రైతుకు.. రిక్తహస్తం

ABN , First Publish Date - 2022-10-08T05:43:36+05:30 IST

మాది రైతు రాజ్యం.. రైతు సంక్షేమమే మా ధ్యేయం.. ఈ మాట కొన్ని వందలసార్లు ప్రభుత్వ పెద్దలు పలు వేదికలపై చెప్పి ఉంటారు.

రైతుకు.. రిక్తహస్తం

సేద్యానికి అవసరమయ్యే పథకాలకు అన్నింటికీ మంగళం

రైతుభరోసాతోనే సరి.. దానిలో కూడా కేంద్రం వాటా

కాలయాపన తప్ప పథకాల  అమలు శూన్యం

కుదేలవుతున్న చిన్న, సన్నకారు రైతాంగం

రాబోయే రబీకైనా తమపై దయ చూపాలని రైతుల అభ్యర్థన

 బాపట్ల, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి):  మాది రైతు రాజ్యం.. రైతు సంక్షేమమే మా ధ్యేయం.. ఈ మాట కొన్ని వందలసార్లు ప్రభుత్వ పెద్దలు పలు వేదికలపై చెప్పి ఉంటారు. ఈ మాటలు విన్న రైతాంగం సైతం తమ ఉద్దరణకే ప్రభుత్వం కట్టుబడి ఉంది కాబోలు అని అమాయకంగా నమ్మారు. గిర్రున మూడేళ్లు దాటితే తప్ప అర్థం కాలేదు వారికి.. గత ప్రభుత్వం ఏమిచ్చింది.. ప్రస్తుత ప్రభుత్వం ఏమిస్తోంది అని. రైతులు నిలదీయడం మొదలెట్టేసరికి నేటి పాలకులు మరో అంకానికి తెరలేపారు. గత ప్రభుత్వం అమలు చేసిన పథకాలకు పేర్లు మార్చి.. అవి తమవన్నట్లు  కలరింగ్‌ ఇస్తున్నారు. పోనీ ఆ పనన్నా చిత్తశుద్ధిగా చేశారా అంటే అదీ లేదు. పథకం ప్రకటించేటప్పుడు ఉన్న హడావిడి దాని పురోగతిలో మాత్రం కనబడడం లేదు. మరీ దారుణంగా కొన్ని పథకాలు అయితే  ప్రకటనలకే పరిమితమయ్యాయి. అయ్యవారొచ్చేదాకా అమావాస్య ఆగదు అన్నచందాన ఖరీఫ్‌, రబీలు గడచిపోతున్నాయి.. కానీ పథకాల ఫలాలు మాత్రం రైతుల చెంతకు చేరడం లేదు. ఆ పథకాల కథా కమామీషు పరిశీలిస్తే అవాక్కవడం ఖాయం. ముందుగా రాయితీ యంత్రాల విషయానికొస్తే ఈ తంతు రెండున్నరేళ్ల నుంచి సాగుతూనే ఉంది. గత ప్రభుత్వంలో సూక్ష్మ సేద్యం ఉద్యమంలా సాగింది. ఆయా భూముల తత్వాన్ని బట్టి పోషకాలను సైతం  గత ప్రభుత్వం ఉచితంగా అందించేది. ప్రస్తుతం వాటి ఊసేలేదు.  ఇక జలకళ ఈ తతంగం ఆరంభమై కూడా దాదాపు  రెండేళ్లు  దాటింది. ఇప్పటివరకు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా కనీస స్థాయిలో  కూడా బోర్లు వేసిన దాఖాలాలు లేవు. ఇక రైతులకు చేదోడు వాదోడుగా ఉంటున్న పాడి పరిశ్రమపైన సైతం ప్రభుత్వం శీతకన్నే వేస్తోంది. గత ప్రభుత్వం సబ్సిడీపై దాణా అందించేది. కొత్త ప్రభుత్వంలో దాణా ఊసే లేదు. సీసీఆర్‌సీ కార్డుల మెలికపెట్టి కౌలు రైతులను మరింత అగాథంలోకి ప్రభుత్వం తోసేసింది. ఇక మద్దతు ధరలు అయితే అలంకారప్రాయంగా మిగిలాయి తప్ప వాటి వల్ల రైతులకు ఒనగూరే ప్రయోజనం గుండు సున్నాగా ఉంది. పథకాల విషయంలో గానీ, రాయితీల విషయంలో గానీ ప్రభుత్వ నిర్లక్ష్యం ఊడలు వేస్తుంటే మరో వైపు అన్నదాతలు బలవన్మరణాలు జిల్లాలో ఏదో ఒక మూల కనిపిస్తూనే ఉన్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం ఉత్తుత్తి  మాటలు పక్కన పెట్టి చిత్తశుద్ధిగా పథకాలు అమలు చేస్తే రైతులకు ఓదార్పు దక్కుతుంది.

