద ఎక్కువ సమయం పడుతోంది. అలానే తగిన చిల్లర లేకపోతే సమస్యలు ఉత్పన్నమౌతున్నాయి. అదే యూటీఎస్‌ యాప్‌ ద్వారా వివిధ పద్ధతుల్లో టిక్కెట్‌లు బుకింగ్‌ చేసుకొంటే స్టేషన్‌కి రాగానే నేరుగా ప్లాట్‌ఫాం మీదకు వెళ్లి రైలు ఎక్కేయొచ్చు. ఈ నేపథ్యంలో యూటీఎస్‌ యాప్‌ని ఎక్కువగా వినియోగించుకోవాలని గుంటూరు డివిజనల్‌ రైల్వే అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.

స్మార్ట్‌ఫోన్‌ ప్లేస్టోర్‌లో యూటీఎస్‌ యాప్‌ని ఇన్‌స్టాల్‌ చేసుకొన్న తర్వాత మొబైల్‌ నెంబరు, గుర్తింపుకార్డుతో సులభంగానే రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు. నగదు చెల్లింపుని యూపీఐ/నెట్‌బ్యాంకింగ్‌/డెబిట్‌కార్డుల ద్వారా చెల్లించొచ్చు. అదే ఆర్‌ వాలెట్‌లో నగదు నింపుకొంటే 3 శాతం బోనస్‌ కూడా జత కలుస్తుంది. ఒకవేళ ఇంటి వద్ద వీలుకాకపోతే నేరుగా రైల్వేస్టేషన్‌కి వెళ్లి అక్కడ క్యూఆర్‌ స్కానర్‌ని యూపీఐ యాప్‌ ద్వారా స్కానింగ్‌ చేసి కాగిత రహిత టిక్కెట్‌ బుకింగ్‌ చేసుకోవచ్చు. దీని వలన ఎంతో సమయం ఆదా అవుతుంది. క్యూలైన్‌లో నిలబడి రైలు ఉంటుందో, వెళ్లిపోతుందోనన్న భయపడాల్సిన పని ఉండదు.

ఒకవేళ టిక్కెట్‌ ప్రింట్‌అవుట్‌ కావాలనుకొంటే బుకింగ్‌ సమయంలోనే ప్రింట్‌అవుట్‌ ఆప్షన్‌ని ఎంపిక చేసుకోవాలి. ఇంటి వద్ద టిక్కెట్‌ బుకింగ్‌ చేసుకొని రైల్వేస్టేషన్‌ కౌంటర్‌కి వెళ్లి నెంబరు చెబితే బుకింగ్‌ క్లర్కులు పేపర్‌ టిక్కెట్‌ ఇస్తారు. లేకుంటే ఆటోమేటిక్‌ టిక్కెట్‌ వెండిండ్‌ మిషన్‌ వద్దకు వెళ్లి ఏ స్టేషన్‌కి వెళ్లబోయే వివరాలు, రైలు కేటిగిరి నమోదు చేస్తే క్యూఆర్‌ కోడ్‌ వస్తుంది. ఆ కోడ్‌ని యూపీఐ యాప్‌ల ద్వారా స్కాన్‌ చేసి నగదు డిజిటల్‌ రూపంలో చెల్లించగానే ఏటీవీఎం నుంచి టిక్కెట్‌ బయటికి వస్తుంది. డిజిటల్‌ విధానంలో ఎలాంటి వివరాలకైనా స్టేషన్‌లోని హెల్ప్‌డెస్కులను సంప్రదించ వచ్చని డివిజనల్‌ రైల్వే మేనేజర్‌ రామకృష్ణ సూచించారు. ఒక్క జనరల్‌, ప్లాట్‌ఫాం టిక్కెట్లే కాకుండా సీజన్‌ టిక్కెట్‌లు కూడా యూటీఎస్‌ యాప్‌ని వినియోగించి బుకింగ్‌ చేసుకోవచ్చని తెలిపారు.

Updated Date - 2022-12-12T00:07:32+05:30 IST