‘మహా’ ముస్తాబు

ABN , First Publish Date - 2022-05-25T05:22:12+05:30 IST

తెలుగుదేశం పార్టీ మహానాడుకు ఒంగోలు నగరం, మండువవారిపాలెం ముస్తాబైంది. వారం రోజులుగా పనులు కొనసాగుతుండగా, రెండురోజుల నుంచి ఏర్పాట్లు మరింత పుంజుకున్నాయి.

‘మహా’ ముస్తాబు

సందడిగా మహానాడు ప్రాంగణం

ఏర్పాట్లు పరిశీలించిన యనమల, దేవినేని

తరలివచ్చి చూసి వెళ్తున్న వివిధ ప్రాంతాల కార్యకర్తలు


ఒంగోలు, మే 24 (ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీ మహానాడుకు ఒంగోలు నగరం, మండువవారిపాలెం ముస్తాబైంది. వారం రోజులుగా పనులు కొనసాగుతుండగా, రెండురోజుల నుంచి ఏర్పాట్లు మరింత పుంజుకున్నాయి. మహానాడు జరిగే ప్రాంగణంలో సందడి వాతావరణం కనిపిస్తోంది. చకచకా జరుగుతున్న మహానాడు పనులను రాష్ట్ర, జిల్లాస్థాయి ముఖ్యనేతలు ఒకవైపు పరిశీలిస్తున్నారు. మరోవైపు వివిధ ప్రాంతాల నుంచి ఉత్సాహంగా తరలివచ్చి ప్రాంగణాన్ని సందర్శిస్తున్న టీడీపీ కార్యకర్తలతో అక్కడ పండుగ వాతావరణం నెలకొంది. ఈ నెల 27, 28 తేదీల్లో మహానాడు కార్యక్రమం ఒంగోలు వేదికగా జరగనున్న విషయం విధితమే. నగర సమీపంలోని మండవవారిపాలెం పొలాల్లో మహానాడు ఏర్పాట్లు జరుగుతున్నాయి.  ఒకే వేదికపై తొలిరోజు ప్రతినిధుల సభ, రెండో రోజు బహిరంగసభ జరగనుంది. దాదాపు 12 వేలమంది కూర్చోనే విధంగా ప్రతినిధుల సభ షెడ్డు, దానికి దక్షిణం వైపు రక్తదాన శిబిరం, ఫొటో ఎగ్జిబిషన్‌తోపాటు మీడియా సెంటర్ల ఏర్పాటుకు నిర్మాణాలు పూర్తయ్యాయి. వేదిక నిర్మాణం చేస్తున్నారు. కొద్దిదూరంలో వేలాది మందికి భోజన సౌకర్యం కల్పనకు వీలుగా తాత్కాలికంగా కర్రల షెడ్లు ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు ప్రతినిధులకు ఇబ్బంది లేకుండా బయో టాయిలెట్లు, అలాగే ప్రాంగణానికి దగ్గరలోనే పార్కింగ్‌ సౌకర్యం కల్పిస్తున్నారు. అవి కూడా ఒక కొలిక్కి రాగా కీలకమైన ఆయా షెడ్లు అలంకరణ ఇతరత్రా బుధవారం సాయంత్రానికి పూర్తిచేసేలా పనులు చేస్తున్నారు. పార్టీ రాష్ట్ర కార్యాలయానికి సంబంధించిన ఇద్దరు, ముగ్గురు కీలక వ్యక్తులు స్థానిక నేతలను సమన్వయం చేసుకుంటూ అక్కడ ఈ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు, మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, టీడీపీ కేంద్ర కార్యాలయ కార్యదర్శి టీడీ జనార్థన్‌, ఎమ్మెల్యేలు ఏలూరి సాంబశివరావు, స్వామి,  గొట్టిపాటి రవికుమార్‌, మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జిలు దామచర్ల జనార్దన్‌, ఉగ్రనరసింహారెడ్డి, బీఎన్‌ విజయకుమార్‌, దివి శివరాం, ఎరిక్షన్‌బాబు, ఇంటూరి నాగేశ్వరరావు, పమిడి రమేష్‌, ఒంగోలు పార్లమెంట్‌ పార్టీ అధ్యక్షుడు నూకసాని బాలాజీ, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి దామచర్ల సత్య తదితరులు మంగళవారం ప్రాంగణాన్ని సందర్శించారు.  అనంతరం రాష్ట్ర నాయకులు ఎన్నెస్పీ అతిథిగృహంలో జిల్లా నాయకులతో సమావేశమై మహానాడు నిర్వహణకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు.


మేముసైతం అంటున్న గ్రామస్థులు 

మహానాడు ఈ ఏడాది ఒంగోలు వేదికగా కావడం.. తొలిసారిగా మండవవారిపాలెంలో జరగడం తమకెంతో గర్వంగా ఉందని ఆ గ్రామప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రెండురోజులపాటు జరిగే మహానాడు సంబరంలో మేముసైతం అంటూ ప్రతి ఒక్కరు ఉత్సాహం చూపుతున్నారు. ఇప్పటికే మహానాడు వేదికకు సొంత పొలాలను కేటాయించి, సహకారం అందిస్తున్నారు. వారం రోజులుగా పనులు చేస్తున్న వారికి, చూసేందుకు వస్తున్న పార్టీశ్రేణులకు సకల మర్యాదలు  గ్రామస్థులే చేస్తున్నారు. గ్రామప్రజల సహకారంతో వేదిక నిర్మాణం వద్ద మజ్జిగ, అల్పాహారం, సాయంత్రం టీ, తాగునీరు అందిస్తూ మహానాడు పనుల్లో భాగస్వాములవుతున్నారు. యువత, మహిళలు వేడుకలకు తమ బంధువులను సైతం ఆహ్వానిస్తున్నారు.  


Read more