మంత్రి మేరుగను భర్తరఫ్‌ చేయాలి

ABN , First Publish Date - 2022-09-17T06:08:21+05:30 IST

దళిత జాతిని అడ్డుపెట్టుకుని దనార్జనే ధ్యేయంగా మంత్రి మేరుగ నాగార్జున ఆర్జిస్తున్నాడని తెలుగుదేశం పార్టీ ఎస్సీసెల్‌ నాయకులు ఆరోపించారు.

మంత్రి మేరుగను భర్తరఫ్‌ చేయాలి
మేరుగనాగార్జున దిష్టిబొమ్మన దహనంచేస్తున్న టీడీపీ ఎస్సీ సెల్‌ నాయకులు

దళితజాతిని అవమానించేలా వ్యాఖ్యలు 

నాగార్జున దిష్టిబొమ్మ దహనం

తెనాలి రూరల్‌, సెప్టెంబరు 16: దళిత జాతిని అడ్డుపెట్టుకుని దనార్జనే ధ్యేయంగా మంత్రి మేరుగ నాగార్జున ఆర్జిస్తున్నాడని తెలుగుదేశం పార్టీ ఎస్సీసెల్‌ నాయకులు ఆరోపించారు. అసెంబ్లీలో దళిత ఎమ్మెల్యే బాలినేని వీరాంజనేయులును అవమానించినందుకు నిరసనగా శుక్రవారం గాంధీచౌక్‌ వద్ద మంత్రి దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  నాగార్జున దళితుడిగా ఉండి మరో దళితుడిపై అసభ్యంగా తిట్టడం హేయమన్నారు. నియోజకవర్గంలో దళిత కుటుంబానికి చెందిన కిరణ్‌ను కిరాతకంగా హతమారిస్తే అతడి కుటుంబానికి దళితుడిగా మంత్రి పదవిలో ఉండి ఎటువంటి న్యాయం చేశావని ప్రశ్నించారు. అనుచిత వ్యాఖ్యలు చేయడం మానుకోకుంటే మంత్రి ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఆయనను మంత్రి పదవినుండి బర్తరఫ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఎస్సీ సెల్‌ నాయకులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.

మంగళగిరిలో..

మంగళగిరి సిటీ: అసెంబ్లీ సాక్షిగా ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయస్వామిపై మంత్రి మేరుగ నాగార్జున చేసిన అనుచిత వ్యాఖ్యలపై టీడీపీ దళిత నేతలు భగ్గుమన్నారు. మంగళగిరి నియోజకవర్గ టీడీపీ కార్యాలయం డాక్టర్‌ ఎమ్మెస్సెస్‌ భవన్‌ నుంచి అంబేద్కర్‌ సెంటరు వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు. మంత్రి మేరుగ నాగార్జున, సీఎం జగన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మేరుగ చిత్రపటాన్ని చెప్పులతో కొట్టి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఎస్సీ సెల్‌ నేతలు మాట్లాడుతూ మంత్రి మేరుగ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు అత్యంత జుగుప్సాకరంగా వున్నాయన్నారు. ఎస్సీ కార్పొరేషన్‌ నిధులను దళితులకు ఒక్క పైసా కూడా ఇప్పించలేకపోయిన మంత్రి మేరుగ నిజంగా దళితులకే పుట్టాడా అని ప్రశ్నించారు. నాగార్జునను చదువుకున్న సంస్కార హీనుడిగా అభివర్ణించారు. కార్యక్రమంలో టీడీపీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు దొప్పలపూడి జ్యోతిబసు, అంగన్‌వాడీ సెల్‌ కార్యనిర్వాహక కార్యదర్శి కొడవటి జోజివాణి, గుంటూరు పార్లమెంటు ఎస్సీ సెల్‌ అధ్యక్షులు వేమూరి మైనర్‌బాబు, నియోజకవర్గ అధ్యక్షులు కనికళ్ల చిరంజీవి, నేతలు యర్రగుంట్ల భాగ్యారావు, మద్దిరాల రమేష్‌, కొమ్మా సుకుమార్‌, మల్లవరపు వెంకట్‌, ఈపూరి పెద్దబ్బాయి, మండెపూడి వీరయ్య, దిడ్లా సత్యానందం, వడ్డేశ్వరం చింతయ్య తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-09-17T06:08:21+05:30 IST