చీకట్లో నంద్యాల ఆఫీసులు

ABN , First Publish Date - 2022-11-30T03:45:39+05:30 IST

నంద్యాల జిల్లాలో తెలుగుగంగ ప్రాజెక్టు (టీజీపీ) సర్కిల్‌ కార్యాలయం నాలుగు రోజులుగా కరెంటు లేక చీకట్లో మగ్గుతోంది.

చీకట్లో నంద్యాల ఆఫీసులు

బకాయిలు చెల్లించలేదనిటీజీపీ కార్యాలయాలకు కరెంట్‌ కట్‌

సెల్‌ఫోన్‌ టార్చ్‌లైట్‌ వెలుగులో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది

నంద్యాల, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): నంద్యాల జిల్లాలో తెలుగుగంగ ప్రాజెక్టు (టీజీపీ) సర్కిల్‌ కార్యాలయం నాలుగు రోజులుగా కరెంటు లేక చీకట్లో మగ్గుతోంది. మార్చి నుంచి బకాయిలు కట్టకపోవడంతో విద్యుత్‌శాఖ అధికారులు శనివారం నుంచి విద్యుత్‌ సరఫరా నిలిపివేశారు. దీంతో ఈ కార్యాలయంలో అంధకారం అలముకుంది. సంబంధిత శాఖ ఉద్యోగులు చీకట్లోనే విధులు నిర్వహిస్తున్నారు. సెల్‌ఫోన్లలో టార్చ్‌లైట్‌ ఆన్‌ చేసుకుని ఫైళ్లతో కుస్తీలు పడుతున్నారు. పేరుకే పెద్ద కార్యాలయమని, విద్యుత్‌ బకాయిలు కూడా చెల్లించే పరిస్థితి లేదంటే సిగ్గు చేటుగా ఉందని ఉద్యోగులు వాపోతున్నారు. ఎన్ని రోజులు ఇలా చీకట్లో పనులు చేయాలని అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని అన్ని ప్రాజెక్టు కార్యాలయాల్లో విద్యుత్‌ బకాయిలున్నట్లు సమాచారం. గతంలో జలమండలి కార్యాలయానికీ బకాయిలు ఉండడంతో విద్యుత్‌ సరఫరాను నిలిపివేశారు. నంద్యాలలోని తాలుకా కార్యాలయం మెయిన్‌ రోడ్‌ పక్కనే టీజీపీ సర్కిల్‌ కార్యాలయం ఉంది. ఇక్కడే మరో నాలుగు కార్యాలయాలు ఉన్నాయి. పక్కనే దీనికి సంబంధించిన గెస్ట్‌హౌస్‌ కూడా ఉంది. ప్రస్తుతం గెస్ట్‌హౌ్‌సలో జలవనరుల శాఖ కార్యాలయం ఉంది. ఈ కార్యాలయాలకు సంబంధించి మార్చి నుంచి విద్యుత్‌ బకాయిలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. తెలుగుగంగ ప్రాజెక్టు కార్యాలయానికి రూ.1.25 లక్షలు, గెస్ట్‌హౌస్‌కు దాదాపు రూ.80వేలు బకాయిలు ఉన్నాయి. మూడు వారాల కిత్రం అధికారులు విద్యుత్‌ సరఫరా నిలిపివేసేందుకు సిద్ధమయ్యారు. టీజీపీ అధికారులు కోరడంతో రెండు వారాల సమయమిచ్చారు. అయినా చెల్లించకపోవడంతో కరెంట్‌ సరఫరా నిలిపివేశారు.

Updated Date - 2022-11-30T03:45:40+05:30 IST