జీజీహెచ్‌లో నూతన సాంకేతికత

ABN , First Publish Date - 2022-09-11T05:34:43+05:30 IST

గుంటూరు ప్రభుత్వ సమగ్రాస్పత్రిలోని న్యాట్కో కేన్సర్‌ సెంటర్‌...వైద్య రంగంలో మరో విప్లవాత్మక నూతన సాంకేతిక పరిజ్ఞానానికి వేదిక నిలవనుంది.

జీజీహెచ్‌లో నూతన సాంకేతికత
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం

రిమోట్‌ పేషెంట్‌ మానిటరింగ్‌ టెక్నాలజీ

ఏపీ ప్రభుత్వ వైద్య రంగంలో ఇదే తొలిసారి

ట్రయల్‌ రన్‌లో ఫలితాలు సంతృప్తికరం

నెలాఖరు నుంచి కేన్సర్‌ రోగులకు అందుబాట్లోకి

దశల వారీగా ఏపీలో ఇతర ఆసుపత్రుల్లోనూ...

గుంటూరు (మెడికల్‌), సెప్టెంబరు 10: గుంటూరు ప్రభుత్వ సమగ్రాస్పత్రిలోని న్యాట్కో కేన్సర్‌ సెంటర్‌...వైద్య రంగంలో మరో విప్లవాత్మక నూతన సాంకేతిక పరిజ్ఞానానికి వేదిక నిలవనుంది. రాష్ట్ర ప్రభుత్వ వైద్యరంగంలో తొలిసారిగా ఇక్కడ కాంటాక్ట్‌లెస్‌ కంటిన్యూయస్‌ రిమోట్‌ పేషెంట్‌ మానిటరింగ్‌ (ఆర్‌పీఎం) టెక్నాలజీని ప్రవేశపెడుతున్నారు. దీనితో పాటుగా రోగుల సంరక్షణకు సంబంధించిన ఎర్లీ వార్నింగ్‌ సిస్టమ్‌ సాంకేతిక కూడా పరిచయం చేస్తున్నారు. ఈ నూతన సాంకేతిక పరిజ్ఞానం వల్ల రోగుల వైద్య సేవల్లో మానవ తప్పిదాలు పూర్తిగా తగ్గిపోయి మెరుగైన వైద్యసేవలు లభిస్తాయి. రోగులకు సంబంధించిన వైటల్స్‌ను మాన్యువల్‌గా నమోదు చేసే శ్రమ తగ్గడంతో డాక్టర్లు, నర్సులకు విలువైన కొన్ని లక్షల పని గంటలు ఆదా అవుతాయి. ఇప్పటికే ట్రయల్‌ రన్‌ నిర్వహించగా, ఫలితాలు సంతృప్తికరంగా వచ్చినట్లు అధికార వర్గాలు తెలిపాయి.

కొత్త టెక్నాలజీతో మానవ వనరులు ఆదా...

సాధారణంగా ప్రభుత్వాస్పత్రుల్లో వైద్య సిబ్బంది కొరత వేధిస్తుంది. సరైన పర్యవేక్షణ లేక రోగులు మృతి చెందే సందర్భాలు ఉంటాయి. వీటిని నియంత్రించేందుకు ఆర్‌పీఎం టెక్నాలజీ దోహదపడుతుంది. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌తో ఆధారంగా పనిచేసే ఈ సాంకేతికత వల్ల నిరంతరం (గంటకు వందసార్లు) రోగుల వైటల్స్‌ రికార్డు చేసి వైద్యసిబ్బందికి తెలియజేస్తుంది. రోగుల ఆరోగ్యం క్షీణిస్తే, ఎర్లీ వార్నింగ్‌ సిస్టమ్‌ ద్వారా డాక్టర్లను అప్రమత్తం చేస్తుంది. దీని వల్ల డాక్టర్లు సత్వరం స్పందించి రోగికి తగిన వైద్యం అందించి ప్రాణాపాయం తప్పించే అవకాశం ఉంటుంది. ఒక రకంగా ప్రభుత్వాస్పత్రిలో సాధారణ వార్డు కూడా ఐసీయూ వార్డుగా మార్చే టెక్నాలజీగా దీనిని అభివర్ణించవచ్చు. 


నెలాఖరు నుంచి అందుబాట్లోకి...

ఈ నెలాఖరు నుంచి న్కాట్కో కేన్సర్‌ సెంటర్‌లో ఆర్‌పీఎం టెక్నాలజీ అందుబాట్లోకి రానుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఐటీ, అండ్‌ ఎలకా్ట్రనిక్స్‌ హెడ్‌, ఐఏఎస్‌ అధికారి జీఎస్‌ నవీన్‌కుమార్‌ ప్రత్యేక చొరవ చూపి  ఈ కొత్త సాంకేతికతను ప్రవేశపెడుతున్నారు. కేన్సర్‌ సెంటర్‌లో మొత్తం 110 పడకలు ఉన్నాయి. ఇందులో ఐసీయూ 24 బెడ్స్‌. జనరల్‌ వార్డులో 86 పడకలు ఉన్నాయి. ప్రస్తుతం ఆర్‌పీఎం టెక్నాలజీని సాధారణ పడకలకు అనుసంధానం చేస్తున్నారు. ఇక్కడ ఫలితాలను పరిశీలించిన తర్వాత ఈ  ఆధునిక సాంకేతికను రాష్ట్రంలో ఇతర వైద్య బోధనాసుపత్రుల్లోనూ ప్రవేశపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రముఖ స్టార్టప్‌ కంపెని డోజీ, గుంటూరు జీజీహెచ్‌లో ఈ టెక్నాలజీని పరిచయం చేస్తోంది. 


Read more