విగ్రహాల తొలగింపులో వివక్ష

ABN , First Publish Date - 2022-11-08T00:42:40+05:30 IST

ఇప్పటం వివాదాన్ని పూర్తిగా పరిష్కరించడంలో అధికారులు ఇంకా నాన్చుడు ధోరణిని అవలంబిస్తున్నారు. కూల్చివేతల పర్వాన్ని పక్కన బెడితే తదనంతరం చోటుచేసుకున్న విగ్రహాల తొలగింపు కార్యక్రమంలో ప్రభుత్వం చిత్తశుద్ధినిచూపడానికి బదులు వివక్షతను ప్రదర్శించిందనే విమర్శలు వెల్లువెత్తాయి.

విగ్రహాల తొలగింపులో వివక్ష
ఇప్పటంలో ఇంకా తొలగించకుండా వదలివేసిన వైఎస్‌ఆర్‌ ప్రధాన విగ్రహం

ఇప్పటంలో వైఎస్సార్‌ విగ్రహం ఒకటి తొలగింపు

మంగళగిరి, నవంబరు7: ఇప్పటం వివాదాన్ని పూర్తిగా పరిష్కరించడంలో అధికారులు ఇంకా నాన్చుడు ధోరణిని అవలంబిస్తున్నారు. కూల్చివేతల పర్వాన్ని పక్కన బెడితే తదనంతరం చోటుచేసుకున్న విగ్రహాల తొలగింపు కార్యక్రమంలో ప్రభుత్వం చిత్తశుద్ధినిచూపడానికి బదులు వివక్షతను ప్రదర్శించిందనే విమర్శలు వెల్లువెత్తాయి. ఈ విమర్శల నేపథ్యంలో కూడా ప్రభుత్వం విగ్రహాల తరలింపులో జరిగిన తప్పిదాలను దిద్దే ప్రయత్నం చేయలేదు. గ్రామంలో ఇళ్ల కూల్చివేతతో పాటు గ్రామ రహదారి వెంబడివున్న మహాత్మాగాంధి, జవహర్‌లాల్‌ నెహ్రూ, ఇందిరాగాంధి, పీవీ నరసింహారావు ప్రభృతుల విగ్రహాలను అధికారులు తొలగించి గ్రామంలోని పాత పంచాయతీ కార్యాలయం ఆవరణలో వుంచారు. కానీ అదేరోడ్డు వెంబడి వున్న స్వర్గీయ వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహాలను మాత్రం కదిలించకుండా వాటికి పటిష్టమైన భద్రత ఏర్పాట్లను గావించి విమర్శల పాలయ్యారు. ఈ విమర్శలు రోజురోజుకు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో గ్రామంలోని వైసీపీ నాయకులు చొరవ తీసుకుని గ్రామంలో వున్న వైఎస్సార్‌ విగ్రహాలలో ఒకదానిని మాత్రం తొలగించి తమ నివాసాల మధ్య భద్రపరుచుకున్నారు.

