పంచాయతీల్లో.. చీకట్‌లు

ABN , First Publish Date - 2022-08-17T06:44:01+05:30 IST

విద్యుత్‌శాఖకు పంచాయతీల బకాయిలు గుదిబండగా మారాయి. పంచాయతీలకు వస్తున్న నిధులను ఎప్పటిప్పుడు ప్రభుత్వం లాగేసుకుంటుండటంతో కనీసం విద్యుత్‌ బిల్లులు సైతం చెల్లించలేని దుస్థితిలో కునారిల్లుతున్నాయి.

పంచాయతీల్లో..  చీకట్‌లు
అధిక విద్యుత్‌ బకాయి పేరుకుపోయిన ఈపూరు మండలం ముప్పాళ్ల గ్రామ సచివాలయం

ఉమ్మడి జిల్లావ్యాప్తంగా రూ.194 కోట్ల విద్యుత్‌ బకాయిలు 

కట్టాల్సిందేనంటున్న విద్యుత్‌ శాఖ

తమ ఖజానాలో డబ్బుల్లేవంటున్న  పాలకవర్గాలు

ఉన్నదంతా ప్రభుత్వమే ఊడ్చేసిందంటూ ఆవేదన

చెల్లించపోతే సర్‌చార్జి పేరుతో అదనపు బాదుడు

 పలు పంచాయతీలకు పవర్‌ కట్‌

 వీధి దీపాలూ వెలగట్లేదు..

  

పంచాయతీల నుంచి బకాయిలు వసూలు చేసుకునేందుకు విద్యుత్‌ శాఖ తంటాలు పడుతోంది... ప్రభుత్వమే పంచాయతీల ఖజానా ఖాళీ చేయడంతో తామెక్కడి నుంచి తెచ్చి కడతామంటూ పంచాయతీ పాలకవర్గాలు చేతులెత్తేశాయి. ఫలితంగా గ్రామాల్లో చీకట్లు అలముకుంటున్నాయి. గ్రామ స్వరాజ్యానికి పెద్దపీట వేస్తున్నామంటూ ఊదరగొట్టే ప్రభుత్వం పంచాయతీల్లో నిధులు లేకుండా చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్న నిధులను కూడా ఊడ్చేస్తోంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పంచాయతీలు రూ.194 కోట్లలో బకాయిలున్నట్లు విద్యుత్‌శాఖ గణంకాలు తెలియజేస్తున్నాయి. బిల్లులు చెల్లించని కారణంగా ప్రభుత్వమే సర్‌చార్జీ పేరుతో అదనపు భారాన్ని మోపుతోంది. జిల్లాలో ఇప్పటికే  పలు పంచాయతీ కార్యాలయాలకు నోటీసులు జారీచేసిన అధికారులు అత్యవసర సర్వీసులు మినహా ఇతర సర్వీసులకు విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తున్నారు.


   

నరసరావుపేట, ఆగస్టు16(ఆంధ్రజ్యోతి): విద్యుత్‌శాఖకు పంచాయతీల బకాయిలు గుదిబండగా మారాయి. పంచాయతీలకు వస్తున్న నిధులను ఎప్పటిప్పుడు ప్రభుత్వం లాగేసుకుంటుండటంతో కనీసం విద్యుత్‌ బిల్లులు సైతం చెల్లించలేని దుస్థితిలో కునారిల్లుతున్నాయి. మరోవైపు అసలే నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న విద్యుత్‌ పంపిణీ డిస్కంలు ప్రభుత్వపరమైన బకాయిల వసూళ్లపై దృష్టి సారించించాయి. ప్రస్తుతం గుంటూరు జిల్లాలోని గుంటూరు, సీఆర్‌డీయే ఆపరేషన్‌ సర్కిల్స్‌లో పంచాయతీలకు సంబంధించి రూ.కోట్లలో బకాయిలు పేరుకుపోయాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రూ.194 కోట్లలో బకాయిలున్నట్లు విద్యుత్‌శాఖ గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఇందులో సీఆర్డీయే సర్కిల్‌లో రూ.40 కోట్లు ఉండగా గుంటూరు సర్కిల్‌లో రూ.154 కోట్లు ఉన్నట్లు ఆ శాఖ వర్గాలు తెలిపాయి. ఇందులో వాస్తవానికి సీఆర్డీయే సర్కిల్‌ పరిధిలో రూ.18 కోట్లు విద్యుత్‌ వినియోగానికి సంబంధించిన బిల్లు ఉండగా ఆలస్యం చెల్లింపుపై సర్‌ఛార్జ్‌ పేరుతో అదనంగా మరో రూ.13 కోట్లు విధించారు. దాంతో మొత్తంలో రూ.40 కోట్లకు చేరింది. ఇక గుంటూరు సర్కిల్‌ పరిధిలో విద్యుత్‌ బిల్లు రూ.130 కోట్లు ఉండగా ఆలస్యం చెల్లింపుపై సర్‌ఛార్జ్‌ పేరుతో అదనంగా మరో రూ.60 కోట్లు విధించటంతో బకాయిలు మొత్తం రూ.190 కోట్లకు పైన చేరింది. ఇందులో గ్రామాల్లో వీధి దీపాలు, వాటర్‌వర్క్స్‌, పంచాయతీ కార్యాలయాల వినియోగానికి సంబంధించిన బిల్లులు పేరుకుపోయినట్లు చెబుతున్నాయి. జిల్లాలో ఇప్పటికే పంచాయతీ కార్యాలయాలకు నోటీసులు జారీచేసిన అధికారులు అత్యవసర సర్వీసులు మినహా ఇతర సర్వీసులకు విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తున్నారు. బిల్లులు చెల్లించలేదంటూ కొన్నిరోజుల కిందట మేడికొండూరులో విద్యుత్‌కట్‌ చేశారు. సర్పంచ్‌ పి.నాగమణి ఆందోళనతో రెండురోజుల తరువాత కనెక్షన్‌ ఇచ్చారు. మేడికొండూరు, అమర్తలూరు, ప్రత్తిపాడు తదితర ప్రాంతాలలో విద్యుత్‌ను కట్‌ చేశారు. 

