ఈ-వేస్ట్‌.. ఇంతింతై

ABN , First Publish Date - 2022-09-30T05:50:00+05:30 IST

సాంకేతికత పెరిగిన నేపథ్యంలో ప్రతి ఇంట్లో ఎలక్ట్రికల్‌ ఉపకరణాల వినియోగం పెరిగిపోయింది.

ఈ-వేస్ట్‌..  ఇంతింతై

నానాటికి పెరుగుతున్న ఎలక్ర్టికల్‌ వ్యర్ధాలు

రోజుకు దాదాపుగా 5- 8టన్నుల వరకు వస్తున్నట్టు అంచనా

రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం

ఆరోగ్యంపై కూడా ప్రభావం తప్పదంటున్న నిపుణులు

రీ సైక్లింగ్‌ కేంద్రాల ఏర్పాటే పరిష్కార మార్గం

 

 ఇప్పటికే వాయుకాలుష్యం, ప్లాస్టిక్‌ భూతాలతో పోరాడుతున్న నగరవాసులకు ఈ- వ్యర్ధాల రూపంలో మరో ప్రమాదం రాబోతోంది. పెద్ద పెద్ద నగరాలల్లో ప్రజలను ఇబ్బంది పెడుతున్న ఈ- మహమ్మారి మన జీవితాల్లోకి కూడా ప్రవేశించబోతోంది. మన జీవితాల్లో భాగమైన మొబైల్స్‌, కంప్యూటర్లు, ప్రింటర్లు, ఏసీలు, ఫ్రిజ్‌లు, టీవీలు, గీజర్లు కొంతకాలానికి వ్యర్ధాలుగా మారి మన మెడకే చుట్టుకోబోతున్నాయి. ఒకప్పుడు కేజీలకు మించని ఈ వ్యర్ధాలు నేడు దాదాపు రోజుకు 5- 8 టన్నుల వరకు చేరుకోవడమే ఇందుకు నిదర్శనం. పరిస్థితి ఇలానే ఉంటే మనుషుల ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

  

 గుంటూరు నగరంలో ప్రస్తుతం వస్తున్న చెత్తలో 7శాతం వరకు ఈ- వ్యర్ధాలు ఉంటున్నాయి. ఇది 16-20శాతం వరకు పెరిగితే ఈ- స్ర్కాబ్‌ ఎమర్జెన్సీ ప్రకటించే అవకాశం ఉంది. ఇది ఎంతో దూరం లేదని గణాంకాలు సూచిస్తున్నాయి. 


గుంటూరు(తూర్పు), సెప్టెంబరు 29: సాంకేతికత పెరిగిన నేపథ్యంలో ప్రతి ఇంట్లో ఎలక్ట్రికల్‌ ఉపకరణాల వినియోగం పెరిగిపోయింది.  కొవిడ్‌ సమయంలో వీటి వాడకం మరింత విస్తృతమైంది. ఆ ఎలక్ట్రికల్స్‌ ఇప్పుడిప్పుడే వ్యర్ధాలు కింద మారిపోతున్నాయి. వీటన్నిటినీ చాలామంది మామూలు చెత్తలోనే కలిపేస్తున్నారు. దీంతో మామూలు చెత్త రీ సైక్లింగ్‌ యూనిట్లు వద్ద వీటిని కొంతమంది వేరు చేసి విక్రయిస్తున్నారు. ఈ కారణంగా ఇవి రీ సైక్లింగ్‌కు వెళ్లకుండానే తిరిగి మన దగ్గరకే వస్తున్నాయి. మరికొన్ని వస్తువులు భూమిలో కలిసిపోకుండా అలానే ఉంటున్నాయి. ఈ వ్యర్ధాలను సేకరించే వ్యవస్థ ప్రస్తుతం మనకు అసలు లేకపోవడమే ఇందుకు కారణం.

 

అవగాహన లేకపోవడమే కారణం

ఈ- వ్యర్ధాల ప్రమాదాన్ని అంచనా వేసిన అధికారులు ఈ ఏడాది ప్రారంభంలో తడి, పొడి చెత్తలను విడిగా సేకరించడంతోపాటు, ఎలక్ట్రికల్‌, మెడికల్‌ వ్యర్ధాలను సేకరించేందుకు ప్రత్యేకంగా ఎర్రరంగు డబ్బాను ప్రతి ఇంటికీ అందించింది. కానీ ఎవరూ కూడా దీనిని వాడటం లేదు. ఇప్పటికి కూడా ఈ- వ్యర్ధాలను ఎలా అప్పగించాలి, ఎక్కడ వేయాలనేది ఇటు సేకరించేవారికి.. అటు ప్రజలకు స్పష్టత లేదనే చెప్పుకోవాలి.

 


2016లోనే శిక్షణ తరగతులు..