కనీసం ఆటోలు సైతం రాని ఆరొందల గడప వున్న ఇప్పటం గ్రామంలో 120 అడుగుల రహదారి వేస్తామంటూ అధికారులు 53 నివాసాలకు నష్టం కల్పిస్తూ కూల్చివేశారు. ఈ అంశం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దుమారాన్ని రేపిన సంగతి తెలిసిందే. దీనికితోడు అధికారులు రోడ్ల వెంబడి వున్న మహాత్మా గాంధీ, జవహర్‌లాల్‌ నెహ్రూ, ఇందిరా గాంధీ, పీవీ నరసింహారావుల విగ్రహాలను తొలగించి గ్రామ సచివాలయం (పాత పంచాయతీ కార్యాలయం) ప్రాంగణంలో వుంచారు. ఇదే సందర్భంలో గ్రామంలో అదే రహదారిపై వున్న డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి విగ్రహాలు రెండింటి జోలికి వెళ్లలేదు. అధికారుల ఈ చర్య ప్రభుత్వంతోపాటు వైసీపీని కూడ తీవ్ర సంకటంలో పడేసింది. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఇప్పటం గ్రామాన్ని సందర్శించినప్పుడు ఇదే అంశాన్ని లేవనెత్తి చూపారు. దీంతో ఆక్రమణల తొలగింపు వెనుక ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదనే వాదన బలపడినట్టయింది. గత రెండు, మూడు రోజులుగా అన్ని రాజకీయ పక్షాలతోపాటు పలు ప్రజాసంఘాలు కూడా విగ్రహాల తొలగింపులో ప్రభుత్వ పక్షపాత ధోరణిని తీవ్రంగా ఎండగడుతూ వచ్చాయి. అయితే, జనసేన ఆవిర్భావ సభకు భూములిచ్చారనే కారణంతోనే ఇప్పటం గ్రామస్తులపై ప్రభుత్వం కక్షగట్టి కూల్చివేత చర్యలకు పాల్పడిందనే విమర్శలను వైసీపీ మంత్రులు తిప్పికొట్టేందుకు శతవిధాలుగా ప్రయత్నించినా.. విగ్రహాల తొలగింపు వ్యవహారంలో దొర్లిన అపప్రదను గురించి మాత్రం మాట్లాడలేక నీళ్లు నమిలారు. ప్రభుత్వం ఈ విషయంలో కొంత కఠినంగా వ్యవహరిస్తున్నా.. గ్రామ వైసీపీ నాయకులు మాత్రం ఏమనుకున్నారో ఏమోకానీ సోమవారం గ్రామంలో వున్న వైఎస్‌ విగ్రహాలను తొలగించేందుకు సిద్ధపడ్డామన్న సంకేతాలను ఇచ్చారు. ఉదయాన్నే తొమ్మిదిన్నర గంటల సమయంలో భారీ క్రేన్‌ఒకటి గ్రామంలోకి వచ్చింది. క్రేన్‌ రావడాన్ని చూచి గ్రామస్తులు మళ్లీ గాబరాపడ్డారు. అధికారులు ఇంకేమి చేయబోతున్నారోనంటూ ఆందోళన పడుతూ తమకు మద్దతిస్తున్న పక్షాలకు హడావిడిగా ఫోన్లు చేశారు. అయితే, క్రేన్‌తో వచ్చిన పనివారలు నేరుగా గౌడకాలనీ వద్ద ఉన్న వైఎస్‌ఆర్‌ విగ్రహం వద్దకు వెళ్లారు. అర్థగంట సమయంలోనే ఆ విగ్రహాన్ని అతి జాగ్రత్తగా పెకిలించి తమ సామాజికవర్గం వారి ఇళ్ల మధ్య భద్రపరిచారు. దీంతోపాటు రామాలయం సెంటరు వద్ద వున్న డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ పెద్ద విగ్రహాన్ని కూడా వెనువెంటనే తొలగిస్తారని గ్రామస్తులందరూ ఆతృతగా ఎదురుచూశారు. కానీ, అదేం విచిత్రమోగానీ ఆ ప్రధాన విగ్రహం జోలికి వెళ్లకుండా వెనుదిరిగారు. దీంతో గ్రామస్తులు మరోసారి కంగుతిన్నారు. కూల్చివేత ఘటనలో దొర్లిన తప్పిదాన్ని పారదర్శకంగా పరిష్కరించాలనుకుంటే ఈ రెండు విగ్రహాలనూ తొలగించాలి. కానీ, చిన్న విగ్రహాన్ని తొలగించి ప్రధాన విగ్రహాన్ని యథావిధిగా వదిలేసి వెళ్లడం అందరినీ అయోమయానికి గురిచేసింది. అయితే ఈ విగ్రహాన్ని ఎంటీఎంసీ అధికారులు తొలగించివుంటారని రాత్రి వరకు అందరూ భావించారు. అయితే ఎంటీఎంసీ అధికారులు ఆ పని మాదికాదని తేల్చిచెప్పడంతో ఇదెవరి పనై వుంటుందని అందరూ అయోమయానికి గురయ్యారు. తీరా! గ్రామ వైసీపీ నాయకులే తమంతట తామే ఆ విగ్రహాన్ని తొలగింపజేశామని వివరణ ఇచ్చారు. మరి రెండో విగ్రహం సంగతేంటని ప్రశ్నించగా... వ్యవహరం కోర్టు పరిధిలో వుందిగదా! కోర్టు వారు ఏం చెబుతారో చూచాక అప్పుడు ఏం చేయాలో ఆలోచిస్తామని వైసీపి నాయకులు చెప్పుకొచ్చారు.

ఇదిలావుంటే.. ఇప్పటం గ్రామానికి మూడు ప్రధాన రహదారులున్నాయి. వీటిలో ఒకటి ఆత్మకూరు వద్ద హైవే నుంచి సుమారు మూడున్నర కిలోమీటర్ల దూరంలో వున్న ఇప్పటాన్ని చేరుతుంది. రెండోది వడ్లపూడి శివాలయం సెంటరు నుంచి సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో వున్న ఇప్పటాన్ని చేరుతుంది. ఇక ఇప్పటం నుంచి కుంచనపల్లి వద్ద హైవేను చేరేందుకు వున్న మరో రహదారి సుమారుగా అయిదు కిలోమీటర్ల వరకు వుంటుంది. ఈ మూడు రహదార్లు 20 అడుగుల నుంచి 30 అడుగుల మధ్య వెడల్పుతోనే వున్నాయి. ఇప్పటానికి దారితీసే మూడు రహదార్లను విస్తరించకుండా గ్రామంలో ఆల్రెడీ ఇప్పటికే 60 అడుగలకు మించి వున్న రహదారిని 120 అడుగులకు విస్తరించాలన్న ప్రభుత్వ యోచన దేనికోసమో అర్థంకాని ప్రశ్నగా మిగిలిపోయింది.

ఈ సమస్య ఇలావుంటే గ్రామంలో కాపులు, బీసీలు కలిసి చందాలు వేసుకుని పోగుచేసుకున్న రూ.60 లక్షల వ్యయంతో ఓ కల్యాణ మండపాన్ని నిర్మించారు. దీనికి శ్రీకృష్ణదేవరాయ కల్యాణ మండపంగా గ్రామస్తులు గతంలో నామకరణం చేసుకున్నారు. అయితే, ఇప్పటం గ్రామాన్ని ఎంటీఎంసీలో విలీనం చేసిన తరువాత నగరపాలక సంస్థ సాధారణ నిధులు రూ.30 లక్షలను వెచ్చించి సదరు కల్యాణ మండపాన్ని ఆధునీకరించారు. ఈ ఆధునీకరణ పనులతోపాటు కల్యాణ మండపం పేరును కూడా డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి కల్యాణ మండపంగా మార్పు చేశారు. ఇప్పటివరకు ఈ పేరు మార్పును గురించి అంతగా పట్టించుకోని గ్రామస్తుల్లోని మెజారిటీ వర్గం ఇప్పుడు ఈ అంశాన్ని గురించి కూడా వివాద కోణంలో చూస్తోంది.

Updated Date - 2022-11-08T00:42:40+05:30 IST

Read more