మళ్లీ మళ్లీ.. వాయిదా

ABN , First Publish Date - 2022-10-02T05:50:10+05:30 IST

కష్టమొకరిది...పేరింకొకరిది అన్న చందంగా తయారైంది అందరికీ ఇళ్లు పథకం.

మళ్లీ మళ్లీ.. వాయిదా
మళ్లీ మళ్లీ.. వాయిదా

 జయంతికి.. ఉసూరుమనిపించారు

మొదలే కానీ టిడ్కో గృహాల పంపిణీ

టీడీపీ హయాంలో పూర్తయిన ఇళ్లకు వైసీపీ జెండాను పోలిన రంగులు

పంపిణీ పట్ల జాప్యమే అసలు లక్ష్యం

రంగులపై వున్న శ్రద్ధ పంపిణీపై చూపరే!

భగ్గుమంటున్న లబ్ధిదారులు


 మంగళగిరి, అక్టోబరు 1: కష్టమొకరిది...పేరింకొకరిది అన్న చందంగా తయారైంది అందరికీ ఇళ్లు పథకం. ఈ పథకం కింద నిర్మించిన ఇళ్లకు ఏ రకమైన పార్టీ రంగులు వేయకుండా అర్హులైన లబ్ధిదారులకు నిజాయితీగా పంపిణీ చేయాలని నాటి తెలుగుదేశం ప్రభుత్వం భావించింది. ఎంతో కష్టపడి సదరు గృహ నిర్మాణాలకు అనువైన స్థలాలను సమకూర్చడంతోపాటు అధునాతన సాంకేతిక షేర్‌వాల్‌ టెక్నాలజీతో నాటి టీడీపి ప్రభుత్వం అత్యద్భుతంగా నిర్మించింది. నాడు గృహ నిర్మాణాలు పూర్తయినప్పటికీ మౌలిక సదుపాయాలను కల్పించేందుకు తగిన సమయం లేకపోవడంతో వాటిని పంపిణీ చేసే అదృష్టానికి టీడీపీ ప్రభుత్వం నోచుకోలేదు. తరువాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం మొత్తం నిర్మాణ వ్యయంలో 15శాతంగా ఉన్న మౌలిక సదుపాయాలను ఇప్పటివరకు పూర్తిచేయలేక ఆపసోపాలు పడుతోంది. మళ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అటకెక్కించిన ఈ గృహాల పంపిణీ కార్యక్రమంపై వైసీపీ ప్రభుత్వం అనివార్యంగా దృష్టి సారించాల్సి వచ్చింది. టీడీపీ ప్రభుత్వం నిర్మించిన గృహాలను పంపిణీ చేయడం ఇష్టంలేక మూడున్నరేళ్లపాటు  ఆ కాలనీల్లో తట్టెడు మట్టయిన వేయని వైసీపీ ప్రభుత్వ పెద్దలు రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని గత రెండు మాసాలుగా మౌలిక సదుపాయాలను ఏర్పాటుచేయడంపై కసరత్తులు చేస్తున్నారు. ఈ క్రమంలో ఇళ్ల నిర్మాణంలో నాటి టీడీపీ ప్రభుత్వం పడిన కష్టాన్ని చెరిపేస్తూ సదరు గృహాలకు వైసీపీ జెండాను పోలిన రంగులను అద్దుకుంటున్నారు. అక్టోబరు రెండో తేదీ గాంధీ జయంతి నాటికి రాష్ట్రంలో ఈ టిడ్కో గృహాలను పెద్దఎత్తున పంపిణీ చేస్తామని గత రెండు మాసాలుగా ఊదరగొట్టిన ప్రభుత్వ పెద్దలు ఇప్పుడు మళ్లీ ఆమాటను కూడ నిలబెట్టుకోలేక చతికలపడుతున్నారు. మౌలిక సదుపాయాలను నిర్దేశించుకున్న గాంధీ జయంతి అనే గడువు తేదీ  నాటికి పూర్తి చేయడంలో విఫలమైనా. సదరు గృహాలకు మాత్రం రంగులు వేసుకోవడంలో మాత్రం పూర్తిగా సఫలీకృతమయ్యారు.

