మన సొమ్ము కాదుగా

ABN , First Publish Date - 2022-06-08T05:19:39+05:30 IST

రూ.లక్షల విలువైన యంత్రాలు.. పరికరాలు.. ప్రజాధనంతో కొనుగోలు చేశారు.. ఉపయోగించకుండా వదిలేశారు.. కొన్ని మట్టిపాలవగా.. మరికొన్ని శిథిలమవుతున్నాయి. రూ.లక్షల వెచ్చించి కొనుగోలు చేసిన వాటిని సంరక్షించాల్సిన అధికారులు మనకెందుకులే.. మనవి కాదుగా.. మన సొమ్ముతో కొనలేదుగా.. అనే ధోరణిలో ఉన్నారు.

మన సొమ్ము కాదుగా
నరసరావుపేట ఎన్‌జీవో కాలనీలో రోడ్డుపై చెత్త సేకరణ బండి

లక్షల పరికరాలు మట్టిపాలు

సంరక్షణ లేక యంత్రాలు శిథిలం

నిర్లక్ష్యంగా ఆయా శాఖల అధికారులు

 

నరసరావుపేట, జూన్‌ 7: రూ.లక్షల విలువైన యంత్రాలు.. పరికరాలు.. ప్రజాధనంతో కొనుగోలు చేశారు.. ఉపయోగించకుండా వదిలేశారు.. కొన్ని మట్టిపాలవగా.. మరికొన్ని శిథిలమవుతున్నాయి. రూ.లక్షల వెచ్చించి కొనుగోలు చేసిన వాటిని సంరక్షించాల్సిన అధికారులు మనకెందుకులే.. మనవి కాదుగా.. మన సొమ్ముతో కొనలేదుగా.. అనే ధోరణిలో ఉన్నారు. వివిధ రకాల పరికరాలు, యంత్రాలు సంరక్షణలో ఆయా శాఖల అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. రోడ్ల పక్కన, కార్యాలయాల ప్రాంగణాల్లో లక్షలు విలువైన యంత్రాలను, పరికరాలను గాలికొదిలేశారు. దీంతో ప్రజాధనం మట్టి పాలవుతుంది. ముఖ్యంగా ఏపీ మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌, పురపాలక సంఘానికి సంబంధించిన యంత్ర పరికరాలను ఆయా శాఖల అధికారులు నిరూపయోగంగా వదిలేశారు. ప్రజా ధనాన్ని మట్టి పాలు చేయడంలో పురపాలక సంఘం, ఏపీ మినరల్‌ డవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ అధికారులు పోటీపడుతున్నారు.


ఇసుక యార్డు నిర్వహించకున్నా..

నరసరావుపేట మండలం ఇస్సపాలెం వద్ద ఏపీ మినరల్‌ డవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ గతంలో ఇసుక యార్డును నిర్వహించింది. విద్యుత్‌ కోసం సోలార్‌ ప్యానల్స్‌ ఏర్పాటు చేశారు. ఇసుక తూకం కోసం వే బ్రిడ్జిని ఏర్పాటు చేశారు. ఇసుక విధానంలో మార్పులతో యార్డు నిర్వహించే పరిస్థితి లేదు. ఈ క్రమంలో యార్డు మూసివేసి ఏడాదిన్నర అవుతున్నా కార్పొరేషన్‌కు సంబంధించిన వే బ్రిడ్జి, సోలార్‌ ప్యానల్స్‌ను యార్డు స్థలంలోనే వదిలేశారు. వీటికి రక్షణ లేక పోవడంతో ఇప్పటికే విద్యుత్‌ దీపాలు మాయమయ్యాయి. లక్షలు వెచ్చించి ఏర్పాటు చేసిన వీటిని సదరు అధికారులు నిర్లక్ష్యంగా వదిలేయడంతో అవి మట్టిపాలవుతున్నాయి. వీటిని తరలించేందుకు కార్పొరేషన్‌ చర్యలు తీసుకుంటున్న దాఖలాలు లేక పోవడంతో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.   


సేకరణ లేదు.. సంరక్షణ లేదు 

పట్టణంలో పారిశుధ్యం విధానంలో ప్రభుత్వం మార్పులు తీసుకొచ్చింది. మున్సిపాలిటీలో క్లాప్‌ విధానాన్ని అమలు చేస్తున్నది. దీంతో ఆటోల ద్వారా చెత్త సేకరణ జరుగుతున్నది. కొత్త పథకం అమల్లోకి వచ్చిన తర్వాత గతంలో కొనుగోలు చేసిన వాటిని రోడ్లపై వదిలేశారు. దీంతో గతంలో చెత్త సేకరణకు వినియోగించిన బండ్లు, డంపర్‌బిన్లు నిరుపయోగంగా మారాయి. లక్షలు వెచ్చించి కొనుగోలు చేసిన చెత్త సేకరణ బండ్లు, డంపర్‌ డస్ట్‌బిన్లను ఎక్కడపడితే అక్కడ రోడ్లపై వదిలేశారు. ఆయా పరికరాలను మున్సిపల్‌ కార్యాలయానికి తరలించకుండా వదిలేశారు. ఇవి మట్టిపాలవుతున్నా అధికారుల చోద్యం చూస్తున్నారు. ఎన్ని కొనుగోలు చేశారు.. ఎన్ని ఉన్నాయి అనే లెక్కలు కూడా మున్సిపాలిటీలో లేవంటే ప్రజాధనంపై ఎంతటి శ్రద్ధ ఉందో తెలుసుకోవచ్చు. ఇప్పటికే కొన్ని బండ్లు అపహరణకు గురయ్యాయన్న ఆరోపణలున్నాయి. క్లాప్‌ విధానం వచ్చినా పట్టణంలో పరిశుభ్రత కానరావడంలేదు.  

  


Updated Date - 2022-06-08T05:19:39+05:30 IST