 - నరసరావుపేట నియోజకవర్గంలో పంచాయతీల విద్యుత్‌ బిల్లుల బకాయిలు పేరుకుపపోయాయి. రూ.88.41 లక్షల విద్యుత్‌ బిల్లులు పంచాయతీలు చెల్లించాల్సి ఉంది. రొంపిచర్ల మండలంలోని అన్నవరం పంచాయతీ రూ.ఏడు లక్షల వరకు బిల్లు బకాయి ఉందని విద్యుత్‌శాఖ అధికారులు తెలిపారు. నరసరావుపేట మండలంలోని పంచాయతీలకు సంబంధించి 107 సర్వీస్‌ కనెక్షలకు రూ.77.86 లక్షలు విద్యుత్‌ బకాయిలు ఉన్నాయి. రొంపిచర్ల మండలంలోని పంచాయతీలకు సంబంధించి 40 కనెక్షన్‌లకు రూ.10.95 లక్షల బకాయి ఉన్నట్టు విద్యుత్‌ శాఖ అధికారులు తెలిపారు. 

-

- పిడుగురాళ్ల రూరల్‌ పరిధిలోని 14 గ్రామ పంచాయతీలలో వీధిలైట్లు, నీటి సరఫరా విభాగం కింద రెండున్నర కోట్లకు పైగా బకాయిలు పేరుకు పోయాయి. అత్యధికంగా జానపాడు, గుత్తికొండ, కరాలపాడు, బ్రాహ్మణపల్లి గ్రామాల్లో ఒక్కోదానికి రూ.5లక్షలపైనే విద్యుత్‌ బిల్లులున్నాయి. న్యూ వెల్లంపల్లి గ్రామంలో విద్యుత్‌ బకాయిలు ఉన్నందున కరెంట్‌ కట్‌ చేశారు. అధికారుల విజ్ఞప్తితో మరలా పునరుద్ధరించారు. దాచేపల్లి మండలంలో రూ.3,88,40,000 తంగెడలో రూ.1.90కోట్లు, గామాలపాడులో రూ.62లక్షలు, పెదగార్లపాడులో రూ.37లక్షలు, శ్రీనగర్‌లో రూ.55లక్షలకు పైగా విద్యుత్‌ బకాయిలున్నాయి. మాచవరం మండలంలో గోవిందాపురంలో రూ.62 లక్షలకు పైగా, పిన్నెల్లిలో రూ.53లక్షలు, రుక్మిణీపురం, మోర్జంపాడులో రూ.49లక్షలు, వేమవరంలో రూ.34లక్షలు, మాచవరంలో రూ.38లక్షలు గురజాల మండలంలోని రూరల్‌ గ్రామాలన్నింటిలో కలిపి రూ.2.70కోట్లకుపైగా విద్యుత్‌ బకాయిలు పేరుకుపోయి ఉన్నాయి. గత నెలలో విద్యుత్‌ బకాయిలు చెల్లించలేదని పిన్నెల్లి, మల్లవోలు, తురకపాలెంతోపాటు మరో రెండు పంచాయితీలకు విద్యుత్‌ సరఫరాను నిలిపివేశారు.

 

ఫ సత్తెనపల్లి మండలంలో 30 గ్రామ పంచాయితీలకు  రూ.54,19,034 విద్యుత్‌ బకాయిలు ఉన్నాయి. ధూళ్లిపాళ్ల, కంటెపూడి, రెంటపాళ్ల గ్రామాల బకాయిలు ఎక్కువగా ఉన్నాయి. ముప్పాళ్ల మండలంలో 12 గ్రామ పంచాయితీలకు రూ.24,36,580 బకాయిలున్నాయి. నకరికల్లు మండలంలో మొత్తం రూ.50లక్షల వరకు విద్యుత్‌ బకాయిలు ఉన్నాయి. రాజుపాలెం మండలంలో 17 గ్రామ పంచాయితీలకు రూ.37,42,602ల విద్యుత్‌ బకాయిలు ఉన్నాయి. రాజుపాలెం గ్రామ పంచాయితీ రూ.8,63,299 బకాయి ఉంది. 


