కరిగిపోతున్న కొండలు

ABN , First Publish Date - 2022-11-24T00:42:11+05:30 IST

తవ్వకాలకు అనుమతులు లేవు.. అయినా అధికారం మాటున వైసీపీ నాయకులు బరితెగిస్తున్నారన్న విమర్శలున్నాయి.

కరిగిపోతున్న కొండలు
కోటప్పకొండలో అక్రమ మట్టి తవ్వకాలు

అనుమతులు లేకున్నా తవ్వకాలు

కోటప్పకొండ కేంద్రంగా మట్టి మాఫియా

గ్రావెల్‌ లారీకి రూ.6 వేలకు పైగా వసూలు

కళ్లకు మైనింగ్‌ అధికారులు మామూళ్ల గంతలు

అధికారం మాటున వైసీపీ నేతల బరితెగింపు

నరసరావుపేట, నవంబరు 23: తవ్వకాలకు అనుమతులు లేవు.. అయినా అధికారం మాటున వైసీపీ నాయకులు బరితెగిస్తున్నారన్న విమర్శలున్నాయి. ఇక అడ్డుకోవాల్సిన మైనింగ్‌ అధికారులు మామూళ్ల గంతలతో కళ్లుమూసుకుని ఉన్నారు. ఇదే అదనుగా మట్టి మాఫియా కోటప్పకేంద్రంగా చెలరేగిపోతోంది. మాఫియా చేతిపడిన కోటప్పకొండలో కొండలు కరిగిపోతున్నాయి. కొండ ప్రాంతంలో గ్రావెల్‌కు మంచి గిరాకి ఉంది. కోటప్పకొండలో భారీగా అక్రమ మైనింగ్‌ జరుగుతున్నది. నిత్యం వందల లారీల మట్టిని అక్రమార్కులు తరలించుకుపోతున్నారు. ఇందుకు ఎక్స్‌కవేటర్లు, లారీలను పెద్దఎత్తున వినియోగిస్తున్నారు. నరసరావుపేట ప్రాంతంలో ఇటీవల వెలుస్తున్న రియల్‌ వెంచర్లు పల్లంలో ఉండటంతో గ్రావెల్‌ వినియోగం పెరిగింది. దీంతో ఇక్కడి నుంచి నరసరావుపేటకు గ్రావెల్‌ను సరఫరా చేసేందుకు లారీకి రూ.6 వేలకు పైగా వసూలు చేస్తున్నారు. ఇక్కడి నుంచి వెళ్లే గ్రావెల్‌ లారీకి కొంత మొత్తాన్ని అధికార పార్టీ కీలక నేత వసూలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నది. వైసీపీ మండల స్థాయి నేత ఒకరు మట్టి దందా నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. అధికార పార్టీలో ఒక వర్గానికే అక్రమ గ్రావెల్‌ వ్యాపారం పరిమితమైందన్న విమర్శలు ఆ పార్టీ నేతల నుంచి వ్యక్తమవుతున్నాయి. మట్టి సామ్రాజ్యాన్ని కొందరు మాత్రమే అధికార పార్టీలో శాసిస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నది. కొన్ని నెలలుగా అక్రమ మైనింగ్‌ను అధికార పార్టీ నేతలు నిరాటంకంగా సాగిస్తున్నారు. ఇలానే కొనసాగితే కొండలు మిగిలే పరిస్థితి ఉండదు.

ప్రభుత్వ ఆదాయానికి గండి..

కోటప్పకొండ ప్రాంతంలో తవ్వకాలకు అనుమతులు లేవు. కొండ కేంద్రంగా జరుగుతున్న గ్రావెల్‌ తవ్వకాలతో ప్రభుత్వానికి ఆదాయం లేదు. ప్రభుత్వ అనుమతి ఉంటే గ్రావెల్‌ క్యూబిక్‌ మీటర్‌ గ్రావెల్‌కు రూ.60 మైనింగ్‌ శాఖకు చెల్లించాలి. లారీకి మైనింగ్‌ శాఖకు రూ.1200 చెల్లించాలి. అయితే అనుమతులు లేకుండా తవ్వకాలు జరుగుతుండటంతో ప్రభుత్వానికి ఎటువంటి నగదు చెల్లిస్తున్న దాఖలాలు లేవు. అక్రమ మైనింగ్‌తో రోజుకు లక్షల్లో ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతున్నది. పెద్దఎత్తున అక్రమాలు జరుగుతుంటే మైనింగ్‌, విజిలెన్స్‌ అధికారులు అటు వైపు కన్నెత్తి చూసే పరిస్థితి లేదు. వీరిపై అధికార పార్టీ నేతల ఒత్తిళ్లు అధికంగా ఉండటంతో చర్యలు తీసుకునే సాహసం సదరు అధికారులు చేయడంలేదు. మరో వైపు వారు మాముళ్లు కూడా తీసుకుని మిన్నకుంటున్నారన్న ప్రచారం ఉంది. కోటప్పకొండలో జరుగుతున్న అక్రమ మైనింగ్‌పై ఆ శాఖ డీడీని ప్రశ్నించగా వివరాలు తన వద్ద లేవని ఏడీని వివరణ కోరాల్సిందిగా సూచించారు. మైనింగ్‌ ఏడీకి పలుమార్లు కాల్‌ చేయగా

ఆయన స్పందించలేదు.

Updated Date - 2022-11-24T00:42:11+05:30 IST

Read more