పూర్‌పాలన

ABN , First Publish Date - 2022-10-03T05:59:45+05:30 IST

జిల్లాలోని పురపాలక సంఘాల్లో పాలనపై ప్రజలు పెదవి విరుస్తున్నారు. పురపాలక సంఘాల్లో ఇంటింటా చెత్త సేకరణ, మురుగు కాల్వల్లో పూడికతీత, వీధుల్లో వ్యర్థాలు తొలగింపు, కంపోస్టు యార్డుల నిర్వాహణ అంశాలకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్నది.

పూర్‌పాలన
నరసరావుపేట పల్నాడు రోడ్టులోని వరదనీటి కాలువలో పేరుకు పోయిన వ్యర్థాలు

పురపాలనపై పెదవిరుపు

మున్సిపల్‌ సేవలపై అసంతృప్తి

చెత్త పన్ను చెల్లిస్తున్నా పారిశుధ్యం అంతంతే

సమస్యల పరిష్కారంలో అధికారుల తాత్సారం

జిల్లాలో మాచర్ల మున్సిపాల్టీకి మాత్రమే సింగిల్‌స్టార్‌


పారిశుధ్యం, తాగునీటి సరఫరా, ఫిర్యాదుల పరిష్కారం, ఇతర సేవలు సక్రమంగా అందడంలేదు.. ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు.. ఇదీ జిల్లాలోని మున్సిపాలిటీల్లో పాలనపై ప్రజల అభిప్రాయం. మున్సిపాలిటీల పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సేవలకు సంబంధించి మున్సిపాలిటీల వారీగా పని తీరుపై ఎప్పటికప్పుడు ప్రజాభిప్రాయాన్ని సేకరించి పురపాలకశాఖ పరిపాలన విభాగం రేటింగ్‌ ప్రకటిస్తున్నది. తాగునీరు, పారిశుధ్యం, ఫిర్యాదులు, పరిపాలన, ప్లాన్ల మంజూరు, పట్టణ పేదరిక నిర్మూలన, ప్రగతి పనుల నిర్వాహణ తదితరాలపై ప్రజల స్పందనను తెలుసుకుంటున్నది. ప్రజాభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకుని పరిపాలనా విభాగం మున్సిపాలిటీల వారీగా సమీక్ష నిర్వహిస్తున్నది. అయితే జిల్లాలో ఒక్క మాచర్ల మున్సిపాలిటీకి మాత్రమే సింగిల్‌స్టార్‌ రేటింగ్‌ వచ్చింది. మిగిలిన మున్సిపాలిటీల్లో సేవలు సక్రమంగా అందడంలేదని ప్రజలు తేల్చిచెప్పారు.

 


నరసరావుపేట, అక్టోబరు 2: జిల్లాలోని పురపాలక సంఘాల్లో పాలనపై ప్రజలు పెదవి విరుస్తున్నారు. పురపాలక సంఘాల్లో ఇంటింటా చెత్త సేకరణ, మురుగు కాల్వల్లో పూడికతీత, వీధుల్లో వ్యర్థాలు తొలగింపు, కంపోస్టు యార్డుల నిర్వాహణ అంశాలకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్నది. అయితే వాటిపై స్థానిక పాలకలు సక్రమంగా స్పందించడంలేదు. దీంతో ప్రజలు ఆయా అంశాల్లో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా పట్టణాల్లో పారిశుధ్య సమస్యలనే ప్రజలు ఎదుర్కొంటున్నారు. వ్యర్థాల తొలగింపు సక్రమంగా జరగడంలేదు. తాగునీటి సరఫరాలో సమస్యలు ఉంటున్నాయి. భవనాల ప్లాన్ల మంజూరులో నిర్లక్ష్యం తాండవిస్తున్నది. ప్రగతి పనులు వేగవంతంగా జరగడం లేదు. ప్రజలు తెలియజేసే సమస్యల పరిష్కారం అంతంత మాత్రంగానే ఉంది. పన్నులు వసూలు చేస్తున్న పురపాలకులు పారిశుధ్యం మెరుగుదల చేసి ప్రజారోగ్యాన్ని కాపాడాలని కోరుతున్నారు. మున్సిపాల్టీలలో పారిశుధ్యం నిర్వహణపై ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పాలన, ఇంజనీరింగ్‌, రెవెన్యూ విభాగాల పనితీరుపై కూడా అసంతృప్తి వ్యక్తమవుతున్నట్లు అభిప్రాయ సేకరణ ద్వారా తెలుస్తోంది. పారిశుధ్యం, ఇంజనీరింగ్‌ విభాగం, రెవెన్యూ, ప్రణాళికా విభాగం, మున్సిపల్‌ పరిపాలన అంశాలపై సేకరించిన ప్రజాభిప్రాయంలో మాచర్ల మున్సిపాలిటీకి సింగిల్‌స్టార్‌ రేటింగ్‌ లభించింది. జిల్లాలో ఇతర మున్సిపాల్టీలకు స్టార్‌ రేటింగ్‌లో స్థానం దక్కక పోవడం వాటి పనితీరును తెలియజేస్తుంది. 


