-
-
Home » Andhra Pradesh » Guntur » nrt legel-NGTS-AndhraPradesh
-
అపహరించి.. హతం
ABN , First Publish Date - 2022-04-24T05:43:56+05:30 IST
పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలో కిడ్నాప్‌నకు గురైన యువకుడు హత్యకు గురయ్యాడు.

కిడ్నాప్‌కు గురైన యువకుడి హత్య
నరసరావుపేటలో కలకలం
వైసీపీ నేత హస్తం ఉందంటూ బంధువుల ఆరోపణ
తెలుగుదేశం పార్టీ శ్రేణుల రాస్తారోకో
నరసరావుపేట లీగల్, ప్రత్తిపాడు, ఏప్రిల్23: పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలో కిడ్నాప్‌నకు గురైన యువకుడు హత్యకు గురయ్యాడు. ఈ ఘటన పట్టణంలో కలకలం రేపింది. మండలంలోని జొన్నలగడ్డకు చెందిన శిలివేరు రామాంజనేయులు(31) స్టేషన్ రోడ్డులోని పోలీసుస్టేషన్ సమీపం ఓ నగల దుకాణంలో పనిచేస్తుంటాడు. అతనిని శుక్రవారం ఐదుగురు వ్యక్తులు షోరూం నుంచి తీసుకెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న భార్య ప్రసన్నలక్ష్మి శనివారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేసింది. జంగం బాజి అనే వ్యక్తి కిడ్నాప్‌చేసి తీసుకు వెళుతున్న దృశ్యాలు సీసీ ఫుటేజీలో నమోదయ్యాయి.
ఈ క్రమంలో కిడ్నాప్‌కు గురైన రామాంజనేయులు మృతదేహం గోనెసంచిలో పత్తిపాడు మండలం తుమ్మలపాలెం బ్రిడ్జి కింద కనిపించింది. నరసరావుపేట డీఎస్పీ విజయభాస్కరరావు, సీఐ అశోక్‌కుమార్‌లతో పాటు ప్రత్తిపాడు సీఐ సుబ్బారావు, ఎస్ఐ ప్రతాప్‌కుమార్‌లు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు.
టీడీపీ శ్రేణుల ఆందోళన
హతుడి కుటుంబ సభ్యులు శనివారం జొన్నలగడ్డ వద్ద రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేశారు. ఈ హత్యలో వైసీపీ నేత అన్నవరపు కిషోర్ పాత్ర ఉందని, ఇతనిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. వీరి ఆందోళనకు నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి డాక్టర్ చదలవాడ అరవిందబాబు, పార్టీ శ్రేణులు మద్దతు ప్రకటించి రాస్తారోకోలో పాల్గొన్నారు. గుంటూరు, కర్నూలు రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపొయ్యాయి. ఆందోళన చేస్తున్న టీడీపీ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా నేతలు, పోలీసుల మద్య తోపులాట జరగడంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. బాజి తన భర్తను కిడ్నాపు చేశాడని తాను ఫిర్యాదు చేసినా పోలీసులు సకాలంలో స్పందించకపోవడం వలనే హత్య చేశారని భార్య ప్రసన్నలక్ష్మి ఆరోపించింది. కిషోర్‌ను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. డీఎస్పీ సి.విజయభాస్కరరావు ఘటనా స్థలికి వచ్చి బాధితులకు తగు న్యాయం చేస్తామని హామీ ఇచ్చి ఆందోళనను విరమింప చేశారు. డాక్టర్ చదలవాడ అరవింద బాబును రెండవ పట్టణ పోలీసు స్టేషన్‌కు తరలించి అనంతరం పోలీసులు విడుదల చేశారు.
పాత కక్షలతోనే..
పాతకక్షల నేపథ్యంలో హత్య జరిగి ఉండవచ్చని ఈ దిశగా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నామని వన్‌టౌన్ సీఐ అశోక్ కుమార్ తెలిపారు. గత ఏడాది అక్టోబరు నెలలో జంగం బాజీ తమ్ముడు చంటి కన్పించటం లేదంటూ నాదెండ్ల పోలీసుస్టేషన్లో కేసు నమోదైంది. ఈ కేసుకు రామాంజనేయులుకు సంబంధం ఉందనే అనుమానంతో బాజీ తన మిత్రులతో రామాంజనేయులును అపహరించి హతమార్చినట్టు ప్రాథమికంగా నిర్ధారించామన్నారు. త్వరలో నిందితులను అదుపులోకి తీసుకొని పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు.
ఎస్ఐ దురుసు ప్రవర్తన
బైఠాయింపు సమయంలో విధులు నిర్వహిస్తున్న మీడియా ప్రతినిధుల పట్ల మొదటి పట్టణ ఎస్ఐ కృష్ణారావు అసభ్య పదజాలంతో దూషించి దురుసుగా ప్రవర్తించాడు. దీంతో మీడియా ప్రతినిధులు ఆందోళనకు సిద్ధమయ్యారు. డీఎస్పీ విజయ భాస్కరరావు జోక్యం చేసుకొని ఎస్ఐ కృష్ణారావు చేత క్షమాపణ చెప్పించటంతో వివాదం సద్దుమణిగింది.