ప్రేమ జంట ఆత్మహత్య?

ABN , First Publish Date - 2022-06-08T05:08:24+05:30 IST

బాపట్ల పట్టణంలో ప్రేమ జంట రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారనే ప్రచారం కలకలం రేపింది.

ప్రేమ జంట ఆత్మహత్య?
సంఘటన జరిగినట్లు చెబుతున్న బాపట్లలోని రైల్వేట్రాక్‌ ప్రాంతం

కనిపించకుండా పోయిన మృతదేహాలు 

 బాపట్ల, జూన్‌ 7: బాపట్ల పట్టణంలో ప్రేమ జంట రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారనే ప్రచారం కలకలం రేపింది. సోమవారం అర్ధరాత్రి దాటాక పట్టణంలోని గుంటూరు రైల్వేగేటు సమీపంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. బాపట్ల పట్టణానికి చెందిన ఓ కళాశాల విద్యార్థిని, కర్లపాలెం మండలం చింతాయపాలేనికి  చెందిన ఓ విద్యార్థి గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. ఇరువురు రైల్వేగేటు వద్ద పార్క్‌లో కలుసుకుంటూ ఉండేవారని సమాచారం. ఈ క్రమంలో  యువకుడు ఆత్మహత్య చేసుకున్న కొంత దూరంలో విద్యార్థిని కూడా ఆత్మహత్య చేసుకొని పడి ఉన్నట్లు ప్రచారం జరిగింది.  ఈ ఘటన జరిగిన కొన్ని గంటల వ్యవధిలోనే అక్కడ మృతదేహాలు కనిపించకుండా పోయినట్లు తెలిసింది. వారి మృతదేహాలను ఆయా కుటుంబాలవారు తీసుకెళ్ళి ఉంటారని ప్రచారం జరుగుతుంది. ఈ విషయమై కర్లపాలెం ఎస్‌ఐ అంజయ్య సిబ్బందితో కలిసి చింతాయపాలెం గ్రామంలోని మృతుడి కుటుంబ సభ్యులతో మాట్లాడి వివరాలు సేకరించే ప్రయత్నం చేశారు. అయితే వారు దీనిపై నోరు మెదపకపోవటంతో పోలీసులు కేసు నమోదు  చేయలేదు. ఈ విషయమై పట్టణ ఎస్‌ఐ షేక్‌ మహ్మద్‌ రఫీని వివరణ కోరగా తమ దృష్టికి వచ్చిన సమాచారం మేరకు రైల్వేట్రాక్‌ పరిసరాలు పరిశీలించి రైల్వేపోలీసులకు సమాచారం ఇవ్వటం జరిగిందన్నారు. బాపట్ల రైల్వే హెడ్‌కానిస్టేబుల్‌ బి.దేవమ్మను వివరణ కోరగా దీని గురించి తమకు రైల్వే సూపరింటెండెంట్‌ దగ్గర నుంచి ఎటువంటి సమాచారం లేదన్నారు. సంఘటన గురించి ప్రాథమిక సమాచారం కూడా తమ వద్ద లేదని చెప్పారు. ఎవరి నుంచి ఫిర్యాదు కూడా అందలేదన్నారు. 


Read more