జిల్లాలో ఈ-వ్యర్ధాలను సంబంధించి రీ సైక్లింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేయడానికి గుంటూరు. ప్రకాశం, కృష్ణా రీజియన్‌ పరిధిలో 2016లో జిల్లా కాలుష్య నియంత్రణ మండలి అధికారులు విజయవాడలో ప్రత్యేక శిక్షణ నిర్వహించారు. ఈ-వ్యర్ధాలను ఎలా సేకరించాలి, వాటిలోని భాగాలను ఎలా వేరుచేయాలి. యంత్రాల ఏర్పాటు వంటి విషయాలపై దాదాపు నెల పాటు అవగాహన కల్పించారు. ఎవరైనా ఏర్పాటు చేసుకోవాలంటే వారికి ముద్ర ద్వారా రుణాలను అందించడానికి బ్యాంకులు కూడా ముందుకొచ్చాయి. ఈ శిక్షణ కార్యక్రమాలకు అప్పట్లో రీజియన్‌ పరిధిలో వందలాదిమంది యువకులు హాజరయ్యారు. ఆ తరువాత అది కార్యరూపం దాల్చలేదు. కాలుష్య నియంత్రణ మండలి, పరిశ్రమల శాఖలు అంతగా సహకరించకపోవడంతో అవి ఇంతవరకు కార్యరూపం దాల్చలేద నే విమర్శలు వినిపిస్తున్నాయి.


యువతకు ఉపాధి..

 ఈ-వ్యర్ధాల రీ సైక్లింగ్‌ వ్యవస్థ అనేకమందికి ఉపాధితో పాటు యువతలో నైపుణ్యం బయటకు తీసుకువచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పటికే విదేశాల్లో దీనిద్వారా అనేకమంది ఉపాధి పొందుతున్నారు. మన రాష్ట్రంలో కూడా విశాఖ వంటి నగరాల్లో కొంత మంది యువకులు నగరపాలక సిబ్బంది సహకారంతో ప్రతి దుకాణం వద్ద ఎలక్ట్రికల్‌ వ్యర్ధాలను సేకరించి వాటిని రీ సైక్లింగ్‌ చేసి అద్భుతాలు సృష్టిస్తున్నారు. ఈ ప్రక్రియ ద్వారా పనికోచ్చే వస్తువులను సంబంధిత దుకాణాల్లో విక్రయించి. విలువైన లోహాలను మరికొన్ని వస్తువులకు అమర్చడమేగాక, మిగిలిన ప్లాస్టిక్‌ వంటి వ్యర్ధాలను పర్యావరణ హితంగా ధ్వంసం చేస్తున్నారు.  


ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం..

 ఎలక్ట్రికల్‌ వస్తువులను కరిగించినపుడు విషవాయువులు గాల్లో కలుస్తాయి. ఇవి అటు పర్యావరణానికి, ఇటు మానవాళికి ముప్పుగా మారతాయి. ముఖ్యంగా పాలీవినైల్‌ క్లోరైడ్‌ లాంటి కాలుష్యం వెలువడుతుండటంతో మనిషి ఊపిరితిత్తులు దెబ్బతింటున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా లీడ్‌ లోహం వల్ల నరాల వ్యవస్థ, క్యాడ్మియంతో కిడ్నీ, మెర్క్యూరీ వల్ల మెదడు, బెరిలియం వల్ల హృదయ సంబంధిత వ్యాధుల బారిన పడే ప్రమాదముంది. 


వీలైనంత త్వరగా ఏర్పాటు చేయాలి

 వీలైనంత త్వరగా రీ- సైక్లింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేయాలి. దీనికి సంబంధించిన ప్రతిపాదనలు 2016 నుంచే అధికారుల వద్ద ఉన్నాయి. మామూలు చెత్తను సైక్లింగ్‌ చేయాలంటే అనేక సాంకేతిక సమస్యలు ఉంటాయిగాని, ఈ- వ్యర్ధాల సేకరణ, వాటి రీ సైక్లింగ్‌ లో అంత పెద్ద సమస్యలు తలెత్తవు. పెద్దగా ఖర్చుకూడా ఉండదు. ఉమ్మడి జిల్లాకు దాదాపు 10నుంచి 15 వరకు రీ సైక్లింగ్‌ కేంద్రాల అవసరం ఉంది. వీటిని ఏర్పాటు చేయడం వల్ల పర్యావరణం కాపాడుకోవడంతో పాటు యువతకు పెద్ద ఎత్తున ఉపాధి దొరుకుతుంది.

- డి.తిరుపతిరెడ్డి, నేషనల్‌ గ్రీన్‌కోర్‌ జిల్లా కో ఆర్డినేటర్‌  


ప్రజల భాగస్వామ్యం ముఖ్యం..

కొవిడ్‌ తరువాత ఈ- వ్యర్ధాలు పెరిగిన మాట వాస్తవం. రీ సైక్లింగ్‌ వ్యవస్థ లేకపోవడం కూడా లోపమే. ప్రస్తుతానికి జిల్లా ప్రధాన కేంద్రాల్లో అయిౖనా వీటిని ఏర్పాటు చేయాలి. ఇదే విషయాన్ని నగరపాలక సంస్థ సమావేశాల్లో అధికారులు. మేయరు దృష్టికి తీసుకెళ్తాం. వీటి ఏర్పాటుకు అంత పెద్ద స్థలం ఇతర సదుపాయాలు అవసరం ఉండదు కాబట్టి అధికారులు కూడా స్పందించాలి. అప్పటి వరకు వీటి సేకరణ, వేరు చేయడంలో ప్రజలు కూడా సిబ్బందికి సహకరించాలి

- కేఎస్‌ లక్ష్మణరావు ఎమ్మెల్సీ  

Read more