 

 రూ.480 కోట్లతో 6752 గృహాలు

 నాటి తెలుగుదేశం ప్రభుత్వం ప్రధానమంత్రి అవాస్‌ యోజన పథకం కింద రాజధాని అమరావతి, మంగళగిరి పట్టణాల్లో కలిపి మొత్తం రూ.480 కోట్ల వ్యయంతో మొత్తం 6,752 గృహాలను నిర్మించింది. మంగళగిరికి మొత్తం 2,592 గృహాలు మంజూరుకాగా, స్థలాభావ సమస్య కారణంగా రూ.135 కోట్ల వ్యయంతో 1,728 గృహాలను నగరంలోని రాజీవ్‌ గృహకల్ప ఏరియాలో ఉన్న 17 ఎకరాల్లో నిర్మించారు. వీటిని మొత్తం 54 బ్లాకులుగా నిర్మించారు. ఒక్కో బ్లాకుకు 32 ఫ్ల్ల్లాట్ల వంతున జీ+3 భవన సముదాయాలుగా వీటిని నిర్మించారు. ఈ బ్లాకుల మధ్య 60అడుగులు, వందేసి అడుగుల రహదారులను ఏర్పాటు చేసే విధంగా ఈ కాలనీని చాలా చక్కగా డిజైన్‌ చేశారు. అలాగే, రాజదాని అమరావతి ఏరియాలో.. సొంతిళ్లులేని నిరుపేదలను 7,876మందిగా గుర్తించి వారందరికీ రాజధాని గ్రామాల్లోనే ఆవాసాన్ని కల్పించే లక్ష్యంతో తొలిదశ కింద 44.05 ఎకరాల విస్తీర్ణంలో 5,024 గృహాలను నిర్మించారు. వీటిని పెనుమాక, దొండపాడు, అనంతవరం, తుళ్లూరు, నిడమర్రు, ఐనవోలు, నవులూరు, మందడం గ్రామాలలో  నిర్మించారు. రెండోదశ కింద మరో 2,852 గృహాలను నవులూరు, మందడం గ్రామాల్లో నిర్మించే విధంగా ప్రణాళికను రూపొందించారు. అయితే 2019 ఎన్నికల అనంతరం రాష్ట్ర ప్రభుత్వం మారడంతో ఈ రెండోదశ గృహ నిర్మాణాల ప్రక్రియ పూర్తిగా స్తంభించిపోయింది. మొత్తంగా మంగళగిరి, రాజధాని అమరావతి ప్రాంతాల్లో టీడీపీ ప్రభుత్వ పట్టుదలతో పేదలకు 6,752 గృహాలు పూర్తి నాణ్యతా ప్రమాణాలతో సిద్ధమైనప్పటికీ తరువాత వచ్చిన వైసీపీ ప్రభుత్వ మొండివైఖరితో లబ్ధిదారులకు ఎప్పటికపుపడు ఆశాభంగమే జరుగుతూ వచ్చింది.


నాణ్యతా ప్రమాణాలతో..

     ఈ టిడ్కో గృహ నిర్మాణాల విషయంలో నాటి టీడీపీ ప్రభుత్వం ఎక్కడా రాజీ పడకుండా నాణ్యతా ప్రమాణాలకు పెద్దపీట వేసింది. దేశ స్వాతంత్ర్యానంతరం పాలక ప్రభుత్వాలు పేదలకోసం నిర్మించిన గృహాలలో కెల్లా ఈ గృహాలే అత్యంత నాణ్యమైనవని ఎవరైనా ఒప్పుకుని తీరాల్సిందే. మౌలిక సదుపాయాలు మినహా నిర్మాణ పనులను పూర్తి చేసుకున్న ఈ గృహాలను మూడున్నరేళ్ల పాటు పాడుపెట్టిన చందంగా వదిలేసి ఊరుకున్నప్పటికీ అవేమీ చెక్కు చెదరకుండా వున్నాయి. కేవలం నిర్మాణపరంగానే కాకుండా ఫ్లోరింగ్‌ టైల్స్‌, కిటికీలు, కిచెన్‌ వంటివాటిని కూడ ఎంతో అధునాతనంగా నిర్మించారు. సగటు పేదకుటుంబం ఏనాడూ ఊహించలేనంత సుందరమైన ఇంటిలో నివాసముండేలా అందరికీ ఇళ్ల నిర్మాణాన్ని టీడీపీ ప్రభుత్వం అద్భుతంగా నిర్మించింది. ఈ క్రెడిట్‌ అంతా నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు, నిర్మాణ బాధ్యతలను పదేపదే పర్యవేక్షించిన ఆనాటి మునిసిపల్‌ శాఖామంత్రి నారాయణకు దక్కుతుంది. 


