ఆకలేస్తే.. ఆర్డర్‌

ABN , First Publish Date - 2022-06-12T05:13:36+05:30 IST

ఫుడ్‌ డెలివరీలు రికార్డు స్థాయిలో జరుగుతున్నాయి... కొవిడ్‌ కారణంగా గత రెండు సంవత్సరాలుగా నిలిచిపోయిన డెలివరీలు ఈ ఏడాది ప్రదమార్ధం ముగియకముందే రికార్డులను నమో దు చేస్తున్నాయి.

ఆకలేస్తే.. ఆర్డర్‌

దేశంలో రూ.1,400 కోట్ల చేరువైన ఫుడ్‌ ఆర్డర్లు

మే చివరినాటికి రికార్డు స్థాయిలో డెలివరీలు

దాదాపు 40శాతం మంది చూపు ఆన్‌లైన్‌ ఫుడ్‌ వైపే

గిగ్‌ ఉద్యోగాలపై యువతలో పెరుగుతున్న ఆసక్తి

సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడి


కూర్చున్న చోటకే ఇష్టమైన ఆహారం తీసుకువస్తే ఎవరికి మాత్రం ఇష్టం ఉండదూ... ఆర్డరు చేసిన నిమిషాల్లోనే ఫుడ్‌ కళ్ల ముందు కనిపిస్తే కావాల్సింది ఏముంది..? అందుకేనేమో ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరి సంస్థల కార్యకలాపాలు మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లుతున్నాయి. అంతేకాకుండా ఆహారాన్ని తయారుచేసే హోటళ్లు, వాటిని వినియోగదారునికి చేర్చే డెలివరీ బాయ్స్‌, ఇలా సరికొత్త వ్యవస్థను రూపొందించింది. ప్రతి రెస్టారెంట్‌లో తయారయ్యే ఆహారంలో దాదాపు 40శాతం మేర ఆర్డర్లు రూపంలోనే వెళ్తుందంటే ప్రస్తుతం వీటి పట్ల ప్రజలు ఎంత మక్కువ చూపుతున్నారో అర్ధం చేసుకోవాలి.

  

ఆ  కారణాలవల్లేనా..?

రేటింగ్‌ల కోసం నాణ్యమైన ఆహారం అందించడం, సేవా పన్నుల వంటి భారాలు లేకపోవడం, సమయం ఆదా, అందుబాటులో ఎక్కువ రకాల ఆహార పదార్ధాలు, మనకిష్టమైన రెస్టారెంట్‌ ఆహారాన్ని మన ఇంటి వద్దే తినడం, ఇలాంటి కారణాలతోనే ఫుడ్‌ డెలివరీలకు గిరాకీ పెరిగింది అని స్టాటిస్టితా నిర్ధారించింది. 


- భారతదేశంలో 40శాతం మంది ఆహారం కోసం ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ యాప్‌లపైనే ఆధారపడుతున్నారు. అంతేగాక 25-34 మధ్య వయస్సు కలిగిన వారు సరాసరిన రోజు ఒక ఆర్డరు తప్పనిసరిగా చేస్తున్నారు.


 నరసరావుపేట, జూన్‌11: ఫుడ్‌ డెలివరీలు రికార్డు స్థాయిలో జరుగుతున్నాయి... కొవిడ్‌ కారణంగా గత రెండు సంవత్సరాలుగా నిలిచిపోయిన డెలివరీలు ఈ ఏడాది ప్రదమార్ధం ముగియకముందే రికార్డులను నమో దు చేస్తున్నాయి. గతంలో మధ్యాహ్నం, రాత్రి సమ యంలో భోజనవేళల్లో మాత్రమే ఆర్డర్లు చేసేవారు. ప్రస్తు తం ఉదయం టిఫిన్‌, సాయంత్రం స్నాక్స్‌ ఇలా ప్రతిదీ ఆన్‌లైన్‌ ద్వారానే ఆర్డరు చేస్తున్నారు. దీంతో ఈ ఏడాది చివరినాటికి నిర్ధేశించుకున్న లక్ష్యాలను ఫుడ్‌ డెలివరీ సంస్థలు మే నెలకే అందుకున్నాయి. ఇదే విషయాన్ని స్టాటిస్టితా తన గణాంకాలు ద్వారా జూన్‌ 2న వెల్లడించింది. 


గణాంకాలు ఏం చెబుతున్నాయంటే..

