జై.. నారసింహ

ABN , First Publish Date - 2022-03-19T04:38:25+05:30 IST

జై నారసింహ.. జైజై లక్ష్మీనారసింహ.. జై గోవిందా... జై నారాయణా అన్న భక్తజనుల నినాదాల మధ్య మంగళాద్రివాసుని మహారథోత్సవం సాగింది.

జై.. నారసింహ
శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ నృసింహస్వామివార్ల ఉత్సవమూర్తులు, రథోత్సవంలో భక్త జన ప్రవాహం

వైభవంగా నృసింహుని రథోత్సవం

జయజయధ్వానాల నడుమ నేత్రపర్వంగా..

ఘనంగా మంగళగిరి తిరునాళ్లోత్సవం

మంగళగిరి, మార్చి 18: జై నారసింహ.. జైజై లక్ష్మీనారసింహ.. జై గోవిందా... జై నారాయణా అన్న భక్తజనుల నినాదాల మధ్య మంగళాద్రివాసుని మహారథోత్సవం సాగింది. ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి సందర్భంగా శుక్రవారం మంగళాద్రి క్షేత్రంలో మంగళగిరి తిరునాళ్ల ఘనంగా జరిగింది.  మంగళాద్రివాసుని మహారథోత్సవం అశేష భక్త జనవాహిని జయజయధ్వానాల నడుమ నేత్రపర్వంగా సాగింది. మధ్యాహ్నం 3:35 గంటలకు ప్రారంభమైన రథోత్సవం సాయంత్రం 6:05 గంటలకు ముగిసింది. శ్రీవారి రథోత్సవాన్ని తిలకించేందుకు వచ్చిన భక్తజనులతో నగరవీధులు కిక్కిరిసిపోయాయి. రథోత్సవం ఆనవాయితీ ప్రకారం శాకున శాస్త్ర విధిని అనుసరించి నిర్వహించారు. ఆలయం నుంచి శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ఉత్సవ మూర్తుల విగ్రహాలను అర్చకస్వాములు తీన్‌మార్‌ వాయిద్యాల మధ్య తీసుకువచ్చి మహారథంపై అధిష్టింపజేశారు. ముందుగా రథయాజ్ఞీకులు దీని ప్రసాద్‌ ఆధ్వర్యంలో రథాంగ హోమం నిర్వహించి అన్నపురాశిని అష్టదిక్కులకు బలిహారణ చేశారు. అలాగే రథ అధిదేవతా ఆవాహనం గావించారు. అనంతరం రథయాజ్ఞీకులు రథారూఢులైన శ్రీదేవీ, భూదేవీ సమేత శ్రీ నృసింహస్వామివార్లకు హారతినిచ్చి అనుజ్ఞ ఇవ్వగా భక్తులు ఉత్తేజిత మనస్కులై జై నారసింహ అంటూ భక్తి పారవశ్యంతో మోకును లాగి రథాన్ని బయలుదేరతీశారు.   రథోత్సవంలో పలుచోట్ల భక్తులు   స్వామివార్లకు మొక్కుతూ రథచక్రాలకు భక్తిశ్రద్ధలతో టెంకాయలను కొట్టారు. 


Read more