నరసరావుపేటలో పన్ను వసూళ్లపైనే శ్రద్ధ

నరసరావుపేట మున్సిపాల్టీలో ఇంటింటా వ్యర్థాల సేకరణకు రోజుకు రూ.2 చొప్పున నెలకు రూ.60 పన్ను వసూలు చేస్తున్నారు. దీని ద్వారా మున్సిపాల్టీలకు భారీగా ఆదాయం లభిస్తున్నది. అయినా ప్రజాభిప్రాయ సేకరణలో పారిశుధ్యం మెరుగుదల కావడం లేదన్న అభిప్రాయమే వ్యక్తమైంది. పారిశుధ్యం మెరుగుదల కోసం ఏడాదికి దాదాపు రూ.16 కోట్లు ఖర్చు చేస్తున్నా ప్రయోజనం శూన్యమే. పన్నుల వసూళ్లపై చూపిస్తున్న శ్రద్ధ ప్రజారోగ్యం కాపాడటంపై లేదన్న ఆరోపణలున్నాయి. మొత్తంమీద నరసరావుపేట జిల్లా కేంద్రమైనా ఇక్కడ పారిశుధ్యం మెరుగుదల లేదన్న అభిప్రాయం ప్రజలు ఉంది. 


పలు అంశాల్లో వెనుకబాటే..

చిలకలూరిపేట మున్సిపాల్టీలో పారిశుధ్యం, రెవెన్యూ, పరిపాలన, వినుకొండ మున్సిపాల్టీలో పారిశుధ్యం. ప్రణాళికా విభాగం, మాచర్ల మున్సిపాల్టీలో పారిశుధ్యం, రెవెన్యూ అంశాల్లో వెనుకబడి ఉన్నాయని ప్రజాభిప్రాయంలో తేలింది. పిడుగురాళ్ల మున్సిపాల్టీలో పారిశుధ్యం, రెవెన్యూ, పరిపాలన, ప్రణాళికా విభాగం పనితీరుపై ప్రజలు పెదవి విరిచారు. సత్తెనపల్లి మున్సిపాల్టీలో పారిశుధ్యం, రెవెన్యూ విభాగాల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద జిల్లాలో అన్ని పురపాలక సంఘాల్లో పారిశుధ్యం మెరుగుదల చేయడంలో పాలకులు ఘోరంగా విఫలమయ్యారని జనాభిప్రాయం ద్వారా తెలుస్తోంది. కురుస్తున్న వర్షాలకు పట్టణాలు చిత్తడి చిత్తడిగా మారాయి. మురుగునీరు పారుదల అంతంతమాత్రంగానే ఉంది. ప్రధాన మురుగుకాల్వల్లో పూడిక తీత చేపట్టడంలేదు. వర్షాలు కురుస్తుండటంతో దోమల వ్యాప్తి అధికంగా ఉంది. దోమల నివారణకు కనీస చర్యలు చేపట్టకపోతుండటం విమర్శలకు దారితీస్తున్నది. దోమకాటుకు గురై పట్టణాల్లో పౌరులు జ్వరాల బారిన పడుతున్నారు. దోమలను అరికట్టేందుకు మొక్కుబడిగా కూడా ఫాగింగ్‌ జరగడంలేదు.  రోడ్లపై నీరు నిల్వకుండా చర్యలు తీసుకుంటున్న దాఖలాలు లేవు. పాలకులు దోమల నివారణకు చర్యలు చేపట్టాలని, పారిశుధ్యం మెరుగుపరచాలని, కాల్వల్లో పూడిక తీత నిర్వహించాలని ప్రజలు కోరుతున్నారు.


ప్రజాభిప్రాయ సేకరణ ఇలా..

పారిశుధ్యం మెరుగు పడిందా?, వ్యర్థాల తొలగింపు జరుగుతుందా?, ఇంటింట చెత్త సేకరణ చేస్తున్నారా? అని మున్సిపాలిటీల వారీగా ప్రజల నుంచి అభిప్రాయాలను పురపాలకశాఖ పరిపాలన విభాగం సేకరిస్తుంది. అదేవిధంగా తాగునీటి సరఫరా, ప్రగతి పనుల నిర్వాహణ, ప్లాన్ల మంజూరుపై కూడా అభిప్రాయాలను సేకరిస్తుంది. ఆయా అంశాలపై ప్రజలు నుంచి వచ్చిన అభిప్రాయాలను క్రోఢీకరించి మున్సిపాలిటీల వారీగా వాటి పని తీరును అంచనా వేస్తారు. 

 

Read more