లబ్ధిదారులకు ఎంతో నష్టం

 నిర్మాణ వ్యయంలో 15శాతంగా వున్న మౌలిక సదుపాయాలను సమకూర్చకుండా జాప్యం చేస్తూ వచ్చిన వైసీపీ ప్రభుత్వం లబ్ధిదారులైన నిరుపేదలను ఎంతగానో నష్టపరిచింది. అప్పట్లో లబ్ధిదారులు తమ వాటా సొమ్ము రూ.50వేలనుంచి రూ.లక్షవరకు అప్పులు చేసి వడ్డీలకు తెచ్చి చెల్లించారు. అవి ఈనాటికి రెట్టింపు అయి కూర్చున్నాయి. పైగా ఈ మూడున్నరేళ్లపాటు అద్దెలు చెల్లిస్తూ మరికొంత నష్టపోయారు. లబ్ధిదారుల నష్టం ఇంతటితో ఆగలేదు. నాటి ప్రజా ప్రతినిధి ఒకరు ఇళ్ల కేటాయింపుల కోసం లబ్ధిదారుల ముక్కులు పిండి సొమ్ములను వసూలు చేసుకున్నారనే ఆరోపణలు మంగళగిరిలో పెను సంచలనాన్ని కలిగించింది. ఈ సంచలన ఆరోపణలపై స్థానిక ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి విజిలెన్స్‌ దర్యాప్తును కూడా చేయించారు. కానీ... దర్యాప్తులో ఏమి తేలిందో ఇంతవరకు ఎవరికీ తెలియదు. పైగా వసూళ్ల రాజాగా పేరొందిన నాటి నాయకుడు నేడు మళ్లీ అదే టిడ్కో కాలనీలో మౌలిక సదుపాయాల ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ పాలకపక్షం నేతలతో కలిసి తిరుగాడడం మరీ సంభ్రమాశ్చర్యాన్ని కలిగిస్తోంది. టిడ్కో లబ్ధిదారులనుంచి బాగా లబ్ధి పొందిన సదరు నాయకుడు ఎవర్‌గ్రీన్‌ పవర్‌మెన్‌గా అవతరించడాన్ని చూచి నగర ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. 


   ఇదిగో...అదిగో అంటూ..

 గత కొద్ది నెలలుగా వైసీపీ ప్రభుత్వం చెబుతూ వస్తున్న టిడ్కో గృహాల పంపిణీ ప్రక్రియ మరోమారు వాయిదా పడినట్టయింది. ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి ప్రకటించిన విధంగా గాంధీ జయంతి నాడు పూర్తిగా కాకపోయిన లాంఛనంగా అయినా ఈ గృహాల పంపిణీ ప్రక్రియను ప్రారంభించి రోజుల వ్యవధిలో పూర్తి చేస్తారని ఆశించిన లబ్ధిదారులకు మరోమారు శృంగభంగమే కలిగింది. రాజధాని అమరావతి, మంగళగిరి ఏరియాల్లో ఇళ్లు చేతికిరాకపోయినా.. ఇళ్లకు పడ్డ బ్లూ రంగులను చూసుకుని లబ్ధిదారులు విరక్తిగా నవ్వుకుంటున్నారు.

Updated Date - 2022-10-02T05:50:10+05:30 IST