ప్రహసనంగా రాయితీ యంత్రాలు..

2016 నుంచి 2019 వరకు వ్యక్తిగతంగా రైతులకు రాయితీ యంత్రాలు అందించే ప్రక్రియ నిరాటంకంగా కొనసాగింది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో దాదాపు రూ.100 కోట్ల పైనే వీటి మీద ఖర్చు చేయగా 50,000 మంది పైన రైతుల లబ్ధి పొందారు. ప్రస్తుతం రాయితీ యంత్రాలు అందించడం అనేది ఒక ప్రహసనంగా మారింది. రైతుకు అత్యవసరమైన ట్రాక్టరు అందించే విషయంలో కూడా ప్రభుత్వం పలుసార్లు పిల్లిమొగ్గలు వేసింది. రాయితీ యంత్రాలను గ్రూపులకు అందించి ప్రతి రైతు భరోసా కేంద్రంలో అందుబాటులో ఉంచుతామనే మాటలు తప్ప ఆచరణలో 20శాతం ఆర్‌బీకేలలో కూడా యంత్రాలు ఉంచకపోవడం రైతులపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని సూచిస్తోంది. 

సూక్ష్మసేద్యం మాటేమిటి?

గత ప్రభుత్వంలో బిందు, తుంపర సేద్యం వల్ల ఉమ్మడి గుంటూరు జిల్లావ్యాప్తంగా దాదాపు 60,000 మంది రైతులకు రాయితీ ఫలాలు దక్కాయి. 50,000 హెక్టార్లలో వివిధ పంటలు సూక్ష్మ సేద్యం పద్ధతిని అనుసరించి రైతులు సాగు చేపట్టారు. ప్రస్తుత ప్రభుత్వం ఒక్క ఎకరానికి డ్రిప్‌ రాయితీ అందించిన పాపాన పోలేదు. ఇటీవలే ఆ పథకం మీద సమీక్ష జరిపి భారీఎత్తున అమలు చేయబోతున్నామనే మాటలు తప్పితే ఇంతవరకు అడుగుముందుకు పడిన దాఖలాలు లేవు.


సూక్ష్మ పోషకాలది అదే దారి..

భూములు సారం కోల్పోకుండా మట్టి పరీక్షలు జరిపి రైతులకు సాయిల్‌ హెల్త్‌ మేనేజ్‌మెంట్‌ కార్డులను గత ప్రభుత్వం రైతులకు అందించేది. ఆ కార్డు ద్వారా రైతులకు జిప్సం, జింకు, బోరాన్‌ తదితరాలను పూర్తి ఉచితంగా గతంలో అందించేవారు. ఇప్పుడు ఆ రాయితీని 50 శాతానికి తగ్గించారు. ఇక భూసార పరీక్షలు అయితే పూర్తిగా అటకెక్కాయి.

పశువుల దాణాను పరిశీలిస్తే..

పశువులకు కూడా బలవర్థకమైన దాణాను అందిస్తేనే అవి ఆరోగ్యంగా ఉండడంతో  పాటు పాల దిగుబడి కూడా పెరుగుతుంది. రైతును పాడిని వేరు చేసి చూడలేం. అది గుర్తించే వ్యవసాయానికి సమానంగా పాడి పరిశ్రమను కూడా గత ప్రభుత్వం ప్రోత్సహించింది. దానిలో భాగంగా దాణాను సబ్సిడీపై అందించే కార్యక్రమం 2019 వరకు కొనసాగింది. ఆ తర్వాతనే ఆ పథకానికి గ్రహణం పట్టింది. 2016 నుంచి 2019 వరకు దాదాపు లక్షమంది రైతులు దాణా పథకం ద్వారా లబ్ధి పొందారు. ఆ తర్వాత పంపిణీ పూర్తిగా నిలిచిపోయింది.

ప్రభుత్వం శ్రద్ధ చూపకపోతే పోరుబాటే...

జిల్లాలో అధికశాతం మంది చిన్న, సన్నకారు రైతాంగమే కావడం వల్ల ప్రభుత్వం అందించే రాయితీలపై ఆశలు పెట్టుకుని సాగుకు సమాయత్తమవుతుంటారు. కానీ ఆచరణలో ఏవీ తమ దరికి చేరకపోవడంతో వారి పరిస్థితి మరింత దిగజారుతోంది. ఇప్పటికైనా ప్రభుత్వం రైతాంగం అవసరాలపై దృష్టి పెట్టి వాటి అమలును వేగిరం చేయకపోతే ఉద్యమించడానికి కూడా తాము సిద్ధంగా ఉన్నామని జిల్లా రైతాంగం చెబుతోంది.

 

Read more