గ్రానైట్‌కు.. పవర్రీ

ABN , First Publish Date - 2022-04-24T05:34:59+05:30 IST

సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న గ్రానైట్‌ పరిశ్రమను పవర్‌ హాలిడే, విద్యుత్‌ కోతలు కుంగదీస్తున్నాయి. ఫ్యాక్టరీలను పూర్తిగా మూసివేసే పరిస్థితి ఏర్పడింది.

గ్రానైట్‌కు.. పవర్రీ
మూతపడిన గ్రానైట్‌ ప్యాక్టరీ

పవర్‌ హాలిడేతో తీవ్రనష్టం

కరెంట్‌ కోతలకు తోడు.. డీజిల్‌ భారం

సరిపడా పనుల్లేక స్వస్థలాలకు కూలీలు

ఆందోళనలో పరిశ్రమల యజమానులు

రోజుకు సుమారు రూ.2 కోట్ల ఆదాయానికి గండి

 


అద్దంకి/బల్లికురవ, ఏప్రిల్‌ 23: సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న గ్రానైట్‌ పరిశ్రమను పవర్‌ హాలిడే, విద్యుత్‌ కోతలు కుంగదీస్తున్నాయి. ఫ్యాక్టరీలను పూర్తిగా మూసివేసే పరిస్థితి ఏర్పడింది. దీంతో గ్రానైట్‌ ఫ్యాక్టరీల యజమానులు,  కూలీలు, సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. వారంలో రెండు రోజులు (మంగళ,  బుధవారం) పూర్తిగా విద్యుత్‌ నిలిపివేయడంతో పాటు మిగిలిన రోజుల్లో ఉదయం 6 నుంచి సాయంత్రం 6  వరకు 12 గంటల సమయం మాత్రమే పరిశ్రమలకు విద్యుత్‌ సరఫరా జరుగుతుంది.  మొత్తంగా వారంలో 60 గంటలు మాత్రమే విద్యుత్‌ సరఫరా ఉంటుండటంతో బల్లికురవ, మార్టూరు, సంతమాగులూరు మండలాల పరిధిలో రోజుకు సుమారు రూ.2 కోట్ల ఆదాయానికి గండి పడుతోంది. ఈ ప్రభావం గ్రానైట్‌ ప్యాక్టరీల నిర్వహకులపైనే కాకుండా, అందులో  పనిచేసే ఇతర  రాష్ర్టాల కూలీలతో పాటు మార్కర్లు, సూపర్‌వైజర్లు, అనుబంధ రంగాల కార్మికులపై కూడా పడుతోంది. బల్లికురవ, మార్టూరు, సంతమాగులూరు మండలాల పరిధిలో సుమారు 450 గ్రానైట్‌ ప్యాక్టరీలు ఉన్నాయి. వీటిలో   ఒడిశా, జార్ఖండ్‌, ఉత్తరప్రదేశ్‌, బిహార్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీ్‌సగడ్‌, రాజస్థాన్‌ రాష్ర్టాలకు చెందిన సుమారు 20 వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు. స్థానికంగా ఇతర రంగాలకు చెందిన సుమారు మరో 30 వేల మంది ఉపాధి పొందుతున్నారు. ఒక్కో ప్యాక్టరీలో సరాసరిన నిత్యం 2 వేల అడుగుల రాయి కటింగ్‌ చేస్తుంటారు. అయితే ప్రస్తుతం రోజుకు సుమారు 12 గంటల పాటు విద్యుత్‌ కోతలు విధిస్తుండడంతో సగానికి సగం కూడా పని జరగడం లేదు. వారంలో 60 గంటలు మాత్రమే ఇచ్చి 108 గంటలు నిలిపేస్తుండడంతో ఫ్యాక్టరీల్లో విద్యుత్‌ వినియోగం 70 శాతం మేర తగ్గింది. ఆ ప్రభావంతో ఉత్పత్తిలో కూడా రెండు వంతుల మేర తగ్గినట్లు అంచనా. 


పనులు లేక గిట్టుబాటు కాని కూలి

గ్రానైట్‌ పరిశ్రమలో కూలీలు చేసిన కొలతలను బట్టి కూలి చెల్లిస్తుంటారు. సాధారణంగా ఒక్కో కూలీ సాధారణంగా రోజుకు వెయ్యి  రూపాయల వరకూ సంపాదిస్తాడు.  ప్రస్తుతం కరెంటు కోతలతో రూ.500లకు మించి వచ్చే పరిస్థితి లేదు. దీంతో కార్మికులు స్వస్థలాలకు పోతున్నారు. వారు వెళ్తే తిరిగి రాలేరని ఫ్యాక్టరీల యజమానులు పేర్కొంటున్నారు. విద్యుత్‌ కోతలకు ప్రత్యామ్నాయంగా జనరేటర్‌ను వినియోగించాలంటే అధిక వ్యయం అవుతోందని యజమానులు పేర్కొంటున్నారు. అదే సమయంలో పెరిగిన డీజిల్‌ ధరలతో నిర్వహణ మరింత భారంగా మారుతుందన్న ఆందోళన యజమానుల్లో నెలకొంది.