ఫ వినుకొండ నియోజకవర్గం ఈపూరు మండలంలో ముప్పాళ్ల గ్రామసచివాలయానికి రూ.14లక్షల విద్యుత్‌ బకాయిలు, ఈపూరుకు రూ.9లక్షలు, బొల్లాపల్లి మండలం రావులాపురంకు రూ.7లక్షలు, నూజెండ్ల మండలం పాత ఉప్పలపాడు రూ.8లక్షలు, వినుకొండ మండలం చీకటీగలపాలెం రూ.8.18లక్షలు, గంగిరెద్దుల ఉప్పరపాలెం రూ.3.65లక్షలు బకాయిలు ఉన్నాయి.  

 - అమరావతి మండలంలోని 20 గ్రామ పంచాయతీల్లో రూ.13 కోట్లు విద్యుత్‌ బకాయిలు ఉన్నాయి. పెదకూరపాడు మండలంలోని 20 గ్రామ పంచాయతీల్లో రూ.1.13 కోట్లు, క్రోసూరు మండలంలో 18 పంచాయతీల్లో రూ.కోటి, అచ్చంపేట మండలంలో రూ.కోటికి పైగా, బెల్లంకొండ మండలంలో రూ.8 లక్షలు విద్యత్‌ బకాయిలు పెండింగ్‌లో ఉన్నట్టు అధికారులు వివరించారు. 


- చిలకలూరిపేట నియోజకవర్గం నాదెండ్ల మండలంలో మొత్తం 15 గ్రామ పంచాయతీలుగా ఉండగా రూ.1.82 కోట్లు బకాయిలు ఉన్నాయి. అత్యధికంగా నాదెండ్ల పంచాయతీ 98.08 లక్షలు, గణపవరం 44.43 లక్షలు చెల్లించాల్సి ఉంది. యడ్లపాడు మండలంలో 18 గ్రామ పంచాయతీలు ఉండగా రూ.2.34 కోట్లు విద్యుత్‌ బకాయిలు ఉన్నాయి. వీటిలో అత్యధికంగా రూ.77.02 లక్షలు ఉన్నవ పంచాయతీ, తిమ్మాపురం పంచాయతీ రూ.42.56 లక్షలు, లింగారావుపాలెం రూ.32.88 లక్షలు, యడ్లపాడు రూ.20.07 లక్షలు బకాయి చెల్లించాల్సి ఉంది. అదే విధంగా జూన్‌ నెల నాటికి చిలకలూరిపేట మండలంలో రూ.2.12 లక్షలు బకాయిలు ఉన్నాయి. వీటిలో అత్యధికంగా 44.59 లక్షల విద్యుత్‌ బకాయిలను నాగభైరువపాలెం పంచాయతీ చెల్లించాల్సి ఉంది. 

 

స్పందించకుంటే సరఫరా నిలిపివేస్తున్నాం..

జిల్లాలో బకాయిలున్న పంచాయతీలతో పాటు ప్రభుత్వ కార్యాలయాలకు ఇప్పటికే నోటీసులు అందజేశాం. నోటీసులకు స్పందించని పంచాయతీలకు కూడా విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తున్నాం. మరో వారంలో నిధులు వస్తే చెల్లిస్తామని, సరఫరా నిలిపివేయవద్దని కొన్ని పంచాయతీల నుంచి వినతులు వస్తున్నాయి. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తున్నాం. 

- మురళీకృష్ణయాదవ్‌, గుంటూరు సర్కిల్‌ ఆపరేషన్‌ ఎస్‌ఈ 

  

తాగునీటికే వాడుతున్నాం..

మా పంచాయతీలో పాతబకాయిలున్నాయని ఇప్పటివరకు ఆర్థిక సంఘం, సర్‌ఛార్జ్‌ నిధులు రూ.74 లక్షలు జమచేసుకొన్నారు. ఇంకా రూ.14 లక్షలు పెండింగ్‌లో ఉన్నాయి. బకాయి పూర్తిగా జమకాలేదని ఇ టీవల రెండురోజులు విద్యుత్‌ తొలగించారు. ఆందోళన చేయటంతో పదిరోజుల్లో మిగిలిన డబ్బు చెల్లిస్తామని లేఖ తీసుకొన్నారు. ఇప్పుడు తాగునీటికే విద్యుత్‌ను ఉపయోగిస్తున్నాం. బకాయిలను దృష్టిలో పెట్టుకొని వీధి లైట్లు వేయటంలేదు.

 - పి.నాగమణి, మేడికొండూరు, సర్పంచ్‌ 


  

  


Read more