భారతదేశంతో పాటు, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఫుడ్‌ ఆర్డర్లపై స్టాటిస్టితా అనే సంస్థ 2022 జూన్‌ మొదటివారంలో ఓ నివేదికను వెల్లడించింది. నివేదికలో అంశాల ప్రకారం ఈ ఏడాది మే చివరి నాటికి భారతదేశంలో రూ.1,400 కోట్ల విలువగల ఆర్డర్లు జరిగాయి. వాస్తవంగా ఈ లక్ష్యాలను 2023 చివరినాటికి సదరు సంస్థలు నిర్ధేశించుకోగా ఏడాదిన్నర ముందుగానే లక్ష్యాలను అందుకున్నాయి. అంతేగాక 2026 చివరినాటికి నిర్ధేశించుకున్న రూ.2,195 కోట్ల లక్ష్యాలను కూడా ఈ ఏడాది చివరినాటికి అందుకోవచ్చని పేర్కొంది.  


 గిగ్‌ ఉద్యోగాలపై ఆసక్తి 

పరిమిత కాలానికి కాంట్రాక్టు పద్ధతిపై స్వతంత్రంగా పనిచేసేవారిని గిగ్‌ ఉద్యోగులు అంటారు. ఉబర్‌, ఓలా, రైడ్‌ హైరింగ్‌ తోపాటు ఫుడ్‌ డెలివరీ బాయ్స్‌ చేసే కొలువులు దీని కిందకు వస్తాయి. మిగిలినవి పక్కన బెడితే ఫుడ్‌ డెలివరీ వైపు ప్రస్తుతం యువత ఆసక్తి చూపుతోంది. పాశ్చాత్య దేశాలలో ఏడాదికి లక్ష డాలర్లు వరకు సంపాదించే గిగ్‌ వర్కర్లు కూడా ఉన్నారు. గడిచిన రెండేళ్లలో మనదేశంలో ఫుడ్‌ డెలివరీ ఉద్యోగులు దాదాపు 12శాతం వరకు పెరిగారు.  సరిపడా ఉపాధి దొరకడం వల్ల ఎక్కువమంది దీనివైపు మొగ్గుచుపుతు న్నారు. ఇతర దేశాల్లో 18-24 మధ్య వయస్సు కలిగిన వారు ఎక్కువుగా డెలివరీ బా య్స్‌గా ఉంటారని, కానీ భారతదేశంలో అన్ని వయసుల వారు డెలివరీ బాయ్స్‌గా పనిచేయడానికి ముందుకు వస్తున్నారని స్విగ్గి  ఫుడ్‌ డెలివరీ సంస్థ తాజాగా వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న గిగ్‌ వర్కర్లులో 24శాతం మంది మనదే శానికి చెందినవారేనని ఇది ప్రపంచంలో రెండోస్థానంలో ఉందని, భారతదేశంలో యువ జనాభా అధికం కాబట్టి వీరి సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని ఎర్నెస్ట్‌ అండ్‌ యంగ్‌ అనే సంస్థ తన నివేదికలో వెల్లడించింది. 


కొత్త రుచుల కోసం..

చాలామంది ఆహార ప్రియులు హోటళ్లలో దొరికే వాటితోపాటు తమకిష్టమైన రుచులను, కాంబినేషన్లను అడుగుతున్నారు. ఉదాహరణకు కొంతమంది బిర్యానీ ప్రియులు తమ ఆర్డరు చేసుకున్న బిర్యానీ పరిమాణం తగ్గించి దాని బదులు పెరుగన్నం కాంబినేషన్‌ కావాలని అడుగుతున్నారు. ఇటువంటి కాంబినేషన్లు అనేకం కామెంట్ల బాక్సుల్లో పోస్టు చేస్తున్నారు. అలాగే పాం డిచ్చేరిలో మాదిరి టీ, కాఫీలు కూడా డెలివరీ చేస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. 


ఉపాధి దొరుకుతుంది..

ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ విధానం వచ్చిన తరువాత జిల్లాలో అనేకమందికి ఉపాధి దొరికింది. ఇది ఒక విధంగా మంచి పరిణామం. రానున్న రోజుల్లో ఇది మరింత విస్తరిస్తుంది  డెలివరీ బాయ్స్‌కు మెరుగైన వేతనాలు, ఉద్యోగ భద్రత, పదవీ విరమణ తరువాత వచ్చే ప్రయోజనాలు కూడా కల్పించాల్సిన అవసరం ఉంది. అప్పుడే ఈ వ్యవస్థ మరింత పటిష్టం అవుతుంది. అంతేగాక డెలివరీ బాయ్స్‌ కోసం అయా సంస్థలు కొంత సామాజిక భద్రత నిధిని కూడా ఏర్పాటు చేయాలి. 

 - కేఎస్‌ లక్ష్మణరావు, ఎమ్మెల్సీ  


 


========================================================================================================

Updated Date - 2022-06-12T05:13:36+05:30 IST