తడిసినా, రంగుమారినా కొనాల్సిందే

ABN , First Publish Date - 2022-12-13T03:20:45+05:30 IST

తుఫాన్‌ బాధితుల విషయంలో కలెక్టర్లు, అధికారులు అత్యంత మానవతా దృక్పథంతో వ్యవహరించాలి.

తడిసినా, రంగుమారినా కొనాల్సిందే

కలెక్టర్లు మానవతా దృక్పథంతో వ్యవహరించాలి

తుఫాను బాధితుల విషయంలో ఉదారంగా ఉండాలి

వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం జగన్మోహన్‌రెడ్డి

అమరావతి, డిసెంబరు 12(ఆంధ్రజ్యోతి): ‘‘తుఫాన్‌ బాధితుల విషయంలో కలెక్టర్లు, అధికారులు అత్యంత మానవతా దృక్పథంతో వ్యవహరించాలి. ఎన్యూమరేషన్‌ విషయంలో ఉదారంగా వ్యవహరించాలి’’ సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. మాండస్‌ తుఫాన్‌, భారీ వర్షాలపై సోమవారం తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయం నుంచి సీఎం కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ‘‘ఎక్కడా రైతులు నిరాశకు గురికాకూడదు. వర్షానికి తడిసినా, రంగు మారిన ధాన్యమైనా... కొనుగోలు చేయలేదన్న మాట ఎక్కడా రాకూడదు. తక్కువ రేటుకు కొంటున్నామన్న మాట ఎక్కడా వినిపించకూడదు. ఒక వేళ రైతులు తాము బయట అమ్ముకుంటున్నామన్నా సరే.. వారికి రావాల్సిన రేటు వారికి రావాలి. ఆ రేటు వచ్చేలా చూడాల్సిన బాధ్యత కూడా అధికారులదే. పంటలు దెబ్బతిన్న చోట మళ్లీ పంటలు వేసుకోవటానికి 80ు సబ్సిడీతో విత్తనాలు అందించాలి. పంటలు దెబ్బతిన్న ప్రతి రైతుకూ సబ్సిడీ విత్తనాలు అందాలి. ఎక్కడైనా ఇళ్లు ముంపునకు గురైతే ఆ కుటుంబానికి రూ.2 వేలుతో పాటు రేషన్‌ అందించాలి. నీళ్లు ఇంట్లోకి వచ్చి ఉంటే.. కచ్చితంగా వారికి సహాయాన్ని అందించాల్సిందే. పల్లె, పట్టణమన్న వివక్ష లేకుండా వారం రోజుల్లో ఈ సాయమందాలి. నష్టపరిహారం అంచనాల నమోదును వెంటనే ప్రారంభించాలి. వచ్చే వారం రోజుల్లో ఈ ప్రక్రియ ముగించాలి’’ అని అధికారులను సీఎం ఆదేశించారు.

Updated Date - 2022-12-13T03:20:45+05:30 IST

Read more