నాడు నేడు.. నిర్లక్ష్యం

ABN , First Publish Date - 2022-09-26T05:56:02+05:30 IST

నిధులు విడుదలలో నిర్లక్ష్యం.. పనుల్లో సాగదీతతో.. పాఠశాలల్లో నాడు నేడు పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఈ పథకం ద్వారా పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనలో తీవ్ర జాప్యం జరుగుతుంది.

నాడు నేడు.. నిర్లక్ష్యం
నరసరావుపేట మునిసిపల్‌ ఉన్నత పాఠశాలలో అదనపు తరగతి గదుల నిర్మాణ పనులు

రూ.298 కోట్లకు రూ.45 కోట్లే విడుదల

25.53 శాతం పురోగతితో 24వ స్థానంలో జిల్లా

నిధుల లేమితో నత్తనడకన సాగుతున్న పనులు

194 పాఠశాలల్లో ఒక్క పని కూడా చేపట్టని వైనం

పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనలో తీవ్వజాప్యం


నరసరావుపేట, సెప్టెంబరు 25: నిధులు విడుదలలో నిర్లక్ష్యం.. పనుల్లో సాగదీతతో.. పాఠశాలల్లో నాడు నేడు పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఈ పథకం ద్వారా పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనలో తీవ్ర జాప్యం జరుగుతుంది. పాఠశాలలు ప్రారంభమై రెండు నెలలు గడిచినా వసతులు కల్పించకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. పనుల నిర్వహణ సమీక్షలకే పరిమితం అవుతుందన్న విమర్శలు తల్లిదండ్రుల నుంచి వ్యక్తమవుతున్నాయి. నాడు నేడు పనులపై అధికారుల్లో చిత్తశుద్ధి కొరవడిందన్న ఆరోపణలు ఉన్నాయి. విద్యా సంవత్సరం ఆరంభం కల్లా పనులు పూర్తి చేయాలని ప్రభుత్వం ప్రకటించినా ఆచరణలో సాధ్యం కాలేదు. నాడు నేడు అమలులో జిల్లా 24వ స్థానంలో ఉందంటే పనులు ఎంత వేగంగా జరుగుతున్నాయో తెలుసుకోవచ్చు. జిల్లాలో రెండో విడతలో 946 పాఠశాలలను ఎంపిక చేశారు. ఇందుకు రూ.298 కోట్లు నిధులు కేటాయించారు. అయితే పనులు చేపట్టడంలో కాలయాపన జరుగుతోంది.  ఇప్పటి వరకు  752  పాఠశాలల్లో మాత్రమే పనులు చేపట్టారు. మిగిలిన 194 పాఠశాల్లో ఒక్క పని కూడా చేపట్టలేదని విద్యా శాఖ లెక్కలు తెలియజేస్తున్నాయి.     రూ298 కోట్లు నిధులు ప్రభుత్వం మంజూరు చేయగా కేవలం రూ.45 కోట్లను విడుదల చేసింది. ఐదు ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో నాడునేడు పథకంలో  మరుగుదొడ్ల నిర్మాణం, విద్యుత్‌, తాగునీటి వసతి, పర్నీచర్‌, మేజర్‌, మైనర్‌ మరమ్మతులు, అదనపు తరగతి గదులు, ప్రహరీల నిర్మాణం, గ్రీన్‌చాక్‌ బోర్డులు, ఇంగ్లీషు ల్యాబ్‌లు, భవనాలకు రంగులు తదితర పనులు చేపట్టాలి. 


6901 పనులకు పురోగతిలో 1762 

జిల్లాలో పాఠశాలల విలీనం అనంతరం 946 పాఠశాలలకు సంబంధించి పనుల సంఖ్య 6901గా నమోదు చేశారు. ఈ పనుల్లో 1762 పనులు పురోగతిలో ఉన్నట్లు సంబంధిత శాఖల నివేదికలు తెలియజేస్తున్నాయి. 5139 పనులు అసలు ప్రారంభమే కాలేదు. 285 అదనపు తరగతి గదులు నిర్మాణాన్ని చేపట్టారు. అయితే వీటిలో 128 పనులు పురోగతిలో ఉండగా శ్లాబ్‌ స్థాయిలో 8  ఉన్నాయి. 149 తరగతి గదులకు సంబంధించిన పనులను ఇంకా ప్రారంభించలేదు. పాఠశాలల విలీనంతో తరగతి గదులు చాలక విద్యార్థులు ఇక్కట్లు పడుతున్నారు. గదుల నిర్మాణ పనులను సాగదీస్తున్నారు. 542 పాఠశాలల్లో మరుగుదొడ్లను నిర్మించడం, ఉన్నవాటికి మరమత్తులు చేపట్టాలి. అనేక పాఠశాలల్లో మరుగుదొడ్ల వసతి సరిగా లేక విద్యార్థులు   ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీటి ఏర్పాటు తక్షణావసరం. అయినా పట్టించుకునే వారే లేరు. 126 చోట్ల మరుగుదొడ్లకు సంబంధించిన పనులు మాత్రమే పురోగతిలో ఉన్నాయి. మిగిలిన పాఠశాలల్లో ఈ పనులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. 75 పాఠశాలలకు ప్రహారిల నిర్మాణ పనులను మంజూరు చేశారు. వీటిలో 13 పాఠశాలల్లో ఫౌండేషన్‌ స్థాయిలో ఉన్నాయి. 13 పాఠశాలల్లో ఈ పనులు వివిధ దశల్లో ఉన్నాయి. 49 పాఠశాలల్లో వీటి ఊసే లేదు. నీటి సరఫరాకు సంబంధించి 558 పనులను చేపట్టాల్సి ఉంది. ఈ పనులకు అత్యధిక ప్రాధాన్యం కలిగినా వీటిపై నిర్లక్ష్యం తాండవిస్తున్నది. నీటి సరఫరా పనుల్లో ఇప్పటికి జిల్లా మొత్తం మీద ఒక్క పని మాత్రమే పూర్తి చేశారంటే నాడు నేడు పనులపై ఏపాటి శ్రద్ధ ఉందో అర్థం అవుతుంది. 186 పనులు వివిధ దశల్లో ఉన్నాయి.  విద్యుత్‌ సరఫరా కోసం 549 పనులు చేపట్టగా 190 పనులు పురోగతిలో ఉన్నాయి. మరమ్మత్తుల పనులు 550 చేపట్టాల్సి ఉంది. వీటిలో 256 పనులు పురోగతిలో ఉండగా రెండు పనులను మాత్రమే పూర్తి చేశారు. పనులను వేగవంతం చేయడంలో అధికారులు విఫలమయ్యారన్న విమర్శలున్నాయి. ప్రారంభంలో సిమెంట్‌ సమస్యలు తలెత్తినా ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.  




==========================================================================================================================


Updated Date - 2022-09-26T05:56:02+05:30 IST