మహాత్మా.. మన్నించు

ABN , First Publish Date - 2022-10-03T06:34:50+05:30 IST

జాతిపిత.. అహింసావాది.. అయిన మహాత్ముడి జయంతి ఆదివారం. గాంధీ జయంతి రోజున మద్యం, మాంసం విక్రయాలు నిషేధం. ఎన్నో ఏళ్లుగా ఇది కొనసాగుతుంది.

మహాత్మా.. మన్నించు
గురజాలలోని దండివాగు వద్ద ఓ రెస్టారెంట్‌లో మద్యం సేవిస్తున్న మందు బాబులు

నిషేధం గురించి పట్టించుకోని అధికారులు

గురజాలటౌన్‌, రాజుపాలెం, అక్టోబరు 2: జాతిపిత.. అహింసావాది.. అయిన మహాత్ముడి జయంతి ఆదివారం. గాంధీ జయంతి రోజున మద్యం, మాంసం విక్రయాలు నిషేధం. ఎన్నో ఏళ్లుగా ఇది కొనసాగుతుంది. ఈ నిషేధం అమలుకు సంబంధించి ఎక్కడికక్కడ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటారు. గాంధీ జయంతి రోజు మద్యం, మాంసం విక్రయాలు జరపకుండా ప్రభుత్వ నిబంధనలు ఉన్నాయి. అయితే గురజాల, రాజుపాలెం తదితర ప్రాంతాల్లో ఈ నిషేధం గురించి ప్రభుత్వ యంత్రాంగం మరిచిపోగా.. ప్రజలు పట్టించుకోలేదు. గాంధీ జయంతి నాడు ప్రభుత్వ మద్యం దుకాణాల్లో, బార్లలో విక్రయాలు జరగకుండా అధికారులు సీలు వేస్తారు. అయితే ఆ సీలుతో సంబంధం లేకుండా విచ్చలవిడిగా మద్యం విక్రయాలు జరిగాయి. గురజాల నగర పంచాయతీలో ఆదివారం మద్యం, మాంసం విక్రయాలు జోరుగా జరిగాయి. స్థానికంగా ఉన్న ప్రభుత్వ దుకాణాల్లో సైతం యథేచ్ఛగా మద్యం విక్రయాలు జరిగాయి. ఇక పంచాయతీ పరిధిలోని ప్రధాన కూడళ్లలో బహిరంగ మాంసం విక్రయాలను ఎవరూ అడ్డుకోలేదు. పరిస్థితి ఎలా ఉందంటే తమను అడిగే వారెవరు అన్నరీతిలో ఆదివారం మద్యం, మాంసం విక్రయాలు జరిగాయి. స్థానికంగా దండివాగు పక్కనున్న ఓ రెస్టారెంట్‌లో మద్యం అమ్మకాలను జరిపారు. మొక్కుబడిగా డోర్‌కు తాళం వేసి వెనుకపక్క నుంచి మద్యం అమ్మకాలు సాగించారు. చాలా గ్రామాల్లో మద్యం, మాంసం విచ్చలవిడిగా విక్రయాలు జరిగా జరిపారు. శనివారమే  ప్రభుత్వ వైన్‌షాపుల నుంచి పెద్దఎత్తున కొనుగోలు చేసి రూ.50కి అదనంగా ఆదివారం విక్రయించారు.  మరోవైపు మాంసం విక్రయాలు కూడా జరిగాయి. పంచాయతీ పరిధిలో అధికార పార్టీ నేతల కనుసన్నల్లో మద్యం విక్రయాలు సిండికేట్‌గా నడస్తుందనేది బహిరంగ విషయమే. ప్రభుత్వ మద్యం దుకాణాలు, రెస్టారెంట్ల వద్దకు అఽధికారులు తనిఖీ చేసేందుకు వెళ్లాలంటే హడలిపోతున్నారు. రెస్టారెంట్ల వద్దకు వెళ్లారంటే చాలు క్షణాల్లో ఫోన్‌ చేసి ఒత్తిడి చేస్తున్నారని అధికారులు బహిరంగంగానే వాపోతున్నారు. 


 

Updated Date - 2022-10-03T06:34:50+05:30 IST