పెరిగిన రాయల్టీతో సంక్షోభం

ఆరు నెలల క్రితం ప్రభుత్వం గ్రానైట్‌ శ్లాబులపై రాయల్టీని భారీగా పెంచింది. ఏ గ్రేడ్‌ రకానికి యూనిట్‌కు గతంలో రూ.4200 కాగా రూ.6700 చేసింది. బీ గ్రేడ్‌ రకానికి రూ.3200 నుంచి రూ.5700కు పెంచింది. దీంతో ఇప్పటికే చిన్న ఫ్యాక్టరీలు మూతపడ్డాయి.. ఇప్పుడు పవర్‌ హాలిడే, విద్యుత్‌ కోతలతో మరికొన్ని మూతపడటం ఖాయమని  పలువురు అభిప్రాయపడుతున్నారు. ఫ్యాక్టరీల కోసం బ్యాంకుల్లో తీసుకున్న రుణాలకు నెలవారీ చెల్లింపులు, బయట తెచ్చిన అప్పులకు వడ్డీలు మరింత భారంగా మారే అవకాశం ఉందని యజమానులు ఆందోళన చెందుతున్నారు.


పని సాగడం లేదు 

గ్రానైట్‌ పరిశ్రమల్లో విద్యుత్‌ సరఫరా పగలు మాత్రమే ఉంటుంది. దీంతో ప్యాక్టరీలో సగం పని కూడా ఉండడం లేదు. వారంలో రెండు  రోజులు పూర్తిగా నిలిపి వేస్తున్నారు. దీంతో పనులు సాగడంలేదు. కూలి కూడా గిట్టుబాటు కావడం లేదు. - హుక్మారామ్‌, రాజస్థాన్‌ 


ఇంటికి వె ళ్దామనుకుంటున్నాం

విద్యుత్‌ సక్రమంగా లేకపోవడంతో పనులు లేవు. కూలి సరిపడా రావడం లేదు. దీంతో సొంత ఊర్లకు  వెళ్దాం అనుకుంటున్నాం. గత నెలలో రోజువారీ కూలీ వెయ్యి రూపాయలు వచ్చింది. ఇప్పుడు రూ.500లకు మించి వచ్చే  పరిస్థితి లేదు.

- రాంలాల్‌, రాజస్థాన్‌


పవర్‌ హాలిడే ఎత్తివేయాలి 

మంగళ, బుధవారం పూర్తిగా విద్యుత్‌ నిలిపి వేస్తూ పవర్‌ హాలిడే ప్రకటించారు. దీంతో పరిశ్రమలు నడపడం కష్టంగా  మారింది. మిగిలిన రోజుల్లో పగలు సమయం మాత్రమే విద్యుత్‌ సరఫరా జరుగుతోంది. కనీసం ఆ రెండు రోజులు కూడా పగలు ఇస్తే కొంత మేర అయినా ఫ్యాక్టరీలు నిర్వహించుకునే వీలు ఉంటుంది.

  - చిట్టిపోతు మస్తానయ్య, గ్రానైట్‌ ఫ్యాక్టరీ యజమానుల సంఘం అధ్యక్షుడు


పవర్‌ హాలిడేకు సహకరించాలి

పరిశ్రమలకు ప్రతి మంగళ, బుధవారాల్లో  రోజంతా విద్యుత్‌ సరఫరా నిలిపేస్తున్నాం. మిగిలిన 5 రోజుల్లో ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు  అంతరాయం లేకుండా విద్యుత్‌ సరఫరా చేస్తున్నాం. గృహ అవసరాలకు విద్యుత్‌ వినియోగం బాగా పెరగడంతో తప్పనిసరి పరిస్థితుల్లో పరిశ్రమలకు విద్యుత్‌ సరఫరా  నిలిపివేస్తున్నాం పరిశ్రమల యజమానులు కొంతకాలం సహకరించాలి.  - నల్లూరి మస్తాన్‌రావు, ఈఈ, ఏపీసీపీడీసీఎల్‌, అద్దంకి డివిజన్‌


Updated Date - 2022-04-24T05:34:59+05:30 IST