వైభవంగా ఆరుద్రోత్సవం

ABN , First Publish Date - 2022-12-10T01:34:07+05:30 IST

కోటప్పకొండ త్రికోటేశ్వరస్వామి ఆరుద్రోత్సవం శుక్రవారం రాత్రి వైభంగా జరిగింది.

వైభవంగా ఆరుద్రోత్సవం
ఇరుముడులతో కొండకు చేరుకున్న మేథా దక్షణామూర్తి మాలధారణ స్వాములు

స్వామికి ఇరుముడులు సమర్పించిన స్వాములు

నరసరావుపేట, డిసెంబరు 9: కోటప్పకొండ త్రికోటేశ్వరస్వామి ఆరుద్రోత్సవం శుక్రవారం రాత్రి వైభంగా జరిగింది. కోటయ్య స్వామికి మహన్యాస పూర్వక మహా రుద్రాభిషేకాలు నిర్వహించారు. నరసరావుపేట, చిలకలూరిపేట సహా వివిధ ప్రాంతాల నుంచి మేథా దక్షణామూర్తి మాలధారణ స్వాములు ఇరుముడులతో కోటయ్య సన్నిధికి చేరుకున్నారు. ఆలయంలో స్వామికి ఆరుద్రోత్సవ పూజలు ఘనంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో స్వామిని దర్శించుకుని పూజల్లో పాల్గొన్నారు. మేథా దక్షణామూర్తి స్వాములు ఇరుముడులు స్వామికి సమర్పించి పూజల అనంతరం దీక్షను విరమించారు. రాత్రి 12 గంటల సమయంలో పాత కోటేశ్వర స్వామి ఆలయం వద్ద కర్పూర జ్యోతి దర్శనం చేసుకుని భక్తులు పులకించి పోయారు. కర్పూర జ్యోతి దర్శనం అనంతరం స్వామికి ఆవు పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార, ఎండు ఫలాలు, సుగంధ ద్రవ్యాలు, విభూది, కుంకుమ, గంధం, తైలాలతో అభిషేకాలు కన్నుల పండువగా జరిగాయి. తాళ్ల వెంకట కోటిరెడ్డి, శీలం కోటిరెడ్డి, అల్లు రమేష్‌, స్వాములకు అన్నప్రసాదం వితరణ చేశారు. ఆరుద్రోత్సవం సందర్భంగా ఆలయాన్ని పుష్పాలతో, విద్యుత్‌ దీపాలతో అలంకరించారు. స్వాములు కోటయ్య స్వామి గీతాలను ఆలపించారు. శనివారం తెల్లవారుజామున స్వామికి అన్నాభిషేకం జరగనుంది. అనంతరం త్రికోటేశ్వర స్వామికి విశేష అలంకరణ చేస్తారు. ఉదయం 8 గంటలకు యాగశాలలో లక్ష్మీగణపతి, రుద్ర హోమాలు జరగనున్నాయి. ఆలయ ఈవో వేమూరి గోపి ఏర్పాట్లను పర్యవేక్షించారు.

Updated Date - 2022-12-10T01:34:11+05:30 IST