జలకలేనా..

ABN , First Publish Date - 2022-10-03T06:02:43+05:30 IST

వైఎస్సార్‌ జలకళ పథకంతో సాగు నీటి కరువు తీరనుందంటూ పాలకులు చేసిన ప్రకటనలకు రెండేళ్లవుతున్నా అమలు అంతంతగానే ఉంది.

జలకలేనా..
బోరు తవ్వుతున్న యంత్రం

నిబంధనల చట్రంలో జలకళ

2,000పైగా దరఖాస్తులకు 220 బోర్లే 

రెండేళ్లుగా అన్నదాతల ఎదురుచూపులు

 

వైఎస్సార్‌ జలకళతో.. రైతులకు సాగునీటి కష్టాలు తప్పుతాయి.. పదుల సంఖ్యలో రిగ్గులు వచ్చేశాయి. వాటిని నియోజకవర్గానికి ఒకటి కేటాయించాం. ఇంకేముంది అడిగిందే తడవుగా ఉచితంగా బోర్లు వేయిస్తాం.. అన్న ఆర్భాటపు ప్రకటనలకు దాదాపు రెండేళ్లవుతుంది. అయినా ఇంకా రైతన్నలు జలకళ కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు. దరఖాస్తులు అందజేస్తే చాలు కావాల్సిన ప్రాంతంలో బోరు వేయిస్తాం.. ఇక సాగునీటికి దిగులు లేకుండా పంటలు పండించుకోవచ్చన్న అధికారులు ఏళ్లు గడుస్తున్నా వాటిని పరిశీలించడంలేదని దరఖాస్తుదారులు వాపోతున్నారు. ఆరంభం నుంచి ఈ పథకానికి సంబంధించి ప్రభుత్వం పిల్లిమొగ్గలు వేస్తూనే ఉంది. మార్గదర్శకాల దశ నుంచే మాటమార్చడం ప్రారంభించిన ప్రభుత్వం రెండేళ్ల సుదీర్ఘ వ్యవధిలో 220 బోర్లతో సరిపెట్టి రైతులు బోరుమనేలా చేసింది.


బాపట్ల,  అక్టోబరు 2 (ఆంధ్రజ్యోతి): వైఎస్సార్‌ జలకళ పథకంతో సాగు నీటి కరువు తీరనుందంటూ పాలకులు చేసిన ప్రకటనలకు రెండేళ్లవుతున్నా అమలు అంతంతగానే ఉంది. ఈ పథకం పరిస్థితి జిల్లాలో చూస్తే మాటలు కోటలు దాటితే చేతలు గడప దాటలేదు అన్న చందాన ఉంది. ప్రస్తుతం 220 బోర్లు మాత్రమే అన్ని బాలారిష్టాలను దాటి వినియోగానికి సిద్ధంగా ఉన్నాయి.   దరఖాస్తు చేసుకున్న రైతులందరికీ బోర్లు అందుబాటులోకి రావాలంటే పదేళ్ల సమయం కావాల్సిందే. మొదట్లో పొలంలో బోరు ఉన్నవారు ఈ పథకానికి అనర్హులుగా ప్రకటించి మళ్లీ వారు కూడా ఉచిత బోరుకు అర్హులేనంటూ తేల్చింది. రెండున్నర ఎకరాల పొలం ఒకే చోట ఉండాలనే నిబంధనను ఆరంభంలోని మార్గదర్శకాలలో పొందుపర్చింది. దానిని కూడా సవరించి ఉమ్మడిగా దరఖాస్తు చేసుకునే వెసులుబాటును కల్పిస్తున్నామంటూ మాట మార్చింది. 


ఎన్టీఆర్‌ జలసిరి పథకాన్నే జలకళగా...

గత ప్రభుత్వంలో అమలు చేసిన ఎన్టీఆర్‌ జలసిరి పథకాన్నే వైసీపీ ప్రభుత్వం రెండేళ్ల క్రితం వైఎస్సార్‌ జలకళగా మార్చారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో  రైతులకు బోరు, సోలార్‌ పంపుసెట్‌ను రాయితీపై అందించింది. రైతు వాటా కింద 55 వేలు చెల్లిస్తే మిగిలిన మొత్తాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీపై అందించేవి. జలసిరి పథకం కింద ఉమ్మడి గుంటూరు జిల్లాలో దాదాపు 4,000 మంది రైతులు లబ్ధిపొందారు. అంతకన్నా మెరుగ్గా పథకాన్ని అమలు చేస్తామని వైఎస్సార్‌ జలకళగా తెచ్చిన ప్రస్తుత ప్రభుత్వం రెండేళ్లలో 220 బోర్లతో సరిపెట్టి రైతుల ప్రయోజనాలకు పాతరేసింది. బాపట్ల జిల్లాలో జలకళ పథకం కోసం దాదాపు 2,000 మందికి పైనే అన్నదాతలు దరఖాస్తు చేసుకున్నారు. వాటిలో 1873 దరఖాస్తులకు అంచనా వేయగా పరిపాలనపరమైన అనుమతులను 1779కు ఇచ్చారు. వాటిలో 896 ని డ్రిల్లింగ్‌ చేశారు. ప్రభుత్వ నిబంధనల  ప్రకారం చివరిగా 220 బోర్లను పూర్తి స్థాయిలో సిద్ధం చేసి రైతులకు అందుబాటులోకి తెచ్చారు


రెండేసి మండలాలకు ఒకటని చెప్పి...

ఈ పథకం ప్రారంభంలో రెండు మండలాలకు ఒకటి చొప్పున రిగ్గు యంత్రాన్ని ఏర్పాటు చేసి వాటితో బోర్లు తవ్విస్తామని ప్రభుత్వం చెప్పింది. ప్రస్తుతం నియోజకవర్గానికి ఒకటి చొప్పున మాత్రమే బోర్‌వెల్‌ యంత్రాలను అందుబాటులో ఉంచింది. వీటిలో కూడా రిగ్గు యజమానులతో ఇంకా కొన్ని చోట్ల ఒప్పందాలు పూర్తి కాలేదనేది సమాచారంగా ఉంది. యంత్రాలే సమృద్ధిగా లేని చోట వేల సంఖ్యలో బోర్లు తవ్వకమనేది ఎలా సాధ్యమని అన్నదాతలు ప్రశ్నిస్తున్నారు. నీటి సదుపాయంలేని రైతులందరికీ జలకళ పథకం ద్వారా అండగా ఉంటామని నాడు ప్రభుత్వం ప్రకటించింది. విద్యుత్‌ కూడా ఉచితంగా ఇస్తామని నమ్మబలికింది. తీరా ఆచరణలోకొచ్చేసరికి అలవికాని నిబంధనలతో రైతులకు చుక్కలు చూపిస్తోంది. ఉచిత విద్యుత్‌ భారం మొత్తం ప్రభుత్వం భరించలేదంటూ కొంత అన్నదాతే భరించాలంటూ మెలిక పెట్టింది. అద్దంకి, పర్చూరు నియోజకవర్గాల రైతులు ఈ పథకం మీద గంపెడాశలు పెట్టుకున్నారు. కానీ ప్రభుత్వం నిబంధనల చట్రంలో పథకాన్ని బంధించడంతో వందల సంఖ్యలో బోర్లు కూడా ఇప్పటివరకు పూర్తి కాలేదు.  


Read more